తెలంగాణ

అనుమానించడం లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 5: తెలంగాణ ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టం సెక్షన్ 8 (1)కి అనుగుణంగా భూసేకరణ విధానాన్ని రూపొందించి కోర్టుకు సమర్పించాలని హైకోర్టు శుక్రవారం ఆదేశించింది. రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన జీవో 123ను సింగిల్ హైకోర్టు జడ్జి రద్దు చేస్తూ ఇచ్చిన తీర్పును సవాలు చేస్తూ తెలంగాణ ప్రభుత్వం తరఫున అడ్వకేట్ జనరల్ హైకోర్టులో లంచ్ మోషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేష్ రంగనాథన్, జస్టిస్ యు దుర్గాప్రసాద్ విచారణకు స్వీకరించారు. ఈ సందర్భంగా హైకోర్టు జోక్యం చేసుకుని జీవో విషయంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్దేశాలను అనుమానించడం లేదని పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ విషయమై పడుతున్న తాపత్రయం కోర్టు గుర్తించిందన్నారు. అదే సమయంలో బాధితుల హక్కులను పరిరక్షించాల్సిన బాధ్యత కోర్టుపై ఉందని హైకోర్టు స్పష్టం చేసింది.
2013 భూసేకరణ చట్టం ప్రకారం దీనికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వాలు చట్టాలు చేసుకునేందుకు వీలుందని హైకోర్టు సూచించింది. ఇప్పటికే ఇస్తున్న నష్టపరిహారాన్ని పెంచే హక్కు రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని హైకోర్టు పేర్కొంది. ఈ సందర్భంగా తెలంగాణ అడ్వకేట్ జనరల్ రామకృష్ణారెడ్డి వాదనలు వినిపిస్తూ భూమి ఇచ్చేందుకు ముందుకు వచ్చే యాజమానుల నుంచి భూములను ప్రభుత్వం కొనుగోలు చేస్తోందన్నారు. రైతులు తమ భూములను అమ్మాలని ఎటువంటి నిర్బంధానికి గురి చేయడం లేదన్నారు. సాధారణంగా ఓపెన్ మార్కెట్‌లో భూముల విలువ ఎక్కువగా ఉంటుందన్నారు. భూమి యజమానులు తమ భూములను ఇవ్వడానికి అంగీకరించని పక్షంలో మాత్రమే గత్యంతరం లేని పరిస్థితుల్లో భూసేకరణ చట్టాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందన్నారు. సింగిల్ జడ్జి కోర్టు జీవో 123ను రద్దు చేయడం, దీనికి సంబంధించిన తీర్పులోని అంశాలను ఆయన చదువుతూ గతంలో కూడా కోర్టు ఈ జీవో విషయమై విచారించేందుకు నిరాకరించాయని ఏజి తెలిపారు.
ఈ సందర్భంగా హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జోక్యం చేసుకుంటూ రెండు కారణాలపై సింగిల్ జడ్జి కోర్టు జీవో 123ను రద్దు చేశారన్నారు. వ్యవసాయ కార్మికులకు పునరావాసం, రీసెటిల్‌మెంట్ విషయాన్ని, నష్టపరిహారం పెంపు అనే అంశాలను జీవో 123లో విస్మరించారన్నారు. ఈ రెండు అంశాలను విస్మరించడం వల్ల జీవో 123 భూసేకరణ చట్టం 2013 స్ఫూర్తికి వ్యతిరేకంగా ఉందన్న కారణంపై కొట్టివేశారన్నారు. రాష్ట్ర ప్రభుత్వమే ఎక్కువ రేట్లకు భూ యజమానుల నుంచి భూములను కొనుగోలు చేస్తే సంతోషమేనన్నారు. వ్యవసాయ కార్మికుల విషయం ఏమిటని కోర్టు ప్రశ్నించింది. వ్యవసాయ కార్మికులు భూమి మీద ఆధారపడి జీవిస్తున్నారని, వీరి భవిష్యత్ ఏమిటని కోర్టు ప్రశ్నించింది. సెక్షన్ 108 ప్రకారం ప్రభుత్వమే ఒక విధానాన్ని రూపొందించాల్సి ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం వ్యవసాయ కార్మికులపై తీసుకున్న విధానమేంటో వివరించాలని కోర్టు అడిగింది.
ఈ సందర్భంగా అడ్వకేట్ జనరల్ వాదనలు వినిపిస్తూ రాష్ట్ర ప్రభుత్వం సంక్షేమ ప్రభుత్వమని, పేద వర్గాల ప్రయోజనాలను పరిగణనలోకి తీసుకుని వారి హక్కులను పరిరక్షిస్తుందన్నారు. ప్రభుత్వం బ్రోకర్‌గా వ్యవహరించదని స్పష్టం చేశారు. ప్రజల చేత ఎన్నుకున్న ప్రభుత్వం జవాబుదారీతనంతో వ్యవహరిస్తుందన్నారు. మరో మూడేళ్లపాటు ఇప్పుడున్న ప్రభుత్వం అధికారంలో ఉంటుందని, సంక్షేమమే ప్రభుత్వ కర్తవ్యమని తెలిపారు. ఈ ప్రాజెక్టువల్ల నిర్వాసితులయ్యే ప్రతి కుటుంబాన్ని, వ్యక్తిని ఆదుకునేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటుందన్నారు. ప్రభుత్వం ఒక కొత్త విధానాన్ని తెచ్చే వరకు ఇప్పుడున్న రిజిస్ట్రేషన్ల విధానాన్ని కొనసాగించాలని కోర్టును అభ్యర్ధించారు. పిటీషనర్ల తరఫున న్యాయవాది కెఎస్ మూర్తి వాదనలు వినిపిస్తూ అడ్వకేట్ జనరల్ వాదనలను వ్యతిరేకించారు. పిటిషనర్లు పేదలని, వారికి ఎవరి దయా అక్కర్లేదని, వారి హక్కులను పరిరక్షించాలని మాత్రమే వ్యవసాయ కార్మికులు కోరుతున్నారని కోర్టుకు నివేదించారు. అనంతరం కేసు విచారణను సోమవారానికి వాయిదా వేశారు.