తెలంగాణ

‘ఆన్‌లైన్’లో ముందస్తు ఓటింగ్ హల్‌చల్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 24: శాసనసభ రద్దు కావడంతో సమీప భవిష్యత్తులోనే ఎన్నికలు జరుగనుండగా, ఎలక్షన్ కమిషన్ నగారా మోగించడానికి ముందే ఆన్‌లైన్‌లో ఓటింగ్ లింక్‌లు సందడి చేస్తున్నాయి. ఫలానా శాసనసభా నియోజకవర్గానికి తదుపరి ఎమ్మెల్యే ఎవరు?...బరిలో నిలుస్తున్న అభ్యర్థుల్లో ఎవరి వైపు ఓటర్లు ఎక్కువ సంఖ్యలో మొగ్గు చూపుతున్నారు...ఇప్పటివరకు ఎవరికి ఎంతమంది మద్దతుగా నిలిచారు...తదితర వివరాలతో సామాజిక మాధ్యమం(వాట్సప్)లో నియోజకవర్గాల వారీగా లింక్‌లు హల్‌చల్ సృష్టిస్తున్నాయి. ‘మీ ఓటు ఆన్‌లైన్‌లో వెంటనే వేయండి’ అంటూ ఆ లింక్‌లో పేర్కొనడంతో తమ నేతకే ఓటెయ్యాలంటూ ఆయా పార్టీలకు చెందిన నాయకుల అనుచరులు, కార్యకర్తలు ఈ మెసేజ్‌ను శరవేగంగా తమ ఫోన్లలోని అన్ని గ్రూపులకు ఫార్వర్డ్ చేస్తున్నారు. అయితే ఎలాంటి విలువ లేని, అనధికారికంగా కొనసాగుతున్న ఈ అంతర్యుద్ధం అసలు అవసరమా? అంటూ కొన్ని గ్రూపులలో పలువురు తమ ఆక్షేపణ తెలుపుతున్నప్పటికీ, ఆన్‌లైన్ ఓటింగ్ జోరు మాత్రం కొనసాగుతూనే వుంది. సోషల్ మీడియాను నాయకులు విపరీతంగా వాడుకోవడం ఇటీవలి కాలంలో పెచ్చుమీరిపోయిన విషయం విదితమే. కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులు తమ నేత గొప్పతనాన్ని చాటుతూ సామాజిక మాధ్యమాల్లో ఇబ్బడిముబ్బడిగా పోస్టింగ్‌లు పెడుతున్నారు. అధికార పార్టీ అనే కాకుండా ప్రతిపక్ష పార్టీల నాయకులకు సంబంధించి కూడా వాట్సప్ గ్రూపులు ఏర్పాటై ఉండడంతో కార్యకర్తలు ఎవరికి వారు ఆధిపత్యం కోసం సోషల్ మీడియాను వేదికగా వాడుకుంటున్నారు. తమ నాయకుడి పర్యటన జరిగిందంటే చాలు, సదరు నాయకుడు చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించిన సమాచారాన్ని వెనువెంటనే సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ప్రచారం చేసుకుంటున్నారు. ప్రధానంగా వాట్సప్ ఇందుకు ముఖ్య వేదికగా మారింది. ఈ గ్రూప్‌లలో వారు అభిమానించే నేతలను కూడా చేర్చారు. దీంతో నేతల మెప్పును పొందేందుకు నాయకులు, కార్యకర్తలు ఎవరికివారు పోస్టింగ్‌లు పెడుతూ నేతల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. తమ నేత గొప్ప అంటే, తమ నేతదే ఘనత అని నేరుగా వ్యాఖ్యానాలు చేస్తున్నారు.
ప్రధాన రాజకీయ పక్షాల మధ్యనే కాకుండా, ఆయా పార్టీలకు చెందిన నాయకుల నడుమ కూడా గ్రూపు రాజకీయాలు ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలో ఆధిపత్యాన్ని చాటుకునేందుకు వాట్సప్‌ను వినియోగిస్తూ ఆన్‌లైన్ పోల్ లింక్‌లను సృష్టించి హల్‌చల్ చేస్తున్నారు. గత వారంపది రోజులుగా వాట్సప్ గ్రూప్‌లలో నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలోని తొమ్మిది అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి వచ్చి పడుతున్న పోస్టింగ్‌లు అన్ని వర్గాల వారిలో ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి. వాట్సప్‌లో వచ్చిన లింక్‌ను ఓపెన్ చేయగానే ఎన్నికల్లో బరిలో నిలువనున్న తెరాస అభ్యర్థులతో పాటు విపక్ష పార్టీల నుండి పోటీ చేసేందుకు అవకాశం ఉన్న అభ్యర్థుల పేర్లు, ఫొటోలు కనిపిస్తూ, మీరు ఎవరికి ఓటేస్తారో తెలుపాలంటూ ప్రశ్నలు సంధించి వదిలారు. ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో తెలుసుకునే అవకాశాన్ని కూడా ఆ లింక్‌లోనే ఏర్పాటు చేయడంతో నేతల అనుచరులు, కార్యకర్తలు జోరుగా తమ నేతకే ఓటు వేయాలని అభ్యర్థిస్తూ వాట్సప్‌లో వారి మొబైల్‌లోని అన్ని గ్రూపులలో పోస్టింగ్ చేస్తున్నారు. వాట్సప్‌ను వేదికగా చేసుకుని సృష్టించిన ఈ ఆన్‌లైన్ పోల్‌లో ఫలితాలు ప్రతిపక్ష పార్టీలకు చెందిన నేతలకే ఎక్కువగా పోల్ అవుతున్న నేపథ్యంలో అధికార పార్టీ కార్యకర్తలు కూడా తమ నేతకే ఓటు వేయాలంటూ ప్రత్యేకంగా పోస్టింగ్‌లు పెడుతున్నారు. ఈ పోస్టింగ్‌లను ఫేస్‌బుక్‌లో కూడా చేరుస్తున్నారు. ఎన్నికల్లో ఎవరికి ఓటు వేయాలనేది ప్రజలు నిర్ణయించాల్సి ఉండగా, వారి అభిప్రాయాల మాటేమో గానీ సామాజిక మాధ్యమాన్ని అనుకూలంగా మల్చుకుని ఆన్‌లైన్ పోల్ అంటూ ముందస్తుగానే ఎన్నికల వేడిని రాజేస్తుండడం చర్చనీయాంశమవుతోంది.