తెలంగాణ

నాలుగు రోజులలో లక్షలు చెల్లించండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 25: ప్రభుత్వ ఆక్రమిత స్థలాలను మధ్యతరగతి ప్రజానీకానికి నామమాత్రపు రుసుంతో క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం ప్రవేశపెట్టిన జీవో 59 కింద చెల్లింపులకు డిసెంబర్ నెలాఖరుతో గడువు ముగిసిపోనుంది. ఆక్రమిత స్థలాలకు దరఖాస్తుదారులు ఎంత మొత్తం డబ్బు చెల్లించాలో ఇంతకాలంగా కాలయాపన చేసిన రెవిన్యూ శాఖ, గడువు ముగియడానికి వారంముందు ఈనెల 23న నోటీసులు జారీచేసి చేతులు దులుపుకుంది. కాగా నోటీసులు జారీచేసిన మరుసటి రోజునుంచి బ్యాంకులకు ఈనెల 27 వరకూ వరుసగా సెలవులు వచ్చాయి. దీంతో డబ్బులు చెల్లించే వారికి మిగిలిన సమయం కేవలం ఈనెల 28 నుంచి 31 వరకు మాత్రమే. అలాంటప్పుడు మూడు రోజుల వ్యవధిలో సామాన్య మధ్యతరగతి దరఖాస్తుదారులు ఆదరాబాదరా లక్షలాది రూపాయలు రాత్రికిరాత్రి చెల్లించడం ఎలా సాధ్యమవుతుందో అర్థం కాని పరిస్థితితో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ప్రభుత్వ స్థలాల్లో నివాసాలు ఏర్పర్చుకున్న పేదలకు ఉచితంగా 125 గజాల స్థలాన్ని క్రమబద్ధీకరించడానికి జీవో 58, ఆపై ఎక్కువ స్థలాన్ని ఆక్రమించుకున్న మధ్యతరగతి ప్రజలకు నామమాత్రపు రుసుం చెల్లింపులతో క్రమబద్ధీకరించేందుకు జీవో 59 గత ఏడాది డిసెంబర్ నెలాఖరున విడుదల చేసింది. వీటికింద దరఖాస్తు చేసుకునేందుకు మొదట ఈ ఏడాది జనవరి నెలాఖరు వరకూ గడువు విధించింది. అయితే మొదట చెల్లింపుల కింద ఖరారు చేసిన మొత్తం మధ్యతరగతి ప్రజానీకానికి పెనుభారంగా ఉందని ప్రజా ప్రతినిధులు, వివిధ రాజకీయ పార్టీలు ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చాయి. దీంతో మొదట ఖరారు చేసిన మొత్తాన్ని తగ్గిస్తూ మార్గదర్శకాలలో మార్పు చేసి, మొదట విధించిన గడువును ఫిబ్రవరి నెలాఖరుకు పెంచింది. అలాగే సదరు ఆక్రమిత స్థలానికి రిజిస్ట్రేషన్ విలువలో 10 శాతం డబ్బుకు డిడిలు తీసి దరఖాస్తులు సమర్పించాలని ప్రభుత్వం నిబంధన పెట్టింది. దరఖాస్తుల్లో పేర్కొన్న స్థలాన్ని మండల రెవిన్యూ అధికారులు పరిశీలించి, ఎంత మొత్తాన్ని చెల్లించాలో దరఖాస్తుదారులకు ఆ వెంటనే డిమాండ్ నోటిసులు జారీ చేయాల్సి ఉంది. అయితే ఫిబ్రవరి నుంచి కాలయాపన చేసిన రెవిన్యూ శాఖ గడువు ముగియడానికి కేవలం వారంముందు నోటీసులు జారీ చేసి లక్షల రూపాయలు చెల్లించాలని నిబంధన పెట్టింది. పైగా ఇచ్చిన వారంలో బ్యాంకులకు వరసగా నాలుగురోజులు సెలవులు రావడంతో డబ్బులు చెల్లించేవారికి మిగిలింది కేవలం మూడు రోజులు మాత్రమే అవకాశం ఉంది. పైగా మూడు రోజుల్లో ప్రభుత్వానికి చెల్లించాల్సిన మొత్తాన్ని చెల్లించని పక్షంలో దరఖాస్తుపాటు చెల్లించిన మొత్తాన్ని తిరిగి ఇవ్వకపోగా, దరఖాస్తులను తిరస్కరించనున్నట్టు నోటీసుల్లో హెచ్చరించింది. దీంతో నోటీసులు అందుకున్న మధ్యతరగతి ప్రజానీకం ఇంత స్వల్ప వ్యవధిలో వేలు, లక్షలు ఏవిధంగా చెల్లించాలో పాలుపోక తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ఇదే విషయాన్ని క్షేత్రస్థాయిలో రెవిన్యూ అధికారుల వద్ద దరఖాస్తుదారులు వాపోతే, తమ చేతిలో ఏమి లేదని, భూపరిపాలన శాఖ కమిషనర్ నుంచి వచ్చిన ఆదేశాల మేరకే నోటీసులు ఇచ్చాం తప్ప తాము ఏమి చేయలేమని నిస్సహాయతను వ్యక్తం చేస్తునట్టు తెలిసింది. వెసులుబాటు రుసుంతో క్రమబద్ధీకరణకు అవకాశం కల్పించిన ప్రభుత్వం గడువు ముగియడానికి ముందు ఆదరాబాదరగా నోటీసులు జారీ చేయడంతో మధ్యతరగతి ప్రజానీకం ధిక్కుతోచని స్థితిలో తీవ్ర ఆందోళనకు గురి అవుతుంది. దీనిపై ప్రభుత్వం వెంటనే స్పందించి మధ్య తరగతి ప్రజానీకానికి అన్యాయం జరుగకుండా ఆదుకోవాలని అధికార పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు కొందరు రెవిన్యూ మంత్రి దృష్టికి తీసుకెళ్లనున్నట్టు హామీ ఇస్తున్నారు. ప్రభుత్వ స్పందన కోసం క్షేత్రస్థాయిలో రెవిన్యూ వర్గాలు వేచి చూస్తున్నాయి.