తెలంగాణ

విద్యార్థులపై విరిగిన లాఠీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్: విద్యారంగ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ ఏబీవీపీ విద్యార్థులు బుధవారం నాడు నిర్వహించిన చలో అసెంబ్లీ కార్యక్రమం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. అసెంబ్లీలోకి వెళ్లకుండా పోలీసులు అడ్డుకోవడంతో పాటు ఒక దశలో లాఠీచార్జి చేయడంతో ఏబీవీపీ నేతలు గాయపడ్డారు. రాష్ట్రంలో 9 యూనివర్సిటీలకు వీసీ పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వెంటనే వీసీలను నియమించడంతో పాటు 2766 అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని ఏబీవీపీ నేతలు డిమాండ్ చేశారు. జూనియర్ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 5,075 లెక్చరర్ పోస్టులను , డిగ్రీ కాలేజీల్లో ఖాళీగా ఉన్న 2,100 లెక్చరర్ పోస్టులను, 50వేల టీచర్ పోస్టులను వెంటనే భర్తీ చేయాలని వారు డిమాండ్ చేశారు. అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం ఇచ్చిన లక్ష ఖాళీల భర్తీకి వెంటనే నోటిఫికేషన్లు ఇవ్వాలని వారు కోరారు. స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని, ఇకనుండి ప్రతి మూడు నెలలకూ ఫీజు రీయింబర్స్‌మెంట్ విడుదల చేయాలని అన్నారు. కేజీ టూ పీజీ ఫీజుల దోపిడీకి అడ్డుకట్ట వేసి, కఠినమైన ఫీజుల నియంత్రణ చట్టాన్ని చేయాలని, ప్రభుత్వ విద్య బలోపేతానికి చర్యలు చేపట్టాలని అన్నారు. బడ్జెట్లో విద్యారంగానికి నామమాత్రంగా నిధులు కేటాయించడం సరికాదని, ప్రభుత్వ మహిళా యూనివర్సిటీని రాష్ట్రంలో ప్రారంభించాలని వారు డి మాండ్ చేశారు.
విద్యార్థులపై లాఠీచార్జి దారుణం: బండి సంజయ్
ఏబీవీపీ విద్యార్థులపై లాఠీచార్జీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితుడైన బండి సంజయ్‌కుమార్ ఖండించారు. విద్యారంగం సమస్యలను పరిష్కరించమని వస్తే ఇష్టం వచ్చినట్టు చితకబాదుతారా అని ఆయన నిలదీశారు. ఇచ్చిన హామీలను నిలుపుకోమని, సమస్యలు పరిష్కరించమని అడగడం తప్పా అని ఆయన ప్రశ్నించారు. ప్రభుత్వం విద్యార్థులను సైతం సంఘ విద్రోహశక్తుల్లా చూస్తోందని, రాష్ట్రంలో ప్రజాస్వామ్య పాలన నడుస్తోందా లేక నిజాం పాలన సాగుతోందా అని ఆయన ప్రశ్నించారు. యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తానని అధికారంలోకి వచ్చి ఇపుడు ఉద్యోగాలు లేవని అంటే ఎలా అని అన్నారు. విద్యార్థులపై పోలీసులను ఎగేసి నువ్వు మాత్రం ఫార్మ్‌హౌస్‌లో సేద తీరితే ఎలా అని ఆయన ఎద్దేవా చేశారు. ఏబీవీపీ విద్యార్థులపై లాఠీచార్జి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. విద్యార్థి ఉద్యమాలను అణచివేస్తే ఏం జరుగుతుందో కేసీఆర్‌కు బాగా తెలుసని ఆయన అన్నారు. ఉద్యమకారుడినని చెప్పుకునే కేసీఆర్ విద్యార్థి ఉద్యమకారులపై ఉక్కుపాదం మోపడం దారుణమని ఆయన అన్నారు. విద్యార్థుల తలలు పగులగొట్టేంత కక్ష ప్రభుత్వానికి ఎందుకని ఆయన
అన్నారు. వాళ్లు తిరగబడితే ఏం జరుగుతుందో త్వరలోనే చూస్తారని బండి సంజయ్ హెచ్చరించారు.
ఏబీవీపీ నేతలపై పోలీసుల లాఠీచార్జీని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కే లక్ష్మణ్, మాజీ మంత్రి డీకే అరుణ, ఏబీవీపీ జాతీయ కార్యదర్శి ఐనాల ఉదయ్ తీవ్రంగా ఖండించారు. పోలీసుల లాఠీచార్జి దారుణమని ఉదయ్ పేర్కొన్నారు. 25 మంది నేతలు తీవ్రంగా గాయపడ్డారని ఆయన చెప్పారు. నవేంద్ర, నిహారిక, మల్లికార్జున్ అనే కార్యకర్తలకు చెయ్యి విరిగిందని, లాఠీచార్జి చేసిన అదనపు డీసీపీ గంగిరెడ్డి, ఇతర అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని వారు డిమాండ్ చేశారు. విద్యారంగాన్ని విస్మరిస్తే సహించేది
లేదని రాష్ట్ర కార్యదర్శి అంబాల కిరణ్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ప్రవీణ్‌రెడ్డి, శ్రీహరి, అనిల్, అనిత, సుమన్, శంకర్ జీవన్, సాయిబాబా తదితరులు పాల్గొన్నారు.
పోలీసులపై చర్యలు: ఎమ్మెల్యే సీతక్క
ఖైరతాబాద్ : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అసెంబ్లీ వద్దకు వచ్చిన విద్యార్థులపై దాడి చేసిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని ములుగు ఎమ్మెల్యే సీతక్క డిమాండ్ చేశారు. విద్యను టీఆర్‌ఎస్ ప్రభుత్వం విద్యను తీవ్ర నిర్లక్ష్యం చేసిందని, బడ్జెట్‌లో ఆశించిన స్థాయిలో నిధులు కేటాయించలేదని విమర్శించారు. తెలంగాణ ఉద్యమంలో వ్యవహరించిన విద్యార్థులపై లాఠీచార్జి చేయడం ఎంతవరకు సమంజసమని ఆమె ప్రశ్నించారు. సమస్యలు పరిష్కరిస్తే అసెంబ్లీ, ప్రగతి భవన్ వద్దకు వచ్చే అవసరం ఉండదు కదా అని అన్నారు. విచక్షణారహితంగా విద్యార్థులపై దాడి చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.
పీడీఎస్‌యూ ముట్టడి
విద్యకు బడ్జెట్ పెంచాలని పీడీఎస్‌యూ నేతలు అసెంబ్లీని ముట్టడించారు. ఈ ముట్టడిలో పీడీఎస్‌యూ ప్రధాన కార్యదర్శి బోయినపల్లి రాము మాట్లాడుతూ కేసీఆర్ 2014లో అధికారంలోకి వచ్చిన నాటి నుండి విద్యను నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపించారు. ముట్టడి కార్యక్రమానికి బయలుదేరిన పీడీఎస్‌యూ నేతలను పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టయిన వారిలో రాముతో పాటు కల్పన, రామకృష్ణ, బోయిన్‌పల్లి గణేష్, వినోద్, అలిమ్, గౌతమ్ తదితరులున్నారు.
*చిత్రాలు.. ఏబీవీపీ కార్యకర్తల అసెంబ్లీ ముట్టడి సందర్భంగా పలువురిని అదుపులోకి తీసుకుంటున్న పోలీసులు
*అసెంబ్లీని ముట్టడించేందుకు యత్నించిన పీడీఎస్‌యూ కార్యకర్తలను అడ్డుకుంటున్న పోలీసులు