తెలంగాణ

అప్పుల సంగతి చెప్పరేం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: రాష్ట్రాన్ని ఎంతో అభివృద్ధి చేశామని పదే పదే చెబుతున్న ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రభుత్వం చేసిన అప్పుల సంగతి ఎందుకు చెప్పడం లేదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్ ప్రశ్నించారు. సీఎం కేసీఆర్ మాటలకు, టీఆర్‌ఎస్ మేనిఫెస్టోకు, హామీలకు, ప్రస్తుత బడ్జెట్‌కూ ఏ మాత్రం పొంతన లేదని ఆయన పేర్కొన్నారు. సోమవారం నాడు ఇక్కడి పార్టీ కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడు తూ నిలువెల్లా అబద్దాలతో కూడిన మోసపూరిత బడ్జెట్‌గా ఆయన పేర్కొన్నారు. రైతులు, నిరుద్యోగులు, ప్రభుత్వ ఉద్యోగులు, కార్మికులు, బీసీలు, ఓబీసీలు, ఎస్సీలు, ఎస్టీలు ఇలా అన్ని వర్గాల వారినీ మోసం చేశారని దుయ్యబట్టారు. బడ్జెట్ బారెడు, ఖర్చు జానెడు, పేరు గొప్ప-ఊరు దిబ్బ
అన్న చందంగా ఉందని ఆయన ఎద్దేవా చేశారు. అబద్దాలకు ముఖ్యమంత్రి కేసీఆర్ నిలువెత్తు నిదర్శనమని ఆయన దుయ్యబట్టారు. బడ్జెట్ వాస్తవికతకు, సామాజిక విలువకు పొంతన లేకుండా ఉందని అన్నారు. 33,191 కోట్ల లోటుతో భారీ కేటాయింపులు చేశారని, ఆ లోటును ఏ విధంగా పూరిస్తారో చెప్పలేదని ఆయన అన్నారు. తలసరి ఆదాయం 2,28,216 రూపాయిలు ఉందని చెప్పిన ప్రభుత్వం తలసరి అప్పు 91 వేలు ఉందని ఎందుకు చెప్పలేదని నిలదీశారు. 2014లో 70 వేల కోట్ల రూపాయిలు అప్పు ఉందని, 2020 నాటికి అది 2.30 లక్షల కోట్లకు చేరిందని, అప్పుచేసి పప్పుకూడు చేయిస్తున్న కేసీఆర్ శైలి విచిత్రంగా ఉందని ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల మేనిఫెస్టో అంటే బ్యాలెట్ బాక్స్‌లు నింపుకోడమే అన్నట్టు కేసీఆర్ వ్యవహరిస్తున్నారని, కేజీ టు పీజీ విద్య ఏమైందని ఆయన నిలదీశారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్, డబుల్ బెడ్ రూమ్ ఇళ్లు, ఉద్యోగుల పీఆర్సీ , రిటైర్మెంట్ వయస్సు పెంపు, ఎస్సీ-బీసీల సంక్షేమానికి కేటాయింపులు, బీసీ సంక్షేమ కేటాయింపులు, విద్య, వైద్య సాగునీరు తదితర రంగాలకు కేటాయింపులపై మాట్లాడాలని అన్నారు. విద్యకు కేటాయించిన నిధుల్లో 90 శాతం కేవలం జీతాలకే వస్తుందని అన్నారు. ఇంటింటికీ నీళ్లు ఇవ్వకుంటే ఓట్లు అడిగేది లేదని చెప్పిన కేసీఆర్ వాస్తవికంగా ఎన్ని ఇళ్లకు నీరు ఇచ్చారో లెక్కలు చెప్పాలని డిమాండ్ చేశారు. సాగునీటి ప్రాజెక్టులకు 25 వేల కోట్ల నుండి 11 వేల కోట్లకు తగ్గించారని, ప్రధాన మంత్రి సంచయ్ యోజనకు రాష్ట్ర ప్రభుత్వం తన వాటా ఎందుకు ఇవ్వడం లేదని ఆయన నిలదీశారు. నిరుద్యోగులను సీఎం అత్యంత అమానవీయంగా, దారుణంగా మోసం చేస్తున్నారని ఆయన ఆరోపించారు. నిరుద్యోగ భృతి పేరిట గత ఏడాది బడ్జెట్‌లో 1,810 కోట్లు కేటాయించినా అందులో ఒక్క పైసా కూడా ఖర్చు చేయలేదని ఆయన పేర్కొన్నారు. ఆర్థిక మాంద్యం ఉందని మాట్లాడుతూనే మరోపక్క ఆర్థిక మాంద్యం లేనట్టు బడ్జెట్ పెంచుతారని ఆయన ఎద్దేవా చేశారు. రాష్ట్రంలో ఆర్థిక మాంద్యం ఏమీ లేదని, ఉన్నదంతా కేసీఆర్ మందగమనమేనని అన్నారు. మాంద్యానికి కారణం కేసీఆర్ కుటుంబ దోపిడీయేనని, ఇదే కాకపోతే ఆరు నెలల కిందట బడ్జెట్ పరిమాణాన్ని తగ్గించి, ఆరు నెలల్లోనే మళ్లీ బడ్జెట్ అమాంతం ఎందుకు పెంచారని లక్ష్మణ్ అన్నారు. ఏడాది మొత్తం మీద కేంద్రం నుండి రావల్సిన ఆదాయంలో కేవలం 3వేల కోట్లు తగ్గిందని గగ్గోలు పెడుతున్నారని ఆయన చెప్పారు. గత ఏడాది బడ్జెట్‌లో క్యాపిటల్ వ్యయం 17,274 కోట్లు పెట్టారని, సెప్టెంబర్ వచ్చే సరికి సవరించిన అంచనాల్లో దీనిని 13,165 కోట్లకు తగ్గించారని, కానీ వాస్తవానికి వచ్చేసరికి ఖర్చు 10 వేల కోట్లు కూడా తగ్గలేదని ఆయన వివరించారు.

*చిత్రం... హైదరాబాద్‌లోని బీజేపీ కార్యాలయంలో సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతున్న పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్