తెలంగాణ

ఆర్టీసీని నడపడం అసాధ్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 21: ప్రస్తుత పరిస్థితుల్లో ఆర్టీసీని యథాతథంగా కొనసాగించడం అసాధ్యమని ప్రభుత్వం స్పష్టం చేసింది. కాగా, ఎలాంటి షరతులు లేకపోతే సమ్మె విరమించి, విధుల్లో చేరడానికి సిద్ధంగా ఉన్నట్టు ఆర్టీసీ జేఏసీ చేసిన ప్రకటనపై ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకోలేదు. హైకోర్టులో రూట్ల ప్రైవేటీకరణపై శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉండటంతో, ఆ తర్వాతే అన్ని అంశాలను పరిశీలించి, తుది నిర్ణయం తీసుకోనున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయం ప్రకటించింది. ఆర్టీసీ సమ్మె తాజా పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోవాలి? అనే అంశంపై గురువారం ప్రగతిభవన్‌లో ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ఆర్టీసీ ఆర్థిక పరిస్థితి, కోర్టు నిర్ణయాలు, కోర్టులో ఇంకా పెండింగ్‌లో ఉన్న కేసులు తదితర అంశాలపై కూలంకషంగా అధ్యయనం చేయాలని సీఎం అధ్యక్షతన జరిగిన సమావేశం నిర్ణయించింది. వాస్తవ పరిస్థితుల ప్రాతిపదికన, ప్రజలకు మెరుగైన రవాణా సౌకర్యం అందించడమే ప్రథమ కర్తవ్యంగా, ఆర్టీసీ సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని ప్రభుత్వం భావిస్తున్నట్టు సీఎం కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఆర్టీసీకి ఇప్పటికే రూ. 5 వేల కోట్లకు పైగా అప్పులు ఉన్నాయని, తక్షణం చెల్లించాల్సిన అప్పులు, బకాయిలు కలిపి దాదాపురూ. 2 వేల కోట్లు ఉన్నాయని పేర్కొంది. ప్రావిడెంట్ ఫండ్ అధికారుల ఆదేశం మేరకు ఉద్యోగులకు సెప్టెంబర్ నెలకు సంబంధించి మొత్తం జీతం చెల్లించాలంటే రూ.240 కోట్లు అవసరం అవుతాయని పేర్కొంది. సీసీఎస్‌కు 500 కోట్లతో పాటు డీజిల్ బకాయిలు, రెండేళ్లుగా రవాణా పన్ను బకాయి ఉందని ఆ ప్రకటన స్పష్టం చేసింది. అలాగే 2,600 కాలం చెల్లిన బస్సుల స్థానంలో కొత్త బస్సులు కొనాలని, పిఎఫ్ బకాయిల కింద నెలకు దాదాపు 65 నుంచి 70 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని పేర్కొంది. మొత్తంగా ఆర్టీసీ ఇప్పుడున్నట్టు నడవాలంటే నెలకు రూ. 640 కోట్లు అవసరమని అభిప్రాయపడింది. ఈ భారమంతా ఎవరు భరించాలి? ఆర్టీసీకి ఇప్పుడంత శక్తి లేదుకదా? అన్న అంశం చర్చలో వచ్చినట్టు తెలిపింది. ఆర్థిక మాంద్యం కారణంగా ప్రభుత్వం కూడా భరించే పరిస్థితి లేదని స్పష్టం చేసింది. అయినా సరే, ఎంతో కొంత ప్రభుత్వం సహాయం చేసినా, అది ఎంత వరకు కొనసాగించగలుతుంది? ఆర్టీసీకున్న ఒకే ఒక మార్గం బస్సు చార్జీలు పెంచడమే, అయితే చార్జీలు ఎక్కువైతే ప్రజలు బస్సులు ఎక్కని పరిస్థితి వస్తుందని స్పష్టం చేసింది. ఈ పరిస్థితులన్నీ పరిగణలోకి తీసుకుంటే ఆర్టీసీని యధావిధిగా నడపడం సాధ్యం కాదని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్టు ఆ ప్రకటన తెలిపింది. ఈ పరిస్థితులతో పాటు రూట్ల ప్రైవేటీకరణ అంశంపై హైకోర్టులో శుక్రవారం తీర్పు వెలువరించే అవకాశం ఉందని, అప్పుడు అన్ని అంశాలను పరిగణలోకి తీసుకొని తుది నిర్ణయం తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించినట్టు పేర్కొంది.

*చిత్రం... ముఖ్యమంత్రి కేసీఆర్