తెలంగాణ

టిఎన్జీఓ భవనం వద్ద ఉద్రిక్తత

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, సెప్టెంబర్ 19: హైదరాబాద్ నాంపల్లిలోని టిఎన్జీవో భవనం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం గేటు తాళాలు పగులగొట్టి పెట్రోల్ బాటిళ్లతో ఆంధ్రాకు కేటాయించిన నాలుగవ తరగతి ఉద్యోగులు భవనం పైకి ఎక్కి హల్‌చల్ సృష్టించారు. ఆంధ్రాకు కేటాయించిన తమను తిరిగి తెలంగాణకు రప్పించుకోకపోతే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. పెద్దఎత్తున ఉద్యోగులు ఆందోళనకు దిగడంతో నాంపల్లి టిఎన్జీవో భవనం వద్ద ఉద్రిక్తపరిస్థితులు నెలకొన్నాయి. దీంతో పోలీసులు ఉద్యోగులను భవనం పైనుంచి కిందకు రావాలని, సమస్యను సామరస్యంగా పరిష్కరించుకోవాలని సూచించారు. అయినా వినని ఉద్యోగులు ఒంటిపై పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య చేసుకుంటామని భీష్మించుకున్నారు. దసరా లోపు ఉద్యోగులందరినీ ఆంధ్రా నుంచి తీసుకొస్తామని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారని టిఎన్జీవోభవన్‌కు చేరుకున్న నాన్ గెజిటెడ్ అధికారుల కేంద్ర సంఘం గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్, రవీందర్‌రెడ్డి, సత్యనారాయణ నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ రాష్ట్ర విభజన నేపథ్యంలో వివిధ శాఖలకు చెందిన మొత్తం 1850 మంది ఉద్యోగులను ఆంధ్రకు కేటాయించారని, విభజన జరిగి రెండేళ్లయిపోయినా కొందరిని మాత్రమే తెలంగాణకు రప్పించుకున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. 670 మంది నాల్గవ తరగతి ఉద్యోగులను తెలంగాణకు రప్పించుకుంటామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చి మూడు నెలలు గడుస్తున్నా ఇప్పటి వరకు తమను తెలంగాణకు కేటాయించడం లేదని వారు వాపోయారు. ఆంధ్రాపాలకులు తమకు సహకరించడం లేదని, సెలవులు ఇవ్వకపోగా తమను వేధింపుకు గురిచేస్తున్నారని ఉద్యోగులు ఆరోపించారు. తాము ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని, తమ పిల్లలు, తల్లిదండ్రులు తెలంగాణలో అనారోగ్యంతో బాధపడుతున్నారని, వారిని పట్టించుకునే దిక్కులేదని వెంటనే తమను తెలంగాణకు కేటాయించాలని ఉద్యోగులు డిమాండ్ చేశారు.
టి.ఉద్యోగులను వేధిస్తే సహించం: ఉద్యోగ సంఘాలు
ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న తెలంగాణ ఉద్యోగులను దసరాలోపు తీసుకువస్తామని మంత్రి కెటిఆర్ హామీ ఇచ్చారని ఉద్యోగ సంఘాలు తెలిపాయి. టి.ఉద్యోగులను వేధిస్తే సహించబోమని హెచ్చరించాయి. ప్రభుత్వానికి ఎంత భారమైనా ఉద్యోగులను తీసుకువస్తామని భరోసా ఇచ్చారని నేతలు చెప్పారు.

సోమవారం హైదరాబాద్‌లోని టిఎన్జీఓ భవనంలో ధర్నాచేస్తున్న ఉద్యోగులు.
పెట్రోల్ సీసాలతో భవనంపైకి ఎక్కి నిరసన తెలుపుతున్న ఎన్జీఓలు