తెలంగాణ

ప్రాంతీయ పార్టీల వైపే దేశ ప్రజల చూపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, మార్చి 15: దశాబ్దాల తరబడి అధికారంలో కొనసాగినప్పటికీ ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయలేకపోయిన జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలకు ప్రత్యామ్నాయంగా ప్రస్తుతం యావత్ భారతదేశ ప్రజలంతా ప్రాంతీయ పార్టీల వైపే దృష్టిని కేంద్రీకరిస్తున్నారని నిజామాబాద్ పార్లమెంటు సభ్యురాలు కల్వకుంట్ల కవిత అన్నారు. అంతర్జాతీయ స్థాయిలో ఆలోచించే దృక్పథం కలిగి ఉన్న ప్రాంతీయ పార్టీలతో కూడిన ఫెడరల్ ఫ్రంట్ కేంద్రంలో అధికారంలోకి వస్తేనే అన్ని ప్రాంతాల సమస్యలు పరిష్కారానికి నోచుకుంటాయని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ నెల 19న పార్లమెంటు ఎన్నికల ప్రచారం నిమిత్తం నిజామాబాద్‌లో నిర్వహించనున్న భారీ బహిరంగ సభకు ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరవుతుండడంతో, శుక్రవారం ఎంపీ కవిత, మంత్రి వేముల ప్రశాంత్‌రెడ్డి తదితరులు ఏర్పాట్లను సమీక్షించారు. సభా ప్రాంగణాన్ని సందర్శించి శ్రేణులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఎంపీ కవిత మాట్లాడుతూ, జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీలు స్వార్ధ రాజకీయ ప్రయోజనాల కోసం మందిరం, మసీదు అని, రఫేల్, బోఫోర్స్ కుంభకోణాలంటూ పరస్పరం విమర్శలు చేసుకుంటూ తమ తప్పిదాలను కప్పిపుచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నాయని దుయ్యబట్టారు. ఇలాంటి పరిస్థితుల్లో తెరాసను 16ఎంపీ స్థానాల్లో గెలిపిస్తే, కేంద్రంలో ఏర్పడనున్న సంకీర్ణ ప్రభుత్వం కేసీఆర్ తన దార్శనికతతో కీలకపాత్ర పోషించే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటికే తెలంగాణలో కేసీఆర్ సర్కార్ అమలు చేస్తున్న రైతుబంధు, రైతుబీమా, మిషన్ భగీరథ, షీ టీమ్‌లు, కేసీఆర్ కిట్ వంటి అనేక సంక్షేమ పథకాలు యావత్ దేశానికి స్ఫూర్తిదాయకంగా మారాయని గుర్తు చేశారు. చివరకు కేంద్రంలోని మోడీ సర్కార్ సైతం ఎన్నికల్లో లబ్ధి పొందాలనే ఆశతో హడావుడిగా రైతుబంధును పోలిన పథకాన్ని ప్రవేశపెట్టిందని అన్నారు. అయితే తెలంగాణలో సమగ్ర భూ సర్వే జరిపి, రైతులకు పట్టా పాస్‌బుక్‌లు అందించిన తరువాతే రైతుబంధు నగదు పంపిణీ చేపట్టామని, దేశంలోని మిగతా రాష్ట్రాల్లో ఈ తరహా కసరత్తులు జరగనందున కేంద్రం ఆదరాబాదరగా ప్రవేశపెట్టిన ఈ పథకం ద్వారా అర్హులైన రైతులందరికీ ఎలా న్యాయం చేస్తుందని ఎంపీ కవిత ప్రశ్నించారు. మరోవైపు కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీ కూడా నిరుపేదలకు నెలనెలా ఆర్థిక సహాయం చేస్తామంటూ ప్రజలను వంచించేందుకు ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు. మాజీ ప్రధాని ఇందిరాగాంధీ నుండి మొదలుకుని ప్రస్తుతం ఆమె మనవడు రాహుల్‌గాంధీ వరకు కూడా కాంగ్రెస్ పార్టీ ‘పేదరికం’ నినాదంతోనే పబ్బం గడుపుకుంటున్నారని ఎద్దేవా చేశారు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు దొందు దొందేనని విమర్శించారు.