తెలంగాణ

మూడు రోడ్డు ప్రమాదాలు... 9మంది దుర్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పెద్దఅడిశర్లపల్లి, జూలై 13: నల్లగొండ జిల్లా నాగార్జునసాగర్-హైదరాబాద్ రహదారిపై పెద్దఅడిశర్లపల్లి మండలం చిలకమర్రి స్టేజీ సమీపంలో మంగళవారం అర్ధరాత్రి బైక్, ఇన్నోవా కారు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో బైక్‌పై ప్రయాణిస్తున్న నలుగురు వ్యక్తులు దుర్మరణం చెందారు. గుడిపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... త్రిపురారం మండలంలోని మాటూరు తండాకు చెందిన రామావత్ లక్‌పతి (32), పిఎపల్లి మండలంలోని రాంపురం పంచాయతీలోని నేనావత్ తండాకు చెందిన వడ్త్య భాస్కర్ (25) హైదరాబాద్ నుండి నేనావత్ తండాకు వెళ్లే క్రమంలో కొండమల్లెపల్లిలో బస్సు దిగారు. ఎటువంటి వాహనాలు లేకపోవడంతో తన సోదరుడి వరుసైన వడ్త్య నెహ్రూ (19)కు ఫోన్ చేయడంతో తన స్నేహితుడైన డప్పు శివ (21)ను వెంట పెట్టుకుని బైక్‌పై కొండమల్లెపల్లికి వచ్చాడు. అక్కడి నుండి నలుగురు ఒకే బైక్‌పై నేనావత్ తండాకు సాగర్-హైదరాబాద్ రోడ్డు మీదుగా బయలుదేరారు. అదే సమయంలో హైదరాబాద్ వైపు వెళ్తున్న ఇన్నోవా కారు బైక్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నలుగురు యువకులు సంఘటనా స్థలంలోనే దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న గుడిపల్లి పోలీసులు సంఘటనా స్థలానికి వచ్చి మృతదేహాలను దేవరకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కారులోని వ్యక్తులు, డ్రైవర్‌తో సహా పరారయ్యారు. ఎస్‌ఐ భోజ్యానాయక్ ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
నార్కట్‌పల్లిలో...
నార్కట్‌పల్లి: నార్కట్‌పల్లి-అద్దంకి జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారుజామున నాలుగు గంటలకు జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇన్నోవా కారు తన ముందు వెళ్తున్న లారీని ఢీకొన్న ఘటనలో ఇద్దరు వ్యక్తులు దుర్మరణం చెందారు. ఈ సంఘటనలో మరో నలుగురికి గాయాలయ్యాయి. ప్రమాదంలో ఇన్నోవాలో ప్రయాణిస్తున్న సికింద్రాబాద్‌కు చెందిన సింగిరెడ్డి భారతమ్మ (62), వినాయక్ శివరామ్ (47) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎస్‌ఐ మోతీరాం కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
ఖమ్మంలో...
ఖమ్మం: ఖమ్మం జిల్లా వేంసూరులో అదుపుతప్పి లారీ ఢీకొన్న సంఘటనలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం సత్తుపల్లి నుంచి విజయవాడ వైపు వెళ్తున్న లారీ మండల కేంద్రమైన వేంసూరులో సంకటి కృష్ణమూర్తి (70), షేక్ మహబూబ్ అలీ (70), కోట నాగరత్నం (80) ప్రమాదవశాత్తు లారీ ఢీకొనటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందగా, మరొకరు ఆసుపత్రి తరలిస్తుండగా మృతి చెందారు. లారీ బ్రేక్‌లు ఫెయిలవ్వటంతో ఈ సంఘటన జరిగింది. సంఘటన స్థలాన్ని సత్తుపల్లి డిఎస్పీ రాజేష్, సిఐలు రాజిరెడ్డి, తహశీల్దార్ వేణుగోపాల్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఎస్‌ఐ వెంకటేశ్వర్లు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

గిరిజన బాలిక అత్యాచారం కేసు
ముగ్గురు
నిందితుల అరెస్టు
ఆసిఫాబాద్, జూలై 13: ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా సంచలనం రేకెత్తించిన గిరిజన బాలికపై అత్యాచారానికి పాల్పడ్డ ముగ్గురు నిందితులను పోలీసులు బుధవారం అరెస్టు చేసి రిమాండ్‌కు పంపించారు. ఐదు మాసాల క్రితం ఆసిఫాబాద్ శివారు ప్రాంతంలో జరిగిన బాలిక అత్యాచార సంఘటనను సోషల్ మీడియాలో ఉన్న క్లిప్పింగుల ఆధారంగా ఈనెల 9న ‘ఆంధ్రభూమి’ దినపత్రిక వెలుగులోకి తెచ్చిన విషయం తెలిసిందే. అదేరోజు తిర్యాణి మండలం టేకం లొద్ది గ్రామానికి చెందిన బాధితురాలు తనకు జరిగిన అన్యాయంపై ఆసిఫాబాద్ పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. ఈమేరకు స్పందించిన పోలీసులు దర్యాప్తును పకడ్బందీగా చేపట్టారు. బాలిక ఫిర్యాదుపై అన్ని కోణాల్లో విచారించి నిందితులపై పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. అత్యాచారానికి పాల్పడ్డ నిందితులు పట్టణానికి చెందిన మాచర్ల రాజు, మతిన్, రౌతు రంజిత్‌లను బుధవారం తెల్లవారుజామున బస్టాండ్‌లో అదుపులోకి తీసుకొని మధ్యాహ్నం కాగజ్‌నగర్ డిఎస్పీ హబీబ్‌ఖాన్ సమక్షంలో మీడియా ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా డిఎస్పీ ఖాన్ మాట్లాడుతూ నిందితులు ముగ్గురు ఓ పథకం ప్రకారం బాలికపై అత్యాచారానికి పాల్పడ్డట్లు వివరించారు. సమగ్ర దర్యాప్తు అనంతరం నిందితులైన మాచర్ల రాజు, మతిన్, రౌతు రంజిత్‌పై నిర్భయ, పోక్సో, ఎస్సీ, ఎస్టీ అత్యాచార, బెదిరింపు కేసులతో పాటు పలు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేశారు. బుధవారం తెల్లవారుజామున నిందితులు ముగ్గురిని అదుపులోకి తీసుకొని కోర్టులో హాజరు పరిచారు. ఈ సమావేశంలో ఎస్‌హెచ్‌ఓ సతీష్ కుమార్ ఉన్నారు. అంతకుముందు సంఘటన జరిగిన ప్రదేశాన్ని ఎస్‌హెచ్‌ఓ సతీష్, ఆర్‌ఐ విష్ణుతో కలిసి డిఎస్పీ పరిశీలించారు.
జమ్మికుంట మార్కెట్‌లో
పత్తికి రికార్డు ధర
గరిష్ఠంగా పలికిన రూ.6,480
జమ్మికుంట, జూలై 13: పత్తి సీజన్ ముగింపు దశలో అంతర్జాతీయ మార్కెట్‌లో పత్తి గింజలు, క్యాండి ధరలు ఊపందుకోవడంతో తదనుగుణంగా స్థానిక మార్కెట్‌లోనూ రోజు రోజుకు పత్తి ధరలు పుంజుకుంటున్నాయి. బుధవారం కరీంనగర్ జిల్లా జమ్మికుంట వ్యవసాయ మార్కెట్‌కు 603 క్వింటాళ్ల విడి పత్తి విక్రయానికి రాగా, గరిష్ట ధర 6,480 గా ఖరారై సరికొత్త రికార్డును నమోదు చేసింది. కనిష్ట ధర 610, మోడల్ ధర 6400 చొప్పున పలికింది. అదేవిధంగా బస్తాల్లో వచ్చిన 68 క్వింటాళ్ల పత్తికి గరిష్ట ధర 6400, కనిష్ట ధర 4800, మోడల్ ధర 6,000 గా నిర్ణయించి వ్యాపారులు కొనుగోలు చేశారు. సీజన్ ముగింపులో పత్తి ధరలు రోజుకింత పైకెగబాకడంతో పెట్టుబడుల కోసం ఇండ్లల్లో పత్తిని నిలువ చేసుకున్న రైతులు విక్రయానికి మొగ్గు చూపుతున్నారు.
శాంతించిన
వరద గోదావరి
బయటపడ్డ రహదారులు
భద్రాచలం, జూలై 13: ఖమ్మం జిల్లా భద్రాచలం వద్ద గోదావరి శాంతించింది. బుధవారం ప్రశాంతంగా కనిపించింది. గరిష్టంగా 52.4 అడుగులకు చేరుకున్న గోదావరి మంగళవారం రాత్రి నుంచే తగ్గుముఖం పట్టింది. క్రమేణా తగ్గుతూ నీటిమట్టం కనిష్ట స్థాయిలకు చేరుకోవడంతో ఐటీడీఏ పీఓ, ఇంఛార్జ్ సబ్‌కలెక్టర్ రాజీవ్‌గాంధీ హన్మంతు రెండు ప్రమాద హెచ్చరికలను ఉపసంహరించారు. ముంపునకు గురైన పినపాక, మణుగూరు, అశ్వాపురం, బూర్గంపాడు, భద్రాచలం, దుమ్ముగూడెం, చర్ల, వెంకటాపురం, వాజేడు మండలాల్లోని గ్రామాల్లోకి సెక్టోరియల్ ఆఫీసర్లు, తహశీల్దార్లు, డివిజనల్ పంచాయతీ అధికారులను హుటాహుటీన పంపించి క్లోరినేషన్ పనులు చేయించారు. వైద్య సిబ్బంది ఇంటింటికీ వెళ్లి బాధితులకు పరీక్షలు చేయాలని ఆదేశించారు. ప్రత్యేక వైద్యబృందాలను తరలించారు. జోనల్ ఆఫీసర్లు, మొబైల్ బృందాలు వరద తాకిడి ప్రాంతాల్లో సమస్యలపై తక్షణమే నివేదిక రూపంలో ఇవ్వాలని సూచించారు. అధికారులందరికీ సెలవులు రద్దు చేస్తున్నట్లు ప్రకటించారు. కాగా రహదారులన్నీ బయట పడటంతో ఆర్టీసీ అధికారులు బస్సులను వాజేడు, వెంకటాపురం, చర్ల రూట్లకు పంపించారు. ముంపు మండలాలకు కూడా పంపించారు. దారులు తెరుచుకోవడంతో నిత్యావసర వస్తువులను తరలించారు.
కాగా ముంపు గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. వెంకటాపురం మండలం సూరవీడు కాలనీలో కలుషిత నీరు తాగి సోడె సమ్మక్క(65) అనే వృద్ధురాలు అతిసార వ్యాధితో మరణించింది. కాగా గ్రామంలో మరో ఏడుగురు వాంతులు, విరేచనాలతో బాధపడుతున్నారు. వరద తగ్గినా భద్రాచలం పట్టణంలోని అశోక్‌నగర్‌కొత్తకాలనీ జలదిగ్బంధంలోనే ఉంది. వాటిని మోటర్ల ద్వారా తోడాల్సి ఉంది. కానీ నీటిపారుదలశాఖ అధికారులు ఆ పనులేమీ చేపట్టక పోవడంతో పునరావాస కేంద్రం చుట్టూ కూడా వరద నీరు చేరింది. పందులు స్వైర విహారం చేస్తున్నాయి.
చిన్నారులు దోమకాటుకు గురౌతున్నారు. ఇతర ఇన్‌ఫెక్షన్లు కూడా వారికి సోకుతున్నాయి. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య అయ్యప్ప కాలనీలో ముంపునకు గురైన రెండు కుటుంబాలను బుధవారం పరామర్శించారు.