తెలంగాణ

మోదీ పర్యటనతో తెలంగాణకు ప్రయోజనం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 3: ప్రధాని నరేంద్ర మోదీ తెలంగాణకు రావడం వల్ల అభివృద్ధికి మరింత ప్రయోజనం చేకూరుతుందని కేంద్ర కార్మిక, ఉపాధి కల్పనా శాఖ మంతి బండారు దత్తాత్రేయ తెలిపారు. ప్రధాని మోదీ రాక సందర్భంగా కేంద్ర మంత్రి దత్తాత్రేయ బుధవారం ఎన్‌టిపిసి, రామగుండం ఎరువుల ప్రాజెక్టు, రైల్వేల ఉన్నతాధికారులతో సమీక్షించారు. అనంతరం కేంద్ర మంత్రి దత్తాత్రేయ మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మోదీ తెలంగాణలో ఈ నెల 7న పలు ప్రాజెక్టులకు రిమోట్ కంట్రోలు ద్వారా శంకుస్థాపన చేయనున్నారని చెప్పారు. సుమారు 5,200 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో రామగుండంలో ఫర్టిలైజర్ ప్లాంటుకు ప్రధాని చేతుల మీదుగా శంకుస్థాపన జరగనున్నదని ఆయన తెలిపారు. ఈ ఎరువుల కర్మాగారానికి ఏడాదికి 12.7 మెట్రిక్ టన్నుల ఎరువులను ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉందని ఆయన వివరించారు. 36 నెలల్లో పూర్తికాగల ఈ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి కూడా లభించిందని అన్నారు. విజయవడాలోని మల్లవరం నుంచి రామగుండం వరకు 2019 సంవత్సరం నాటికి గొట్టపు మార్గం నిర్మాణాన్ని పూర్తి చేసి, గ్యాస్‌ను సరఫరా చేయనున్నట్లు ఆయన తెలిపారు.
రామగుండంలో ఎన్‌టిపిసి అధ్వర్యంలో నిర్మించే ప్రాజెక్టు రెండో దశలో భాగంగా 1600 మెగావాట్ల సామర్థ్యం కలిగిన థర్మల్ విద్యుత్తు ప్లాంటుకు శంకుస్థాపన చేస్తారని ఆయన వివరించారు. 10,599 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మించనున్న ఈ ప్లాంటు 2020లోగా పూర్తి అవుతుందన్న ఆశాభావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఈ ప్లాంటు ఉత్పత్తి చేసే విద్యుత్తులో 85 శాతం విద్యుత్తు తెలంగాణ రాష్ట్రానికి సరఫరా అవుతుందని ఆయన తెలిపారు. మనోహరాబాద్-కొత్తపల్లి మధ్య 152 కిలో మీటర్ల రైలు మార్గ నిర్మాణ పనులకు కూడా ప్రధాని మోదీ శంకుస్థాపన చేస్తారని కేంద్ర మంత్రి దత్తాత్రేయ తెలిపారు. విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కె. లక్ష్మణ్, ఎమ్మెల్యేలు చింతల రామచంద్రా రెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ కూడా పాల్గొన్నారు. కాగా, ‘అమృత్’ పథకం కింద తెలంగాణకు 555 కోట్ల రూపాయలు కేటాయించినందుకు కేంద్ర మంత్రి దత్తాత్రేయ కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడుకు కృతజ్ఞతలు తెలిపారు.
ఎల్‌బి స్టేడియంలో..
ఇలాఉండగా ఈ నెల 7న ప్రధాని నరేంద్ర మోదీ రాక సందర్భంగా బిజెపి రాష్ట్ర నాయకత్వం ఎల్‌బి స్టేడియంలో భారీ బహిరంగ సభ నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నది. ఈ మేరకు బుధవారం పార్టీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, ఎన్‌విఎస్‌ఎస్ ప్రభాకర్ ప్రభృతులు ఎల్‌బి స్టేడియంను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు.
బిసిల హక్కుల సాధనకు మిలిటెంట్ పోరాటాలు
కృష్ణయ్య స్పష్టీకరణ
ముషీరాబాద్/హైదరాబాద్, ఆగస్టు 3: బిసిల హక్కుల సాధనకు ఎంతకైనా తెగిస్తామని, మిలిటెంట్ పోరాటాలకు కూడా సిద్ధమని బిసి సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్.కృష్ణయ్య పునరుద్ఘాటించారు. బిసిలకు రాజ్యాంగబద్ధ హక్కులు కల్పిస్తే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ మరో అంబేద్కర్ అవుతారని పేర్కొన్నారు. పార్లమెంట్‌లో బిసి బిల్లు ప్రవేశపెట్టాలని, బిసి కులాల ఫెడరేషన్‌లకు నిధులు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఆబిడ్స్ హోటల్ సిద్దార్ధలో జరిగిన బిసి సంఘాలు, బిసి కుల సంఘాల అఖిలపక్ష పార్టీల విస్తృత స్థాయి సమావేశానికి కృష్ణయ్య ముఖ్యఅతిథిగా హాజరై ప్రసంగించారు. బిసిలకు 500 రెసిడెన్షియల్ పాఠశాలలు ఏర్పాటు చేయకపోతే ప్రభుత్వ భరతం పడతామని హెచ్చరించారు. తెలంగాణ రాష్ట్రం సర్కారు జాగీరు కాదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఫీజు రీయింబర్స్‌మెంటు పూర్తిగా విడుదల చేయాలని అన్నారు. బిసిల హక్కుల సాధనకు, చట్టసభల్లో 50 శాతం రిజర్వేషన్ల అమలుకు జాట్లు, గుజ్జర్లు, పటేళ్ల మాదిరిగా ఉద్యమించి తడాఖా చూపిస్తామని హెచ్చరించారు. ఇంటింటికీ నీళ్లు కాదు.. ఇంటికో ఉద్యోగం కావాలని తేల్చిచెప్పారు. పార్లమెంటులో బిసి బిల్లు పెట్టడానికి ముఖ్యమంత్రి కెసిఆర్.. చొరవ తీసుకుని అఖిలపక్షాన్ని ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు.
చట్టసభల్లో ఆంగ్లో ఇండియన్‌ల ప్రాధాన్యత తగ్గించి ఇప్పటివరకు అవకాశం రాని వెనుకబడిన బిసి కులాలకు ఎమ్మెల్యే స్థానాలు కట్టబెట్టాలని డిమాండ్ చేశారు. భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ లక్ష్మణ్ మాట్లాడుతూ ప్రభుత్వ జెండా బిసి జెండా కావాలంటే బిసిలు బలమైన శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు. బిసిలను పాలక ప్రభుత్వాలు విస్మరిస్తున్నాయని, బిసిలు చేసిన పాపమేంటని ఆందోళన వ్యక్తం చేశారు. ఉమ్మడి రాష్ట్రంలో 17 బిసి కులాల ఫెడరేషన్‌లు ఉంటే తెలంగాణ ప్రభుత్వం దానిని 11కు కుదించటం దారుణమని అన్నారు. ఫెడరేషన్‌కు రూ.50లక్షలు కేటాయించి కనీసం రూ.29 లక్షలు కూడా ఖర్చు చేయలేదని దుయ్యబట్టారు. ప్రభుత్వం బిసిల పట్ల సవతితల్లి ప్రేమను విడనాడాలని సూచించారు. మాజీ మంత్రి పొన్నాల లక్ష్మయ్య మాట్లాడుతూ హక్కుల సాధన, సమస్యల పరిష్కారానికి ఉద్యమాలు చేస్తేనే ప్రభుత్వాలు దిగివస్తాయని అన్నారు. ఆర్థిక, సామాజిక రంగాలలో న్యాయం కోసం మరో పోరాటాన్ని కొనసాగించాలని పిలుపునిచ్చారు. తెలంగాణ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్‌గౌడ్ సభాధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో జాతీయ సంఘం ఉపాధ్యక్షుడు గుజ్జ కృష్ణ, యువజన సంఘం అధ్యక్షుడు నీలం వెంకటేష్, ప్రదేశ్ గంగపుత్ర సంఘం అధ్యక్షుడు ఎఎల్ మల్లయ్య, బిసి సంఘాల ప్రతినిధులు సి.రాజేందర్, శారదగౌడ్, భాగ్యలక్ష్మి, రామలింగం, ఎస్.దుర్గయగౌడ్, విక్రంగౌడ్, కుందారం గణేషాచారి, గోగికార్ సుధాకర్ పాల్గొన్నారు.
రైటప్: 3వివిటి 2 - అఖిలపక్ష పార్టీల విస్తృత స్థాయి సమావేశంలో ప్రసంగిస్తున్న కృష్ణయ్య, చిత్రంలో డాక్టర్ లక్ష్మణ్, పొన్నాల లక్ష్మయ్య.