తెలంగాణ

నామినేటెడ్ పదవులకోసం ఎదురుచూపులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఆగస్టు 11: నామినేటెడ్ పదవుల పంపకం అప్పుడు ఇప్పుడు అంటూ కాలం గడిచిపోతోంది. టిఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచిపోయినా నామినేటెడ్ పదవుల పంపకాన్ని తేల్చక పోవడంతో కార్యకర్తలు తమకు అవకాశం ఎప్పుడు వస్తుందా? అని ఎదురు చూస్తున్నారు. మార్కెట్ కమిటీ పాలక వర్గాలు మినహా మరే పదవుల పంపకంపై దృష్టి సారించలేదు. సాధారణంగా నామినేటెడ్ పదవుల పదవీ కాలం రెండేళ్ల సమయం ఉంటుంది. అధికారంలోకి రాగానే కొంత మందికి అవకాశం కల్పిస్తే ఆ స్థానంలో ఇప్పుడు మరొకరికి అవకాశం లభించి ఉండేదని నాయకులు చెబుతున్నారు. ప్రభుత్వంపైన, పార్టీపైన ముఖ్యమంత్రి కెసిఆర్‌కు పూర్తి స్థాయి పట్టు లభించిన తరువాత పదవుల పంపకానికి మీన మేషాలు లెక్కించడం తగదు అనే అభిప్రాయం నాయకుల్లో వ్యక్తం అవుతోంది. ఎస్సీ కార్పొరేషన్, అధికార భాషా సంఘం, మైన్స్ కార్పొరేషన్, ప్రెస్ అకాడమీ, మిషన్ భగీరథ కార్పొరేషన్, ఆర్‌టిసి కార్పొరేషన్ వంటి కొద్దిపాటి కార్పొరేషన్ల నియామకాలు జరిగాయి.
అదే ఊపులో మిగిలిన కార్పొరేషన్లను సైతం భర్తీ చేస్తారని నాయకులు ఎదురు చూశారు. మార్కెట్ కమిటీ చైర్మన్‌లను సైతం పూర్తి స్థాయిలో నియమించలేదు. తొలిసారిగా మార్కెట్ కమిటీ చైర్మన్‌ల నియామకంలో రిజర్వేషన్ల విధానం అమలు చేయడం ద్వారా నాయకుల మధ్య పెద్దగా పోటీ లేకుండా చేశారు. ఏప్రిల్‌లో పార్టీ ప్లీనరీ జరిగింది. తొలుత ప్లీనరీ కన్నా ముందే నామినేటెడ్ పదవుల పంపకం పూర్తవుతుందని ముఖ్యమంత్రి ప్రకటించారు. కొన్ని మార్కెట్ కమిటీలకు పాలక వర్గాలను నియమించారు. తరువాత మేలో అన్ని నియామకాలు పూర్తవుతాయని చెప్పారు. గత రెండేళ్ల నుంచి ఇలా ఎప్పటికప్పుడు తేదీలు ప్రకటిస్తున్నా, పదవుల పంపకం మాత్రం ఒక కొలిక్కి రాలేదు. తెలంగాణ భవన్‌కు సైతం కెసిఆర్ అరుదుగా వస్తున్నారు. దీంతో పదవుల గురించి నాయకులు కెసిఆర్‌ను అడిగే అవకాశం దక్కడం లేదు.
జిల్లా స్థాయిలో పదవులు, రాష్ట్ర స్థాయిలో పదవులు పెద్ద సంఖ్యలోనే ఉన్నాయి. అయితే ఉద్యమ కాలం నుంచి పార్టీలో ఉన్న వాళ్లు, ఆ తరువాత పార్టీలో చేరిన వారు పదవులను ఆశిస్తున్నారు. పుష్కరాల తరువాత పదవుల పంపకంపై కెసిఆర్ తిరిగి దృష్టిసారించే అవకాశం ఉందని పార్టీ వర్గాలు తెలిపాయి. ఇప్పట్లో స్థానిక సంస్థలతో పాటు ఎలాంటి ఎన్నికలు లేవు. దీనిని దృష్టిలో పెట్టుకుని మొదటి విడత జిల్లా స్థాయి పదవుల పంపకంపైనా ముఖ్యమంత్రి దృష్టి సారించాలని పార్టీ నాయకులు కోరుతున్నారు. గ్రంథాలయ సంస్థ, దేవాలయ పాలక వర్గాలు, మార్కెట్ కమిటీల వంటి స్థానిక పదవులను తొలుత నియమించే అవకాశం ఉందని పార్టీ నాయకులు తెలిపారు.