తెలంగాణ

జోరుగా హుషారుగా.. ఊపందుకున్న బీజేపీ ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 5: తెలంగాణలో అమిత్ షా వ్యూహం, పార్టీ ప్రధానకార్యదర్శులు రామ్ మాధవ్, పి మురళీధరరావుల ప్రత్యక్ష పర్యవేక్షణతో బీజేపీ నేతలు జోరుగా హుషారుగా ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. తొలి నుండి బీజేపీ అద్భుతమైన ఫలితాలు సాధిస్తామని, ఈ ఫలితాలు అనూహ్యంగా ఉండబోతున్నాయని చెబుతోంది. అంతే కాదు, రాష్ట్రంలో ఏ పార్టీకి మెజార్టీ వచ్చినా, తాము కీలక పాత్ర పోషించనున్నామని కూడా పేర్కొంటోంది. అందుకు తగ్గట్టే ఇటీవలి కాలంలో బీజేపీ నేతలు గ్రామాలకు వెళ్లినపుడు భారీ ఎత్తున ప్రజలు తరలిరావడం, రోడ్ షోలు, పాదయాత్రలు, ఇంటింటి ప్రచారానికి అనూహ్యమైన స్పందన రావడంతో బీజేపీ నేతలు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. తెలంగాణలో ముందస్తు ఎన్నికలకు ఎంతో ధీమాతో అధికార పార్టీ వెళ్లినా, చాలా గ్రామాల్లో ఆపార్టీ నేతలకు చేదు అనుభవాలు ఎదురవుతుండగా, బీజేపీ నేతలకు ఘనస్వాగతం లభించడంతో రెట్టించిన ఉత్సాహంతో పార్టీ నేతలు ప్రచారం చేస్తున్నారు. ఇప్పటికే తెలంగాణలో మూడు బహిరంగ సభల్లో పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా పాల్గొన్నారు. హైదరాబాద్, కరీంనగర్, మహబూబ్‌నగర్ సభల తర్వాత పార్టీకి అనుకూల సంకేతాలు రావడం, మరో పక్క స్వామి పరిపూర్ణానంద బీజేపీలో చేరడంతో ప్రచారం ఊపందుకుంది. ఇప్పటికే తొలి దశలో 38 మంది అభ్యర్ధుల పేర్లను, రెండో దశలో 28 మంది అభ్యర్ధుల పేర్లను బీజేపీ ఖరారు చేసింది. మరో 25 మంది పేర్లను అధికారికంగా ప్రకటించకున్నా, అనధికారికంగా వారి ప్రచారానికి పార్టీ ఇప్పటికే గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నాలుగోదశలో మరో 20 నుండి 24 మంది అభ్యర్ధుల పేర్లను ప్రకటించేందుకు పార్టీ ఇప్పటికే కసరత్తు ప్రారంభించింది. మహా కూటమి అభ్యర్ధుల పేర్లను ప్రకటిస్తే కొంత మంది సీనియర్ నేతలు బీజేపీలోకి వచ్చేందుకు సానుకూలంగా ఉండటంతో ఆ జాబితా వరకూ వేచి చూసిన తర్వాతనే చివరి విడత పార్టీ అభ్యర్ధులను ప్రకటించనున్నట్టు తెలిసింది. ప్రతి నియోజకవర్గం నుండి దాదాపు ఆరేడు రథాలు గ్రామాల్లో తిరుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ , టీడీపీ అధికారికంగా అభ్యర్ధులను ప్రకటించకపోవడం, టీఆర్‌ఎస్ అభ్యర్ధులు ఇప్పటికే తమ ప్రచారంలో ఉండటంతో తాజాగా గ్రామాల్లో బీజేపీ పతాకాలు ఎగురుతున్నాయి. ప్రధానంగా కేంద్రంలో ప్రధాని నరేంద్రమోదీ తీసుకున్న ఆర్ధిక విధానాలు, రైతాంగం కోసం చేపట్టిన కార్యక్రమాలు, ఆరోగ్యబీమా- ఆయుష్మాన్ భారత్ పథకం, ఉపాధి- నైపుణ్యం- వికాసం కోసం చేపట్టిన కార్యక్రమాలపై ఎక్కువగా ప్రచారం చేస్తూనే మరో పక్క తెలంగాణకు కేంద్ర ప్రభుత్వం చేసిన సాయం గురించి వివరిస్తున్నారు. మిషన్ కాకతీయ, మెట్రో వంటి ప్రాజెక్టుల్లో కూడా కేంద్రం సాయం ఎంతో ఉందని, అయినా రాష్ట్రం కేంద్రం ఎంత పెద్ద ఎత్తున నిధులు ఇచ్చినా ఆ విషయాన్ని దాచిపెడుతూ ఇంకా కేంద్రంపై నిందలు వేస్తోందని బీజేపీ నేతలు గ్రామాల్లో ఇంటింటికీ వెళ్లి ప్రచారం చేస్తున్నారు. నాలుగైదు సీట్లు గెలిస్తే చాలు అనే పరిస్థితి నుండి కనీసం 20 నుండి 30 సీట్లు గెలిచే అవకాశం కనిపిస్తోందనే నమ్మకానికి పార్టీ నేతలు వచ్చారు. దీంతో ప్రచారాన్ని మరింత విస్తృతం చేయాలని, రానున్న రోజుల్లో ప్రధాని నరేంద్రమోదీ , పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్ షా ప్రచారంలో పాల్గొంటారని పార్టీ రాష్ట్ర నేతలు చెబుతున్నారు. అధికారికంగా మూడో జాబితా ప్రకటించగానే ప్రధాని పర్యటన ఖరారు అవుతుందని చెబుతున్నారు. ఈసారి ప్రధాని బహిరంగ సభను సూర్యాపేటలో ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. అలాగే కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, జాతీయ స్థాయి నాయకులు, కొంత మంది ముస్లిం నేతలను కూడా రంగంలోకి దించి ముస్లిం వోటర్లను గాలం వేసేందుకు పార్టీ అన్ని ఏర్పాట్లూ చేసుకుంది. రాజధాని నగరంలో డాక్టర్ కే లక్ష్మణ్, జీ కిషన్‌రెడ్డి, చింతల రామచంద్రారెడ్డి, రాజాసింగ్, ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్‌లు తమ ప్రచారాన్ని ముమ్మరం చేశారు. జహీరాబాద్‌కు చెందిన నేతలు సోమవారం నాడు బీజేపీలో చేరడంతో పార్టీలో ఉత్సాహం రెట్టింపైంది.
పార్టీ ప్రధానకార్యదర్శి పి మురళీధరరావు అశ్వరావుపేట, సత్తుపల్లి నియోజకవర్గాల్లో మంగళవారం నాడు పర్యటించనున్నారు. మరో పక్క కేంద్ర మంత్రి స్మృతి ఇరానీ రాజధానిలో విస్తృతంగా పర్యటించి ఇప్పటికే ప్రచారం చేపట్టారు.