తెలంగాణ

రైతులపైనా మీ ప్రతాపం?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, జూలై 24: మల్లన్న సాగర్ రిజర్వాయర్ నిర్మాణానికి శ్రీకారం చుట్టిన ప్రభుత్వం కేవలం ప్రతిష్టగా భావించి అమాయక రైతులపై దౌర్జన్యానికి దిగి, తప్పకుండా ప్రాజెక్టును కట్టితీరుతామంటూ లాఠీచార్జీ ద్వారా సంకేతాన్ని పంపిస్తోందని తెలంగాణ జెఎసి చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం మండిపడ్డారు. ఆదివారం మెదక్ జిల్లా కొండపాక, తొగట మండలాలకు చెందిన మల్లన్న సాగర్ భూ నిర్వాసితులు చేపట్టిన రాస్తారోకో కార్యక్రమం రసా భాసగామారి లాఠీచార్జీ, గాల్లోకి కాల్పులకు దారి తీసిన సంఘటనపై ఆయన సాయంత్రం సంగారెడ్డి ఐబి గెస్ట్‌హౌస్‌లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ప్రభుత్వ విధానంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మల్లన్నసాగర్ ప్రాజెక్టు అవసరం లేదని, గోదావరి నదిపైనే ప్రాజెక్టులు నిర్మించాలని హన్మంతరావు లాంటివారు ఎంతోమంది నిపుణులు చేసిన సూచనలను ప్రభుత్వం బేఖాతర్ చేస్తోందని ధ్వజమెత్తారు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు ప్రజాస్వామ్య భవిష్యత్తును కోరుకుంటున్నారని అన్నారు. రైతులపై కొనసాగిన దాడి ఊహించలేనిదన్నారు. విచ్చలవిడిగా విరుచుకపడి ఆడా, మగా, పిల్లా పాపా అనే తేడా లేకుండా లాఠీచార్జీ చేయడం బాధాకరమన్నారు. భూ నిర్వాసిత గ్రామాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న వారిని ఎంపికచేసి మరీ దారుణంగా కొట్టడం హేయమైన చర్యగా అభివర్ణించారు. సుమారు 150 మంది వరకు గాయాలకు గురయ్యారని, ఇందులో 40 మంది వరకు తీవ్రంగా గాయపడినట్లు ప్రాథమిక సమాచారం ఉందన్నారు. రైతులు ఉద్యమించే పరిస్థితులకు దారితీయడానికి ప్రభుత్వం తీసుకున్న విధానాలే కారణమన్నారు. ప్రాజెక్టు డిజైన్, డిపిఆర్ పూర్తి కాకుండానే భూ సేకరణ చేయడం ఎక్కడా చూడలేదన్నారు. స్థానికంగా ఉండని వారిని, సాదా బైనామా భూములను గుర్తించి రైతులపై మానసిక వత్తిడి, బెదిరింపులకు పాల్పడుతూ దౌర్జన్యంగా భూ సేకరణ చేయడం ఏమిటని నిలదీసారు. కనీసం రైతుల అభిప్రాయ సేకరణ కూడా చేయకుండా అధికారులు భూములు లాక్కునే ప్రయత్నం చేయడం దురదృష్టకరమన్నారు. రైతులపై జరిగిన దాడిని ప్రజాస్వామిక వాదులంతా తీవ్రంగా ఖండించాలని, జిల్లా స్థాయిలో అన్ని మండల కేంద్రాల్లో నిరసన కార్యక్రమాలు చేపట్టాలని కోదండరాం పిలుపునిచ్చారు. సోమవారం హైదరాబాద్‌లోని బషీరాబాగ్ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించే ఓ కార్యక్రమంలో మల్లన్న సాగర్‌పై రాష్ట్ర స్థాయిలో చేపట్టాల్సిన కార్యాచరణపై నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు.

సంగారెడ్డిలో విలేఖరులతో మాట్లాడుతున్న టిజెఎసి చైర్మన్ కోదండరాం