తెలంగాణ

చుక్కనీరు చేరని మంజీర... సింగూర్ నెల రోజులుగా ఇదే పరిస్థితి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 13: వర్షాకాలం ప్రారంభమై నలబై రోజులు గడుస్తున్నా జిల్లాలో ఉన్న ఏకైక నది మంజీరలోకి చుక్క నీరు రాకపోవడంతో మూగబోయింది. మూడు దశాబ్దాల కాలంగా ఎన్నడూ ఎండిపోని సింగూర్ ప్రాజెక్టులో అడుగంటిన నీటితో కళావిహీనంగా దర్శనమిస్తూ చిన్నబోయి కూర్చుంది. ఆదిలాబాద్, నిజామాబాద్, కరీంనగర్, ఖమ్మం జిల్లాల్లో కుండపోతగా వర్షాలు కురుస్తుండటంతో గోదావరి నదికి వరద పోటెత్తగా మెదక్ జిల్లాలో మాత్రం కనీసం చిన్నచిన్న వాగులు కూడా ప్రవహించలేదంటే వర్షాకాలం ప్రభావం ఏమిటో స్పష్టమవుతోంది. సుమారు 30 టిఎంసిల సామర్థ్యం ఉన్న సింగూర్ ప్రాజెక్టులో అధికారిక లెక్కల ప్రకారం కేవలం 0.2 టిఎంసిల నీరు మాత్రమే ఉందంటే ప్రాజెక్టు దుస్థితికి అద్దంపడుతోంది. దిగువన ఉన్న మంజీర రిజర్వాయర్, ఘన్‌పూర్ ఆనకట్టలోకి వర్షం నీరు అసలే రాకపోవడంతో ఖాళీ కుండల్లా కనిపిస్తున్నాయి. సాగునీటిని అందించడానికి నాటి నైజాం రాజులు నిర్మింపజేసిన ఘన్‌పూర్ ప్రాజెక్టు ద్వారా సుమారు 40 వేల ఎకరాల ఆయకట్టు ఆదారపడి ఉంది. గత యేడాది అంతంత మాత్రంగా ధాన్యం సాగు చేసినా ఈ సారి మరీ అధ్వాన్నంగా మారింది. ఇప్పటి వరకు నీరు రాకపోవడంతో నారుపోసుకున్న రైతుల్లో ఆందోళన స్పష్టంగా వ్యక్తమవుతోంది. జంటనగరాల ప్రజల దాహార్తిని తీర్చడం కోసం నిర్మించిన సింగూర్, మంజీర బ్యారేజ్‌ల్లో నీరు రాకపోవడంతో తాగునీటి కష్టాలు షరామామూలే అని చెప్పవచ్చు. మహారాష్ట్ర, కర్నాటక రాష్ట్రాలో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిస్తేకానీ మంజీర నది నీటితో కళకళలాడే పరిస్థితి లేదు. కర్నాటకలో ఇదే నదిపై నిర్మించిన కారింజ ప్రాజెక్టు నిండిన అనంతరమే దిగువ నీరు వచ్చే పరిస్థితి నెలకొంది. సింగూర్ ప్రాజెక్టులో ప్రస్తుతం ఉన్న నీరు పచ్చగా మారిపోయి దుర్గందం వెదజల్లుతోంది. ఉన్న నీటిని పరిసర ప్రాంతాల గ్రామాలకు తాగునీటి కోసం మోటార్ల ద్వారా పంపింగ్ చేస్తున్నారు. గతంలో బిగించిన కొన్ని మోటార్లకు చెందిన పైపులకు కూడా నీరు అందకుండా ప్రాజెక్టులో నీటి పరిస్థితి పడిపోయింది.
మొత్తం గేట్లు ఎత్తివేసినా చుక్కనీరు కిందకు రాదంటే నమ్మశక్యంకాని ఆంశం. సుమారు 165 కిలోమీటర్ల మేరకు నీరు ఎగువకు నిల్వవుండాల్సి ఉండగా కనీసం అర కిలోమీటర్ దూరంలో కూడా నీరు విస్తరించలేదంటే ఎంతటి దయనీయ పరిస్థితిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. గొలుసు కట్టు చెరువులను మరమ్మతులు చేసినా నీరు లేకపోవడంతో వెలవెలబోతున్నాయి. గడచిన వేసవి కాలంలో తీవ్రమైన నీటిని ఎద్దడిని అతి కష్టంమీద అధిగమించినా ఈసారి ప్రాజెక్టులు, చెరువులు, ఇతర జలాశయాలు నిండుకోకపోతే గడ్డుకాలమే అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ సారి ఆశించిన స్థాయికంటే ఎక్కువగానే వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు చెప్పినా ఆ దాఖలాలు మచ్చుకైనా కనిపించడం లేదు. మొత్తంమీద జిల్లాలోని అతిపెద్ద జలాశయమైన సింగూర్ ప్రాజెక్టు దుస్థితిలో కొట్టుమిట్టాడుతుండటం దురదృష్టకరమని చెప్పవచ్చు.