తెలంగాణ

సాగు, తాగునీటికి ఢోకా లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురిసి జలాశయాలు నిండటంతో సాగునీరు, మంచినీటికి ఢోకా లేదని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు అన్నారు. అయితే నిజాంసాగర్, సింగూరు ప్రాజెక్టుల్లోకి సరిపడ నీరు రాకపోవడంతో ఈ రెండు ప్రాజెక్టుల పరిధిలోని గ్రామాలకు మంచినీటిని అందించడానికి ప్రత్యామ్నాయ, తాత్కాలిక ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. కాళేశ్వరం ప్రాజెక్టును శ్రీరామ్‌సాగర్ అనుసంధానం చేయడంతో భవిష్యత్‌లో శ్రీరామ్‌సాగర్ ఆయకట్టుకు ఢోకా ఉండదని ధీమా వ్యక్తం చేశారు. అసెంబ్లీలో గురువారం ఉమ్మడి నిజామాబాద్ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో స్పీకర్ చాంబర్‌లో సీఎం కేసీఆర్ సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల పరిధిలోని ప్రాంతాలకు సాగునీరు, మంచినీటిని అందించడానికి సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను సీఎం ఆదేశించారు. నిజాంసాగర్, సింగూరులో నీటి లభ్యత తక్కువగా ఉండటంతో దీని పరిధిలోని గ్రామాలకు ఈ ఏడాది మంచినీటి ఎద్దడి తలెత్తకుండా ప్రత్యామ్నాయ, తాత్కాలిక చర్యలకు ప్రణాళిక రూపొందించాలని ఆదేశించారు. వచ్చే నెలలో రెండు రోజుల పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో పర్యటించి సాగునీరు, మంచినీరు, పోడు భూముల సమస్యను ప్రజలతో చర్చించి, శాశ్వతంగా పరిష్కరించనున్నట్టు సీఎం వెల్లడించారు. కాళేశ్వరంతో శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టును అనుసంధానం చేయడం వల్ల భవిష్యత్ దీని ఆయకట్టుకు ఢోకా ఉండదన్నారు. గుత్స, అలీసాగర్ మాదిరిగా ఎత్తిపోతల ద్వారా బాన్స్‌వాడ, ఆర్మూరు, బాల్కొండ నియోజకవర్గాలకు సాగునీరు అందిస్తామన్నారు. దీని కోసం తక్షణం సర్వేలు జరిపి ఎత్తిపోతలు ఎక్కడెక్కడ ఏర్పాటు చేసి ఎన్ని ఎకరాలకు సాగునీరు అందించవచ్చో తేల్చాలని నీటిపారుదలశాఖ అధికారులను సీఎం ఆదేశించారు. ప్రతీ ఏటా 90 టీఎంసీలకు తక్కువ కాకుండా శ్రీరామ్‌సాగర్ ప్రాజెక్టును నింపాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వీలైనంత మేరకు ఎక్కువ ఆయకట్టుకు నీరు అందించాలని సూచించారు. హైదరాబాద్ మెట్రోవాటర్ వర్క్స్, పరిగి, కోమటిబండ, శ్రీరామ్‌సాగర్ నుంచి ఎక్కడి నుంచి అవకాశం ఉంటే అక్కడి నుంచి నిజాంసాగర్, సింగూరు పరిధిలోని గ్రామాలకు మంచినీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలన్నారు. నీటి సరఫరాకు అవకాశం లేని చోట ట్యాంకర్లు, బోర్ల ద్వారా నీరందించాలని సీఎం సూచించారు. ప్రజలు వేసవిలో మంచినీటి ఎద్దడిని ఎదుర్కొకుండా ఇప్పటి నుంచే ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు.
ఈ ఒక్క ఏడాదికే సింగూరు, నిజాంసాగర్ పరిధిలో సమస్య ఉంటుందన్నారు. వచ్చే ఏడాది మల్లన్నసాగర్ ద్వారా ఈ రెండు ప్రాజెక్టులకు నీరు అందిస్తామన్నారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని కొన్ని చోట్ల పోడు వ్యవసాయం చేస్తున్న రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. అటవీ-రెవెన్యూశాఖ మధ్య కూడా వీటికి సంబంధించిన వివాదాలు ఉన్నాయన్నారు. తన పర్యటన సందర్భంగా స్థానికులు, అటవీశాఖ అధికారులతో చర్చించి సమస్యలన్నింటినీ పరిష్కరించనున్నట్టు సీఎం చెప్పారు. అదే సందర్భంలో నిజామాబాద్ జిల్లా వ్యాప్తంగా సాగునీరు, మంచినీటికి శాశ్వత ప్రాతిపదికన చేపట్టబోయే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నట్టు సీఎం వెల్లడించారు.

*చిత్రం...ఉమ్మడి నిజామాబాద్ జిల్లా ఎమ్మెల్యేలతో చర్చిస్తున్న సీఎం కేసీఆర్