తెలంగాణ

అంగన్‌వాడీ టీచర్ నిర్లక్ష్యంపై కలెక్టర్ విస్మయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, జూలై 11: ఒక అంగన్‌వాడీ టీచర్ నిర్లక్ష్యం జిల్లా కలెక్టర్ పర్యటనలో బయటపడింది. చిన్నారులు ఉన్న గదిలో గ్యాస్ స్టవ్ వెలిగించి తలుపులు వేసి అలాగే బయటకు వెళ్లిపోయన అంగన్‌వాడీ టీచర్ చర్యపై కలెక్టర్ తొలుత విస్మయం చెంది, అనంతరం ఆగ్రహం వ్యక్తం చేశారు. దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయ. మహబూబ్‌నగర్ జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ చెంచుల భూసమస్యలను తెలుసుకోవడానికి గురువారం ఉదయం హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామానికి బయలుదేరారు. కొనగట్టుపల్లి గ్రామంలోకి కారులో వెళ్తుండగా రోడ్డుపక్కనే గల ఓ అంగన్‌వాడీ కేంద్రం తలుపులు మూసి ఉండడం ఆ కిటికిల్లో నుండి చిన్నారులు అరుస్తూ ఉండటం కలెక్టర్ దృష్టిలో పడింది. వెంటనే కలెక్టర్ అంగన్‌వాడీ కేంద్రం దగ్గరకు వెళ్లారు. అంగన్‌వాడీ కేంద్రం మూసి ఉంచిన గేటు తలుపుదగ్గరకు వెళ్లి చిన్నారులను ప్రశ్నించారు. లోపల అంగన్‌వాడీ టీచర్, ఆయాలు ఉన్నారా? అంటూ చిన్నారులను అడిగారు. వారిద్దరూ లోపల లేరని చిన్నారులు కలెక్టర్‌కు తెల్చిచెప్పారు. టీచర్, ఆయా లేకుండా మిమ్మల్ని లోపల వేసి చిలుకు ఎవరు పెట్టారని ఆయన అడుగగా, తమ టీచర్, ఆయాలు లోపల ఉంచి వెళ్లిపోయారని కలెక్టర్‌కు తెలిపారు. వెంటనే కలెక్టర్ స్వయాన అంగన్‌వాడీ కేంద్రం తలుపులు తెరిచారు. అంగన్‌వాడీ కేంద్రాన్ని పరిశీలించగా గ్యాస్ స్టవ్‌పై పిల్లలకు వడ్డించే ఆహరపదార్థాలు వంట చేస్తున్నట్టు కనబడ్డాయి. కలెక్టర్‌కు అనుమానం వచ్చి గ్యాస్‌స్టవ్ దగ్గరకు వెళ్లి చూడగా అది మండుతూ కనబడింది. ఇదేమిటంటూ కలెక్టర్ ఆశ్చర్యానికి గురయ్యారు. చిన్నారులను లోపల వేసి గ్యాస్‌స్టవ్ వెలిగించి అంగన్‌వాడీ టీచర్, ఆయాలు ఎక్కడికి వెళ్లినట్టు అని అక్కడే ఉన్న కొందరు గ్రామస్థులను కలెక్టర్ ప్రశ్నించారు. తమకు తెలియదంటూ వారు సమాధానం తెలిపారు. స్టవ్‌ను వెలిగించి బయటకు వెళ్లడం ఏమిటి? చిన్నారులు తెలియకుండా స్టవ్ దగ్గరకు వస్తే పరిస్థితి ఏంటని కలెక్టర్ ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అక్కడి నుండే తన మొబైల్ ద్వారా ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. వారిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొనగట్టుపల్లి అంగన్‌వాడీ టీచర్, ఆయాలపై నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. కలెక్టర్ వెంట వచ్చిన వారితో పాటు గ్రామస్థులు కూడా అంగన్‌వాడీ కేంద్రంలో స్టవ్‌ను వెలిగించి పిల్లల్ని లోపల ఉంచి టీచర్, ఆయా వెళ్లిపోవడాన్ని గమనించి ఆశ్చర్యానికి గురయ్యారు. జిల్లా కలెక్టర్ రోనాల్డ్‌రోస్ దాదాపు అంగన్‌వాడీ కేంద్రం దగ్గర 20 నిమిషాలకు పైగా ఉన్నా అంగన్‌వాడీ టీచర్‌గానీ, ఆయా గానీ అక్కడికి రాకపోవడంతో వెలుగుతున్న స్టవ్‌ను అక్కడే ఉన్న గ్రామస్థులతో బంద్ చేయించారు. ఇలాంటి నిర్లక్ష్యాన్ని సహించబోమని కలెక్టర్ తెలిపారు. అంగన్‌వాడీ టీచర్‌తో పాటు, ఆయాను సస్పెండ్ చేస్తున్నామని ఇది చాలా నిర్లక్ష్యమని కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదేవిధంగా మండలంలో ఐసీడీఎస్ సూపర్‌వైజర్‌ల పర్యావేక్షణ నిర్లక్ష్యం కూడా ఉండొచ్చని వారిపై కూడా చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. కాగా కలెక్టర్ ఒకవేళ అంగన్‌వాడీ కేంద్రానికి వెళ్లకుండా ఉంటే స్టవ్‌పై ఉన్న వంటకాలు ఉడికి మాడిపోయి ఉండే ప్రమాదం జరిగేదని పలువురు చర్చించుకున్నారు.
చిత్రం... హన్వాడ మండలం కొనగట్టుపల్లి గ్రామంలో తాళం వేసి ఉన్న అంగన్‌వాడీ కేంద్రం లోపల ఉన్న చిన్నారులతో మాట్లాడుతున్న కలెక్టర్ రోనాల్డ్‌రోస్