తెలంగాణ

కనీస ఏర్పాట్లపైనా దృష్టి సారించని అధికారులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, జూలై 30: గోదావరి అంత్య పుష్కరాలు ఆదివారం నుంచి ప్రారంభం కానుండగా, కనీస సదుపాయాలు కల్పించే విషయమై అధికారులు నామమాత్రంగానైనా చర్యలు చేపట్టకపోవడం పట్ల భక్తుల్లో ఒకింత అసంతృప్తి వ్యక్తమవుతోంది. సరిగ్గా ఏడాది క్రితం జరిగిన గోదావరి మహా పుష్కర ఏర్పాట్లను చూసి పులకించిన వారంతా, ప్రస్తుతం అధికార యంత్రాంగం నిస్తేజ వైఖరిని చూసి ఉసూరుమంటున్నారు. వాటి స్థాయిలో కాకపోయినా కనీసం కొంతవరకైనా ఏర్పాట్లు చేసి ఉంటే, అంత్య పుష్కరాలకు వచ్చే భక్తులకు సౌకర్యంగా ఉండేదని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆగస్టు 11వ తేదీ వరకు అంత్య పుష్కరాలు కొనసాగనుండగా, ఏ ఒక్క చోట కూడా అధికారులు ఏర్పాట్లు చేపట్టలేదు. అంత్య పుష్కరాలకు భక్తుల సంఖ్య తక్కువగా ఉండే అవకాశాలు ఉన్నప్పటికీ, వచ్చే వారికి కనీస సౌకర్యాలు కల్పించాలనే ధ్యాస మాత్రం అధికారుల్లో కొరవడడం భక్తుల్లో అసంతృప్తిని రాజేస్తోంది. నిజానికి 2015 మే మాసంలో జరిగిన పుష్కరాల సమయంలో భక్తులు తీవ్ర నీటి కొరతను ఎదుర్కోవాల్సి వచ్చింది. ప్రస్తుతం వర్షాలు అనుకూలిస్తూ ప్రతీచోట గోదావరి పుష్కరఘాట్లలో సమృద్ధిగా నీరు ప్రవహిస్తుండడంతో అంత్య పుష్కరాలకు కూడా ఇదివరకటితో పోలిస్తే ఒకింత ఎక్కువ సంఖ్యలోనే భక్తులు తరలివచ్చే అవకాశాలు ఉన్నాయని భావిస్తున్నారు. అయితే ఏ ఒక్క పుష్కర ఘాట్ వద్ద కూడా కనీస ఏర్పాట్లు చేయకపోవడంతో భక్తులు ఇబ్బందులు ఎదుర్కోక తప్పని పరిస్థితి నెలకొంది. గతేడాది పుష్కరాల సమయంలో జిల్లాలోని 11 ప్రాం తాల్లో మొత్తం 18 పుష్కర ఘాట్‌లను ఏర్పాటు చేశారు. త్రివేణి సంగమ ప్రాంతమైన కందకుర్తితో పాటు తడ్‌పాకల్, దోంచంద, గుమ్మిర్యాల, సా వెల్, ఉమ్మెడ, కోమన్‌పల్లి, వనె్నల్(కె), చిన్నయానం, తాడ్‌బిలోలి, బోర్గాం, కోస్లి, బినోల, తుంగిని, యంచ, నాళేశ్వర్ తదితర గోదావరి తీర ప్రాంతాలు పుష్కర శోభతో ఉట్టిపడ్డాయి. దాదాపు పాతిక కోట్ల రూపాయల పైచిలుకు నిధులతో పుష్కరఘాట్ల వద్ద మూడు మాసాల ముందు నుండే ఏర్పాట్లను చేపట్టి సదుపాయాలను మెరుగుపర్చారు. పుష్కరఘాట్ల వద్ద తాగునీటి వసతి, దుస్తులు మార్చుకునే గదులు, శ్రాద్ధ మండపాలు, తాత్కాలిక మరుగుదొడ్ల నిర్మాణాలు, షవర్ బాత్ తదితర వాటిని అందుబాటులోకి తేవడంతో అనునిత్యం లక్షలాది సంఖ్యలో భక్తులు వచ్చినప్పటికీ ఎలాంటి ఇబ్బందులు లేకుండా పుణ్య స్నానాలు ఆచరించి సంతృప్తితో వెనుదిరిగి వెళ్లారు. అయితే పుష్కరాలు ముగిసిన వెంటనే ఘాట్ల వద్ద గల సౌకర్యాల నిర్వహణ గురించి పట్టించుకోకపోవడంతో ప్రస్తుతం అక్కడి సదుపాయాలన్నీ కనుమరుగయ్యాయి. విద్యుద్దీప కాంతులతో దేదీప్యమానంగా వెలుగులీనిన పుష్కర కేంద్రాల వద్ద ప్రస్తుతం రాత్రి సమయాల్లో ఒక్క బల్బు కూడా వెలగడం లేదంటే పరిస్థితిని ఊహించుకోవచ్చు. మరుగుదొడ్లు శిథిలమైపోయి ఎందుకూ పనికిరాకుండాపోయాయి. దుస్తులు మార్చుకునే గదులను మరుగుదొడ్లుగా వినియోగించడంతో అవి కంపుకొడుతున్నాయి. తాగునీటి వసతి కోసం ఏర్పాట్లు చేసిన కుళాయిలను చాలాచోట్ల ఆకతాయిలు ధ్వంసం చేశారు. వీటిని గమనించి అంత్య పుష్కరాల కోసం వచ్చే భక్తులకు కనీస సదుపాయాలను పునరుద్ధరించేందుకు ప్రయత్నించాల్సిన అధికారులు, కనీసం ఆ దిశగా కనె్నత్తి కూడా చూడడం లేదు. నిజానికి పచ్చని ప్రకృతితో, గలగలా ప్రవహించే గోదావరి నది ఒడిన వెలసిన పుష్కర క్షేత్రాలను టూరిజం ప్రదేశాలుగా గుర్తించి వాటికి కాస్తంతైనా పర్యాటక సొబగులు అద్దితే ఈ పరిస్థితి ఉత్పన్నమై ఉండేది కాదని పలువురు అభిప్రాయపడుతున్నారు. పర్యాటక ప్రదేశాలుగా ఏర్పడితే ప్రజలు అనునిత్యం వీటిని సందర్శిస్తారని, తద్వారా సౌకర్యాలు మెరుగుపడేవని పేర్కొంటున్నారు.

చిత్రం.. పుష్కరఘాట్ల వద్ద నిర్వహణ లోపంతో శిథిలావస్థకు చేరిన నిర్మాణాలు