తెలంగాణ

నకిలీ డీజిల్ ముఠా గుట్టు రట్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, జూలై 31: నల్లగొండ జిల్లా సూర్యాపేటలో గత కొనే్నళ్లుగా సాగుతున్న నకిలీ డీజిల్ తయారు చేస్తున్న ముఠా గుట్టును పోలీసులు రట్టుచేశారు. ప్రజాపంపిణీ వ్యవస్థ ద్వారా సరఫరా చేయాల్సిన నీలిరంగు కిరోసిన్‌కు రసాయనాలను కలిపి నకిలీ డీజిల్‌ను తయారుచేస్తున్న తీరును చూసి పోలీసు అధికారులే నిర్ఘాంతపోయారు. డిఎస్పీ వి.సునీతా మోహన్ ఆదివారం పట్టణ పోలీస్‌స్టేషన్‌లో విలేఖరుల సమావేశాన్ని ఏర్పాటుచేసి ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. విశ్వసనీయ సమాచారం మేరకు ఈనెల 24న సూర్యాపేటలోని బాలాజీనగర్‌లో గల ఓ ఇంటిపై దాడిచేయగా కల్తీ డీజిల్ తయారీ విషయం వెలుగుచూసిందని, స్థానిక కిరోసిన్ హాకర్ బ్రాహ్మండ్లపల్లి దేవిదత్తు ఈ వ్యవహారానికి సూత్రధారిగా వ్యవహరిస్తున్నాడని చెప్పారు. రేషన్ డీలర్లకు పోయాల్సిన కిరోసిన్‌లో కొంతభాగం మిగిల్చి నల్లగుంట్ల శ్రవణ్‌కుమార్ అనే వ్యక్తితో కలిసి ఈ అక్రమదందాను కొనసాగిస్తున్నారన్నారు. దేవిదత్తు గుమస్తా గుండా సంతోష్, డ్రైవర్లు షేక్ రహీం, మండవ సతీష్, శ్రీను, ఉపేందర్‌తో నకిలీ డీజిల్ తయారు చేస్తున్నారన్నారు. గుంటూరుకు చెందిన సాదినేని వెంకటేశ్వర్లు, సిద్దవటం అశోక్‌కుమార్ వద్ద రసాయనాలు, రంగులు కొనుగోలు చేసి హైదరాబాద్ నుండి మైన్స్‌పౌడర్‌ను తెప్పించి వీటిని కిరోసిన్‌లో కలిపి నకిలీ డీజిల్‌ను తయారుచేస్తున్నట్లు తెలిపారు. మొదట జరిపిన దాడిలో పట్టుబడిన గుండా సంతోష్, షేక్ రహీంలను విచారించగా ఈ నకిలీ వ్యవహారంలో ప్రమేయం ఉన్న వారి వివరాలు వెల్లడయ్యాయన్నారు. ఈ వ్యవహారంలో సాదినేని వెంకటేశ్వర్లు, అతని సహాయకుడు సిద్దవటం అశోక్‌కుమార్, నల్లగుంట్ల శ్రవణ్‌కుమార్‌లను స్థానిక హైటెక్ బస్టాండ్‌లో అదుపులోకి తీసుకున్నామని వారు ఇచ్చిన సమాచారం మేరకు నార్కెట్‌పల్లి స్థావరంపై దాడి జరిపి నల్లగొండకు చెందిన గుండా సంతోష్‌కుమార్, అతని వద్ద డ్రైవర్‌గా పనిచేసే మండ్రు డేవిడ్‌రాజు, హైదరాబాద్‌కు చెందిన గౌరీశంకర్, అజీమ్, ప్రధాన సూత్రధారి దేవిదత్తు డ్రైవర్ సతీష్‌ను అరెస్టు చేశామని వివరించారు. వీరి నుంచి ట్యాంకర్, 8 వేల లీటర్ల నకిలీ డీజిల్, 4 వేల లీటర్ల కిరోసిన్, 25 ప్లాస్టిక్ డ్రమ్ములు, మూడు కరెంట్ మోటార్లు, రసాయనాలు, మైన్స్‌పౌడర్ బస్తాలను, నార్కెట్‌పల్లి స్థావరంలో రెండు ట్యాంకర్లను, 7 వేల లీటర్ల నకిలీ డీజిల్, 2 వేల లీటర్ల కిరోసిన్, రెండు కరెంట్ మోటర్లు, 5 మైన్స్‌పౌడర్ బస్తాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.

నిందితులపై వివిధ సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో పట్టణ ఇన్స్‌స్పెక్టర్ వై.మొగిలయ్య, ఎస్‌ఐలు క్రాంతికుమార్, బాసిత్ పాల్గొన్నారు.

ముఠా అరెస్టు వివరాలు వెల్లడిస్తున్న డిఎస్పీ సునీతా మోహన్