తెలంగాణ

అస్త్రాల వేటలో విపక్షం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు2: తెలంగాణలో అధికార పక్షంపై దాడికి బలమైన అస్త్రాల కోసం విపక్షం ప్రయత్నిస్తోంది. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచి పోయినా అధికారపక్షంపై పోరాడేందుకు విపక్షాలకు బలమైన ఆయుధాలు కనిపించడం లేదు. చివరకు భూసేకరణ వివాదంపై విపక్షాలు ఆశలు పెట్టుకున్నాయి. అయితే అధికార పక్షం వ్యూహాత్మకంగా రైతులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహిస్తూ విపక్షాలకు ఆ అవకాశం కూడా దక్కకుండా చేస్తోంది. ముంపు గ్రామాల్లో పర్యటించేందుకు కాంగ్రెస్ కోర్టు అనుమతి తీసుకుంటే, అంతకంటే ముందే నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావు గ్రామాల వారీగా రైతులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి భూములు ఇవ్వడానికి వారిని ఒప్పించారు.
తెలంగాణ ఏర్పడి ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా విద్యుత్ ప్రధాన సమస్యగా నిలుస్తుందని భావించారు. టిఆర్‌ఎస్ విజయం సాధించిన తరువాత కాంగ్రెస్ సైతం ఈ అంశంపైనే దృష్టిసారించింది. కానీ ఊహించని విధంగా విద్యుత్ సమస్యను అధికార పక్షం అధిగమించగలిగింది. కెసిఆర్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన మూడు నాలుగు రోజులకే విద్యుత్ సమస్యపై కాంగ్రెస్ ఆందోళన చేసి దిష్టిబొమ్మలు దగ్ధం చేసింది. తరువాత కెసిఆర్ ప్రభుత్వం విద్యుత్ సమస్యను అధిగమించింది. ఈ ఖరీఫ్ సీజన్‌లోనే పగటి సమయంలోనే వ్యవసాయానికి తొమ్మిది గంటల విద్యుత్‌కు ఏర్పాట్లు చేశారు. సాధారణంగా వేసవిలో కనిపించే విద్యుత్ ఆందోళనలకు అవకాశం లేకుండా చేయడమే కాకుండా ఖరీఫ్‌లో వ్యవసాయానికి విద్యుత్ సరఫరా స మయం పెంచారు.
తాజాగా భూ సేకరణ సమస్యపై విపక్షం దృష్టిసారించింది. అధికార పక్షంపై దీర్ఘ కాలిక పోరాటం చేయాలని విపక్షం ప్రయత్నిస్తోంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టు భూ సేకరణ, ప్రజల్లో అసంతృప్తి అంశాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాల వారీగా భూ సేకరణ సమస్యలపై దృష్టిసారించాలని ప్రధానంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. టిడిపి మాత్రం ఎవరి దారి వారిది అన్నట్టుగా ఉంది. మల్లన్నసాగర్ ప్రాజెక్టులో 8గ్రామాల్లోని 20వేల ఎకరాలు ముంపునకు గురవుతోంది. హైదరాబాద్ నగరానికి సమీపంలో ఉండడం, సాగుకు అవకాశాలు ఉండడంతో ముంపు బాధితులు తొలుత భూములు ఇవ్వడానికి తీవ్రంగా వ్యతిరేకించారు. ఏటిగడ్డకిష్టాపూర్ కేంద్రంగా ఆందోళన సాగించారు. ప్రారంభంలో అధికార పక్షం సైతం ఈ అంశానికి పెద్దగా ప్రాధాన్యత ఇవ్వలేదు. క్రమంగా రైతుల ఆందోళన పెరగడం, కాంగ్రెస్ పార్టీ జాతీయ నాయకులు దిగ్విజయ్‌సింగ్ లాంటి వారు రంగప్రవేశం చేయడంతో సమస్య సీరియస్‌గా మారింది. అయితే ఇదే సమయంలో మేల్కొన్న అధికార పక్షం నీటిపారుదల శాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావును రంగంలోకి దించింది. హరీశ్‌రావు గ్రామాల వారీగా రైతులతో ప్రత్యేకంగా సమావేశాలు నిర్వహించి వారికి భరోసా ఇచ్చారు. ఏటిగడ్డకిష్టాపూర్ కేంద్రంగా విపక్షాలు ఆందోళన సాగిస్తే, హరీశ్‌రావు అదే స్థలంలో రైతులతో చర్చించి భూములు ఇవ్వడానికి వారిని ఒప్పించారు. అంతా సవ్యంగా సాగుతోంది అనుకున్న సమయంలో పల్లెపహాడ్, సింగారం, ఎర్రవల్లి గ్రామాల ముంపు బాధితులు, కాంగ్రెస్, సిపిఎంల ఆందోళన లాఠీచార్జీకి దారి తీసింది. జాతీయ రహదారిపై ఆందోళన ఉద్రిక్తతగా మారింది. అయితే హరీశ్‌రావు ఈ మూడు గ్రామాల ప్రజలతోకూడా చర్చించారు. ఒకరి తరువాత ఒకరు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు. తొలిరోజు పల్లెపహాడ్ గ్రామస్థులు, తరువాత ఎర్రవల్లి గ్రామస్థులు, ఆదివారం నాడు సింగారం గ్రామ రైతులు భూములు ఇవ్వడానికి ముందుకు వచ్చారు.
ఇక తెలంగాణలోని అన్ని జిల్లాల్లో కన్నా మహబూబ్‌నగర్ జిల్లాలోనే భూ సేకరణ ఎక్కువ జరుగుతోంది. భారీ ఎత్తున ప్రాజెక్టులు చేపట్టడంతో పాటు పలు పరిశ్రమల కోసం భూములు సేకరిస్తున్నారు. ఫార్మాసిటీ కోసం దాదాపు 15వేల ఎకరాల భూమి సేకరించనున్నారు. పాలమూరు- రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి 25వేల ఎకరాల వరకు భూ సేకరణ జరపాల్సి ఉంది. ఇప్పటి వరకు దాదాపు సగం భూమిని ఎలాంటి వివాదాలు లేకుండా సేకరించారు. కాగా, ఆ జిల్లాలో భూ సేకరణపై కూడా కాంగ్రెస్ దృష్టిసారించింది. పరిహారం విషయంలో రైతుల్లో అసంతృప్తి ఉంటే ఈ అంశంపై ఆందోళనలు చేయాలని కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. భూ సేకరణకు సంబంధించి వివరాలు సేకరిస్తున్నారు. అయితే ఇదే సమయంలో ఏదో ఒక విధంగా ప్రాజెక్టులను అడ్డుకోవడానికి కాంగ్రెస్, విపక్షాలు ప్రయత్నిస్తున్నాయనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకు వెళ్లాలని అధికార పక్షం ప్రయత్నిస్తోంది.

పోలీసుల లాఠీ చార్జిలో గాయపడ్డ బాధితురాలిని
ఓదార్చుతున్న మాజీ డిప్యూటీ సిఎం రాజనర్సింహ (ఫైల్‌ఫొటో)