తెలంగాణ

మాపై కుట్రపన్నారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 15: తెలంగాణ ఆవిర్భావం తర్వాత తెరాసను అధికారంలో కొనసాగనీయకుండా రాష్టప్రతి పాలన పెట్టాలని కుట్ర జరిగిందని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు బాంబుపేల్చారు. ఈ రహాస్యాన్ని తొలిసారి బయట పెడుతున్నానని ముఖ్యమంత్రి సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ఏర్పడినప్పటికీ ఇక్కడ ప్రభుత్వాన్ని బతకనీయకుండా రాష్ట్రాన్ని రాజకీయంగా అస్థిరపర్చే ఉద్దేశంతో కాంగ్రెస్, తెదేపాలు కలిసి కుట్రపన్నాయని, అలాంటి కుట్రలు ఇంకా జరుగుతూనే ఉన్నాయని సిఎం తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఆ పరిస్థితి రాకుండా తెలంగాణను రాజకీయంగా సుస్థిరపర్చేందుకే ఇతర పార్టీల నేతలు తెరాసలో చేరుతున్నారని సిఎం వ్యాఖ్యానించారు. తెలంగాణ భవన్‌లో బుధవారం సిఎం కెసిఆర్ సమక్షంలో కాంగ్రెస్‌కు చెందిన ఎంపీ గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్యే భాస్కర్‌రావు, ఆ పార్టీ నేతలు వివేక్, వినోద్, సిపిఐ ఎమ్మెల్యే రవీంద్రకుమార్ తదితరులు తెరాసలో చేరారు. ఈ సందర్భంగా సిఎం మాట్లాడుతూ 3ఒక ముఖ్యమైన విషయాన్ని మీతో పంచుకుంటున్నా2 అన్నారు. గత ఎన్నికల్లో తెరాస సొంతంగా 63మంది ఎమ్మెల్యేలను గెలుచుకొని ప్రభుత్వ ఏర్పాటుకు సన్నద్ధమవుతున్న తరుణంలోనే రాష్ట్రంలో రాష్టప్రతి పాలన పెట్టాలన్న కుట్ర జరిగిందన్నారు. తాను సిఎంగా బాధ్యతలు స్వీకరించకముందు డిజిగ్నెటెడ్ సిఎంగా ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి, ఎంఐఎం ఎంపి అసదుద్దీన్ ఒవైసీ నుంచి రాష్టప్రతి పాలనకు సంబంధించిన కుట్ర గురించి తనకు తెలిసిందన్నారు. తెలంగాణను ఎలాగైనా రాజకీయంగా అస్థిరపర్చాలని కాంగ్రెస్, తెదేపా కలిసి రాష్టప్రతి పాలనకు కుట్ర పన్నుతున్నట్టు ఒవైసీ తనకు చెప్పారన్నారు. వచ్చిన తెలంగాణ రాష్ట్రాన్ని బతుకనీయరా? ఇదేంటి అన్యాయం, అలాంటి పరిస్థితిని ఎట్టిపరిస్థితుల్లో రాకుండా ఉండేందుకు ఎంఐఎం అండగా ఉంటుందని ఒవైసీ ముందుకొచ్చారని కెసిఆర్ తెలిపారు. తనను స్వయంగా కలిసి మద్దతు పలికిన ఒవైసీ, ఆ మరుసటి రోజునే తెరాస ప్రభుత్వానికి మద్దతిస్తున్నట్టు ప్రకటించారని సిఎం గుర్తు చేశారు. తెలంగాణ ఆవిర్భావం జరుగకుండా అడ్డుపడాలని, కుదరనిపక్షంలో ఇక్కడ ప్రభుత్వం ఏర్పడకుండా చూడాలని అధికారం కోసం అర్రులు చాచే కాంగ్రెస్, తెదేపాలు చివరివరకూ అనేక కుట్రలు పన్నాయని, ఆ కుట్రలు ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నాయని ఘాటుగా విమర్శించారు. వారి కుట్రలను తిప్పికొట్టాలని, తెలంగాణ రాష్ట్రం నిలిచి గెలిచేందుకే రాజకీయ పునరేకీకరణలో భాగంగా తమ పార్టీలోకి చేరికలు తప్ప, చిల్లర మల్లర రాజకీయం కానేకాదన్నారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రం రాజకీయంగా, ఆర్థికంగా సుస్థిరంగా ఉందన్నారు. దేశంలోనే నంబర్‌వన్ రాష్ట్రంగా ఆదాయ వృద్ధి సాధించిందన్నారు. తమ ఎమ్మెల్యేను కొంటున్నారని, తెరాసలో చేర్చుకోవడం అనైతికమని కాంగ్రెస్ నేతలు కొందరు విమర్శిస్తున్న అంశాన్ని ప్రస్తావిస్తూ, మరి గతంలో మా పార్టీనుంచి 16మంది ఎమ్మెల్యేలు గెలిస్తే, వారిలో 10మంది ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో చేర్చుకున్నప్పుడు అనైతికం అనిపించలేదా? అని జానారెడ్డిని ప్రశ్నించారు. మీరు చేస్తే సంసారం, మేం చేస్తే వ్యభిచారమా? అంటూ నిలదీశారు. తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకుంటున్న తెదేపాతో పాలేరు ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పొత్తు ఎలా పెట్టుకుంది? అది అనైతికం కాదా? అని సిఎం నిలదీశారు. తమ ఎంపీ విజయశాంతి, ఎమ్మెల్యే అరవింద్‌రెడ్డిని కాంగ్రెస్ తనవైపు లాక్కునప్పుడు అది అనైతికమన్న విషయం గుర్తుకు రాలేదా? అని ధ్వజమెత్తారు. అందుకే గత అనుభవాలతో మొహమాటానికి పోకుండా సమైక్యవాదుల కుట్రలకు బలికావద్దనే వందకు వందశాతం రాజకీయంగా సుస్థిరత సాధించేందుకు ప్రభుత్వాన్ని బలోపేతం చేసుకుంటున్నామని సిఎం అన్నారు. ఎవరెన్ని ఆశలు పెట్టుకున్నా 2019లోనూ తామే అధికారంలోకి వస్తామని సిఎం అన్నారు.

చిత్రం.. తెలంగాణ భవన్‌లో సిఎం కెసిఆర్ సమక్షంలో తెరాసలో చేరిన ఎంపీ గుత్తా,
ఎమ్మెల్యేలు భాస్కర రావు, రవీంద్రకుమార్, కాంగ్రెస్ నేతలు వివేక్, వినోద్ తదితరులు