తెలంగాణ

మల్లన్న సాగర్ ముంపు భయంతో రైతు ఆత్మహత్య

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తొగుట, జూలై 21: మల్లన్నసాగర్ ప్రాజెక్టులో తమ గ్రామం ముంపునకు గురైతే తమ బతుకులు ఎలా సాగుతాయోనన్న బెంగతో ఓ వృద్ధ రైతు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మెదక్ జిల్లా తొగుట మండలం పల్లెపహడ్ గ్రామంలో జరిగింది. గ్రామస్థులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. పల్లెపహడ్‌లో బచ్చలి (బైండ్ల) నర్సింలు (70) భార్య భూదవ్వతో కలిసి నివసిస్తున్నారు. వీరికి పిల్లలు కలగకపోవడంతో ఓ ఆడపిల్లను దత్తత తీసుకుని ఆమెకు వివాహం చేశారు. వీరిద్దరు తమకున్న అర ఎకరం భూ మిలో వ్యవసాయం చేస్తూ, కూలినాలి పనులతో కుటుంబాన్ని వెళ్లదీస్తున్నారు. గత కొన్నిరోజులుగా మల్లన్నసాగర్ ప్రాజెక్టులో పల్లెపహడ్ గ్రామం ముంపునకు గురవుతుందని నర్సింలు ఆందోళనతో ఉండేవాడు. వృద్ధాప్యానికి చేరుకున్న తమ పరిస్థితి ఎలా అని భా ర్యతో పాటు చుట్టుపక్కల వారితో ఆవేదన వెళ్ల్లబోసుకున్నాడు. గ్రామంలో ప్రాజెక్టు వద్దని రిలేదీక్షలు కొనసాగుతుండడం, చుట్టుపక్కల గ్రామాల్లో గొడవలు జరుగుతుండడం ఆ కుటుంబాన్ని మరింత బాధించింది. ఈ క్రమంలో ఇటీవల అధికారులు పల్లెపహడ్, వేములగాట్ గ్రామాలకు త్వరలోనే భూసేకరణకు నోటిఫికేషన్ వేస్తారన్న ప్రకటన నర్సింలును మరింత కుంగదీసింది. గూడు కోల్పోయి, గ్రామం ముంపునకు గురైతే ఎక్కడికెళ్లి బతకాలో తెలియక మనోవేదనకు గురైన నర్సింలు బుధవారం ఇంట్లోనే ఎవరు లేని సమయంలో దూలానికి ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చుట్టుపక్కల వారు గమనించి నర్సింలు ఉరివేసుకున్న తాడును తొలగించారు. అప్పటికే కొనఊపిరితో ఉన్న నర్సింలును వెంటనే చికిత్స నిమిత్తం గజ్వెల్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరిస్థితి విషమంగా ఉండడంతో హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నర్సింలు గురువారం తెల్లవారుజామున మృతిచెందాడు. నర్సింలు మృతి వార్తతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి.
మృతదేహాన్ని సందర్శించిన
రిటైర్డ్ హైకోర్టు న్యాయమూర్తి
హైదరాబాద్‌లోని గాంధీ ఆస్పత్రిలో నర్సింలు మరణించాడన్న విషయం తెలుసుకున్న హైకోర్టు రిటైర్డ్ న్యాయమూర్తి చంద్రకుమార్, తెలుగు రైతు రాష్ట్ర అధ్యక్షుడు వంటేరు ప్రతాప్‌రెడ్డి, బిజెపి రాష్ట్ర అధికార ప్రతినిధి రఘునందన్‌రావు, ప్రజా తెలంగాణ నేత ఇన్నయ్య, జిల్లా భూసేకరణ వ్యతిరేక కమిటీ నేత జయరాజ్ ఆస్పత్రిని సందర్శించి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులను ఓదార్చారు. ప్రజలు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం ప్రాజెక్టు నిర్మాణంపై పునరాలోచించి, ఆత్మహత్యలను నివారించాలని డిమాండ్ చేశారు. ప్రజలు ఆధైర్యంతో ఆత్మహత్య చేసుకోవడం విచారకరమన్నారు.
చిత్రాలు.. మృతి చెందిన బచ్చలి నర్సింలు (ఫైల్‌ఫొటో)
మృతుడి కుటుంబాన్ని పరామర్శిస్తున్న రిటైర్డ్ జస్టిస్ చంద్రకుమార్