తెలంగాణ

‘వర్దీ’ వర్రీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, సెప్టెంబర్ 13: తెలంగాణ జిల్లాల్లో వేళ్లూనుకుపోయిన వర్దీ బీడీల తయారీపై అధికారుల నిఘా పూర్తిగా సన్నగిల్లింది. పిఎఫ్ గుర్తింపు కలిగి ఉన్న కార్మికులకు పనిదినాల్లో కోతలు పెడుతూ, నాన్ పిఎఫ్ కార్మికులతో గుట్టుగా వర్దీ బీడీలు తయారు చేయించి నెలనెలా కోట్లాది రూపాయలను సొమ్ము చేసుకుంటున్నారు. వర్దీ బీడీల తయారీ గురించి ఎవరైనా నిలదీసేందుకు ప్రయత్నిస్తే, మొత్తానికే కంపెనీలు మూసివేస్తామంటూ యాజమాన్య ప్రతినిధులు బెదిరింపులకు దిగుతున్నారని పలువురు వాపోతున్నారు. దీంతో ఈ గుట్టును బయటపెట్టేందుకు సాహసించడం లేదు. ఇదివరకు బీడీ కార్మిక సంఘాల నాయకులు, కార్మిక శాఖ అధికారులు జిల్లాలో దాడులు చేసిన సందర్భంగా, ఓ బీడీ కంపెనీ వర్దీ తయారీని ప్రోత్సహిస్తున్న వైనం గుట్టు రట్టయ్యింది. సదరు ఒక్క కంపెనీయే ఎక్కడికక్కడ ఏజెంట్లను నియమించుకుని రోజుకు రెండు కోట్ల బీడీలను వర్దీ రూపంలో చుట్టిస్తున్నట్టు తేటతెల్లమైంది. వేయి బీడీలకు అధికారికంగా కార్మికులకు అన్ని భత్యాలు కలుపుకుని 140 రూపాయల వేతనంతో పాటు పిఎఫ్, ఇఎస్‌ఐ సదుపాయాలను యాజమాన్యాలు కల్పిస్తాయి. అందుకు భిన్నంగా వర్దీ బీడీలు చుట్టించడం ద్వారా కేవలం 100 రూపాయల వేతనంతోనే సరిపెడుతున్నారు. ఈ లెక్కన కార్మికులు 5కోట్ల బీడీల తయారీపై వేతనం రూపంలోనే రోజుకు 20 లక్షల రూపాయలను కోల్పోవాల్సి వస్తోంది. అంతేకాకుండా పిఎఫ్, ఇఎస్‌ఐ వంటి సదుపాయాలకు దూరమవుతున్నారు.
ప్రభుత్వానికి పన్ను రూపంలో వేయి బీడీలకు దాదాపు 16 రూపాయల చొప్పున లెక్కిస్తే 7 లక్షల రూపాయల ఆదాయానికి గండి పడుతోంది. ఒక్కరోజుకే ఇంత పెద్దఎత్తున బీడీ యాజమాన్యాలకు అడ్డదోవన ఆదాయం సమకూరుతుండగా, కార్మికులు మాత్రం శ్రమ దోపిడీకి గురికావాల్సి వస్తోంది. నేరుగా కార్మికులకు పని కల్పించకుండా బీడీ యాజమాన్యాలు కోరుట్ల తదితర ప్రాంతాల నుండి గుట్టుచప్పుడు కాకుండా తునికాకు, తంబాకులను నిజామాబాద్‌కు తరలించి, నాగారంలోని 80 క్వార్టర్స్, న్యాల్‌కల్, నవీపేట, నందిపేట, బోధన్, వర్ని మండలం చందూర్ ప్రాంతాల్లో అక్రమంగా బీడీలను తయారు చేయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. ఒక్క నిజామాబాద్ జిల్లాలోనే ప్రతిరోజు రెండు కోట్ల వరకు వర్దీ బీడీలు తయారవుతుండగా, మెదక్, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల పరిధిలో మరో మూడు కోట్ల బీడీలు తయారు చేయిస్తున్నట్టు బీడీ కార్మిక సంఘాలు ఆరోపిస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం పకడ్బందీగా దృష్టిసారిస్తే అటు ఖజానాకు చేరాల్సిన ఆదాయాన్ని పెద్ద మొత్తంలో రాబట్టుకోవడంతో పాటు బీడీ కార్మికులకు న్యాయం చేసినట్లవుతుంది.