తెలంగాణ

ఘనంగా ముగిసిన యువజనోత్సవాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భద్రాచలం, జనవరి 6: రాష్ట్ర స్థాయి యువజనోత్సవాలు గోదావరి లోయ ఖమ్మం జిల్లా భద్రాచలంలో బుధవారం ఘనంగా ముగిశాయి. మూడు రోజుల పాటు రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన యువ కళాకారుల ప్రదర్శనలతో శ్రీ రామదివ్యక్షేత్రం హోరెత్తింది. ముగింపు కార్యక్రమంలో రాష్ట్ర యువజన క్రీడల సర్వీసుల శాఖ కమిషనర్ ఎంఎ అజీం, ఐటీడీఏ పీవో రాజీవ్‌గాంధీ హన్మంతు, ఎమ్మెల్యేలు తాటి వెంకటేశ్వర్లు, సున్నం రాజయ్య, సర్పంచి భుక్యా శే్వత, జడ్పీటీసీ గోడేటి రవి పాల్గొన్నారు. మూడురోజుల పాటు 18 అంశాల్లో నిర్వహించిన పోటీల్లో 945 మంది యువతీ యువకులు తమ ప్రతిభా పాటవాలను ప్రదర్శించారు. 10 జిల్లాల నుంచి పాల్గొన్న ఈ ఉత్సవాల్లో హైదరాబాద్ అత్యధికంగా 17 బహుమతులు గెలుచుకుని అగ్రస్థానంలో నిలవగా ఖమ్మం 7 బహుమతులతో ద్వితీయ, వరంగల్ 5 బహుమతులతో తృతీయస్థానంలో నిలిచాయి. ఈ ఉత్సవాల్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతులు గెలుచుకున్న కళాకారులతో ఈ నెల 12న చత్తీస్‌గఢ్‌లోని రాయపూర్‌లో జరిగే జాతీయ యువజనోత్సవాలకు రాష్ట్ర జట్టును పంపుతామని కమిషనర్ అజీం ప్రకటించారు.
చిన్నారిపై మారుటి తండ్రి
పైశాచికం
కొరికి, సిగరెట్‌తో కాల్చి చిత్రహింసలు
హైదరాబాద్/శేరిలింగంపల్లి, జనవరి 6: నాలుగేళ్ల చిన్నారిపై మారుటి తండ్రి పైశాచికంగా ప్రవర్తించాడు. పీకాలదాకా మద్యం సేవించి విచక్షణారహితంగా చిన్నారిని కొరికి గాయపర్చాడు. కాగా కన్న కూతుర్ని భర్త హింసిస్తున్నా తల్లి పట్టించుకోకపోవడం మరీ దారుణం. ఈ సంఘటన మియాపూర్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. ఇన్‌స్పెక్టర్ రమేష్ కథనం ప్రకారం..న్యూహఫీజ్‌పేటలోని ఆదిత్యనగర్‌లో నివాసం ఉంటున్న ధనలక్ష్మి(30)కి నాలుగేళ్ల కూతురు ఉంది. ఆమె భర్తను వదిలేసి ఏడాది క్రితం రవి (26) అనే వ్యక్తిని పెళ్ళి చేసుకుంది. హోటల్‌లో పనిచేస్తున్న రవి మద్యానికి బానిసై తాగుబోతుగా మారాడు. మూడు రోజుల క్రితం చిన్నారి తొడపై కొరికి, సిగరెట్‌తో కాల్చి హింసించాడు. తల్లి కూడా పట్టించుకోకపోవడంతో స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారిద్దరినీ అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.
‘ప్రైవేటు రంగంలో
రిజర్వేషన్లు కల్పించాలి’
ఆంధ్రభూమి బ్యూరో
హైదరాబాద్, జనవరి 6: ప్రైవేటు రంగంలో కూడా ఎస్సీ, ఎస్టీ, బిసి, మైనార్టీలకు రిజర్వేషన్లు అమలు చేసేందుకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ సాధన సంఘం (పిఆర్‌ఎస్‌ఎస్) తెలంగాణ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది. సంఘం ఆధ్వర్యంలో బుధవారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగిన సంఘం రాష్ట్ర కమిటీ సమావేశానికి డాక్టర్ బివి రాఘవులు అధ్యక్షత వహించారు. ఈ శాసనసభ సమావేశాల్లోనే రిజర్వేషన్ల కోసం ప్రత్యేక చట్టం తీసుకురావాలని సమావేశం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును కోరింది. ఈ డిమాండ్‌తో ఫిబ్రవరి 14న ఛలో హైదరాబాద్ నిర్వహిస్తున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జాన్‌వెస్లీ తెలిపారు. ఈ సమావేశంలో పిఆర్‌ఎస్‌ఎస్ రాష్ట్ర కో కన్వీనర్ గాలి వినోద్‌కుమార్, ప్రధాన కార్యదర్శి శ్రీరామ్‌నాయక్ తదితరులు పాల్గొన్నారు.

సిర్పూర్ పేపర్ మిల్లుకు
వచ్చిన ఐటిసి ప్రతినిధులు
కాగజ్‌నగర్, జనవరి 6 : ఆదిలాబాద్ జిల్లా కాగజ్‌నగర్ పట్టణంలో మూతబడి ఉన్న సిర్పూర్ పేపర్‌మిల్లును భద్రాచలం పేపర్‌మిల్లుకు చెందిన ఐటిసి ప్రతినిధులు, ఇంజనీర్లు బుధవారం సందర్శించారు. మిల్లులోని ప్రతి ప్లాంటు, మిషనరీలను క్షుణ్ణంగా పరిశీలించి స్థానిక అధికారులను వివరాలను అడిగి తెలుసుకున్నారు. వివిధ ప్లాంట్లు, మిషనరీలు, 8 పేపర్‌మిషన్లను వారు పరిశీలించారు. మిల్లుకు సంబంధించిన ఆస్తులు, ఇతర వివరాలను స్థానిక అధికారులను అడిగి తెలుసుకున్నారు. మిల్లు వివరాలను స్థానిక ఎమ్మెల్యే కోనప్ప ఐటిసి ప్రతినిధులకు వివరించారు. మిల్లు చరిత్ర, మిల్లులోని యంత్రాల వివరాలను వారికి వివరించారు. స్థానిక నిపుణులు కూడా ప్లాంట్ల వివరాలను, కాలపరిమితి గురించి ప్రతినిధులకు వివరించారు. గురువారం కూడా మిల్లులోని యంత్రాలను పరిశీలించిన అనంతరం వారు జాబితాను తయారు చేసి మిల్లు యజమానికి అందజేయనున్నట్లు తెలిసింది. మిల్లును సందర్శించిన వారిలో ఐటిసి జనరల్ మేనేజర్ శ్రీనివాస్, కన్సల్టెన్సీ కాంతారావు, మరో నలుగురు ఇంజనీర్లు, కార్మిక శాఖ కమిషనర్ మాణిక్య రాజు, పరిశ్రమల శాఖ డిప్యూటీ కార్యదర్శి శ్రవణ్ కుమార్, ఐడిబిఐ ప్రతినిధులున్నారు.

‘యాదాద్రి స్టేషన్’గా రాయగిరి
యాదాద్రికి మెట్రో లేదా ఎంఎంటిఎస్ రైల్ ఎంపి బూర, మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డి వెల్లడి
యాదగిరిగుట్ట, జనవరి 6: నల్లగొండ జిల్లా రాయగిరి రైల్వే స్టేషన్ ఇక యాదాద్రి రైల్వే స్టేషన్‌గా మారనుంది. ఈ మేరకు నామకరణం చేసేందుకు ప్రణాళికలు ముఖ్యమంత్రి కేసిఆర్ ఆదేశాల మేరకు ప్రణాళికలు సిద్ధం చేసినట్లు మెట్రో ఎండి ఎన్‌విఎస్‌రెడ్డి తెలిపారు. మెట్రో రైలు సౌకర్యం నిమిత్తం బుధవారం టెక్నికల్ బృందంతో కలిసి భువనగిరి ఎంపి బూర నర్సయ్యగౌడ్, ఆయన స్థలపరిశీలన చేశారు. అనంతరం యాదాద్రి కొండపైన స్వామి వారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన విలేఖరులతో మాట్లాడుతూ యాదాద్రి వరకు మైట్రో రైల్, లేదా ఎంఎంటిఎస్ రైల్‌మార్గానికి సన్నాహాలు చేస్తున్నట్లు చెప్పారు. యాదాద్రి పెద్ద ఎత్తున అభివృద్ధి చెందుతున్న తరుణంలో రాబోయే రోజుల్లో భక్తుల రద్దీ పెద్ద ఎత్తున పెరుగుతుందని, ఈ నేపథ్యంలోనే ఎంఎంటి ఎస్ సౌకర్యం కల్పించేందుకు ప్రయత్నం చేస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు రాయగిరి రైల్వేస్టేషన్‌ను, అదేవిధంగా యాదాద్రికి చేరుకునే మార్గాన్ని ఆయన పరిశీలించారు. సమావేశంలో వైటిడిఎ స్పెషలాఫీసర్ రమేశ్‌రెడ్డి, గుట్ట ఎంపిపి గడ్డమీది స్వప్న రవిందర్‌గౌడ్, గుట్ట సర్పంచ్ బూడిద స్వామి, నాయకులు అంజనేయులు ఎంపిటిసి సీస క్రిష్ణ పాల్గొన్నారు.
రాయగిరి స్టేషన్‌ను పరిశీలిస్తున్న
ఎంపి బూర నర్సయ్యగౌడ్, మెట్రో ఎండి ఎన్‌విఎస్ రెడ్డి