తెలంగాణ

గడ్చిరోలిలో ఎన్‌కౌంటర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, జూన్ 19: ఆదిలాబాద్ జిల్లా సరిహద్దులోని మహారాష్ట్ర గడ్చిరోలి జిల్లాలో ఆదివారం ఉదయం జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ముగ్గురు మావోయిస్టులు హతమయ్యారు. తెలంగాణ గ్రేహౌండ్స్ దళాల ఆపరేషన్‌తో మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఉదయం 5.30కు గడ్చిరోలి జిల్లా ఐరి తాలూకా వెంకటాపూర్ అటవీ శివారు ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల ఘటనలో ముగ్గురు నక్సల్స్ మృతి చెందినట్టు పోలీసులు ధృవీకరించగా, ఒక ఏకె47 రైఫిల్, స్టెన్ గన్, 303 రైఫిల్‌ను స్వాధీనపర్చుకున్నట్టు చెప్పారు. వీరిలో మావోయిస్టు పార్టీలో కీలక నేతలైన ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఇద్దరు నక్సల్స్ మృతి చెందడం కలకలం సృష్టించింది. మావోయిస్టు డివిజన్ కమిటీ సభ్యుడు, మంగి ఏరియా కమిటీ కార్యదర్శి అత్రం శోభన్ అలియాస్ చార్లెస్, మంగి ఏరియా దళ కమిటీ సభ్యుడు ముఖేష్ మృతి చెందినట్టు ఐరి పోలీసులు ధ్రువీకరించారు. మరో నక్సలైట్ దినేష్ ఐరి ఏరియా కమిటీ దళ సభ్యుడిగా గుర్తించారు. ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన మావోయిస్టు అత్రం శోభన్ అలియాస్ చార్లెస్ మావోయిస్టు డివిజన్ కమిటీ కార్యదర్శిగా గడ్చిరోలి జిల్లాలో కీలక బాధ్యతలు నిర్వహిస్తూనే ఆదిలాబాద్ జిల్లా మంగి కమిటీ ఏరియా కార్యదర్శిగా కార్యకలాపాలు సాగిస్తున్నారు. తిర్యాని మండలం రొంపెల్లికి చెందిన శోభన్ చిన్న వయసులోనే తల్లిదండ్రులను కోల్పోగా తాతవద్ద ఉండి 8వ తరగతి వరకు చదివాడు. 2004లో ఆజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు. పార్టీలో పలు హోదాల్లో పనిచేసిన శోభన్ గత ఏడాది అక్టోబర్‌లో తిర్యాణి మండలం కైరిగూడలో ఇన్‌ఫార్మర్ నెపంతో బల్లార్ష అనే గిరిజనుడిని కాల్చిచంపిన సంఘటన అలజడి రేపింది. శోభన్‌పై 20 కేసులు నమోదుకాగా, ప్రభుత్వం రూ.5 లక్షల రివార్డు కూడా ప్రకటించింది. ఇదిలావుంటే ఎన్‌కౌంటర్ ఘటనపై భిన్న కథనాలు వినిపిస్తున్నప్పటికీ గ్రేహౌండ్స్ దళాలకు చెందిన 63మంది పోలీసులు ప్రాణహిత తీరంలో జల్లెడపడుతూ వలలో చిక్కిన ముగ్గురు మావోలను వ్యూహాత్మకంగానే మట్టుబెట్టినట్టు ప్రచారం సాగుతోంది. దండకారణ్యంలో మావోయిస్టులకు షెల్టర్‌జోన్‌గా భావించే ప్రాణహిత తీరంలో గత ఆరు నెలలుగా నక్సల్స్ పోలీసుల మధ్య హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడంతో ఈ సరిహద్దు ప్రాంతాల్లో భయానక వాతావరణం నెలకొంది. మరోవైపు ఇదే ప్రాంతంలోని బెజ్జూర్ మండలంలోని గూడెం వంతెన నిర్మాణ పనులను నక్సల్స్ అడ్డగించి గత ఏప్రిల్ 26న భారీ యంత్రాలను దగ్ధం చేయడంతో తెలంగాణ పోలీసులు కూంబింగ్ ఆపరేషన్ ముమ్మరం చేశారు. గూడెం వంతెన వద్ద మావోల విధ్వంస సంఘటన నేపథ్యంలో ఇంటిలిజెన్స్ ఐజి శివధర్ రెడ్డి, పోలీసు ఉన్నతాధికారులు సజ్జనార్, నవీన్‌చంద్, స్టిఫెన్ రవీంద్ర తదితరులు ఈ ప్రాంతంలో ఏరియల్ సర్వే నిర్వహించి వ్యూహాత్మకంగా నిఘా ముమ్మరం చేశారు. జిల్లా ఎస్పీగా పనిచేసిన తరుణ్ జోషి ఇటీవలే గ్రేహౌండ్స్ కమాండర్‌గా బదిలీపై వెళ్లగా గోదావరి ఖనిలో తిష్టవేసి ఎన్‌కౌంటర్‌కు పథకరచన గావించినట్టు తెలుస్తోంది. ఎన్‌కౌంటర్‌లో ముగ్గురు మావోయిస్టులు మృతిచెందగా అందులో ఇద్దరు ఆదిలాబాద్ జిల్లా కీలక నేతలు ఉండడంతో జిల్లా మావోయిస్టు పార్టీకి కోలుకోలేని దెబ్బగా భావిస్తున్నారు.

చిత్రం... ఎన్‌కౌంటర్‌లో మృతి చెందిన అత్రం శోభన్ అలియాస్ చార్లెస్