తెలంగాణ

కాంగ్రెస్‌కు మరోషాక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, మార్చి 24: అసెంబ్లీ ఎన్నికల్లో ఎదురైన పరాజయాల నుండి తేరుకోకముందే టీఆర్‌ఎస్ ఆపరేషన్ ఆకర్ష్‌కు ఎమ్మెల్యేల వలసలతో డీలా పడిన కాంగ్రెస్ పార్టీకి పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు పార్టీని వీడుతున్న పర్వం కొనసాగుతుండటం మరింత సంకటంగా మారింది. ఆదివారం ఆలేరు మాజీ ఎమ్మెల్యే, యాదాద్రి భువనగిరి జిల్లా డీసీసీ అధ్యక్షుడు బూడిద భిక్షమయ్యగౌడ్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా ప్రకటించి పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్‌కు గట్టి షాక్ నిచ్చారు. భువనగిరిలో మీడియా సమావేశంలో ఈ మేరకు భిక్షమయ్యగౌడ్ తన నిర్ణయాన్ని వెల్లడించారు. బూడిద నిర్ణయం భువనగిరి పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేస్తున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డికి ఇబ్బందికరంగా తయారైంది. పార్టీనీ వీడుతు బూడిద భిక్షమయ్యగౌడ్ కాంగ్రెస్‌పైన, కోమటిరెడ్డి బ్రదర్స్‌పైన తీవ్ర విమర్శలు గుప్పించారు. పార్టీలో బీసీలకు అన్యాయం జరుగుతుందని, సామాజిక న్యాయం కొరవడిందని, ఉమ్మడి జిల్లాలోని రెండు పార్లమెంట్ స్థానాల్లో ఒకటి బీసీలకు ఇవ్వాలని కోరిన కాంగ్రెస్ నాయకత్వం పట్టించుకోలేదంటు దుయ్యబట్టారు. పైగా తాను శాసనసభ ఎన్నికల్లో రెండుసార్లు ఓడిపోవడానికి కారణమైన కోమటిరెడ్డి బ్రదర్స్‌కు భువనగిరి టికెట్ కేటాయించారని ఈ పరిణామాల నేపధ్యంలో తాను కాంగ్రెస్‌ను వీడి, కేసీఆర్, కేటీఆర్ పాలనకు ఆకర్షితుడనై టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్లుగా ప్రకటించారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌కు తన ఉసురు తగులుతుందని వారు రాజకీయంగా సర్వనాశనమైపోవాలంటు దూషిస్తు వారిపై భిక్షమయ్యగౌడ్ శాపనార్ధాలు పెట్టారు.
2009అసెంబ్లీ ఎన్నికల్లో మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తంరెడ్డి అనుఛరుడిగా ఆలేరు కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన బూడిద భిక్షమయ్యగౌడ్ టీఆర్‌ఎస్ ప్రత్యర్ధి కళ్లెం యాదగిరిగిరెడ్డిపై 54వేల ఓట్లతో గెలుపొందారు. 2014, 2018అసెంబ్లీ ఎన్నికల్లో ఇదే నియోజకవర్గం నుండి కాంగ్రెస్ అభ్యర్ధిగా పోటీ చేసిన బూడిద రెండుసార్లు టీఆర్‌ఎస్ ప్రత్యర్ధి గొంగిడి సునీత చేతిలో ఓటమి చెందారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా పనిచేసి నూతన యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షుడిగా ఉన్న బూడిద భిక్షమయ్యగౌడ్ కాంగ్రెస్‌లో ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వర్గీయుడిగా కొనసాగుతున్నారు. బూడిద పార్టీలో మొదటి నుండి కోమటిరెడ్డి బ్రదర్స్‌కు వ్యతిరేకంగా ఉంటున్నారు. భువనగిరి పార్లమెంట్ స్థానం నుండి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పోటీ చేస్తున్న సందర్భంలో బూడిద కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతుండటం ఎన్నికల వేళ కాంగ్రెస్‌ను ఇరకాటంలో నెట్టింది. ఇదే సమయంలో భువనగిరి టీఆర్‌ఎస్ అభ్యర్ధి సిట్టింగ్ ఎంపీ బూర నర్సయ్యగౌడ్ సామాజిక వర్గానికే చెందిన భిక్షమయ్యగౌడ్ టీఆర్‌ఎస్‌లో చేరడం టీఆర్‌ఎస్‌కు సానుకూలంగా కనిపిస్తుంది.
చిత్రం.. కాంగ్రెస్‌కు రాజీనామా చేసి టీఆర్‌ఎస్‌లో చేరుతున్నట్టు ప్రకటిస్తున్న డీసీసీ అధ్యక్షుడు,
ఆలేరు మాజీ ఎమ్మెల్యే బూడిద భిక్షమయ్యగౌడ్