తెలంగాణ

ఉమ్మడి సేద్యం.. దిగుబడి మంత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంగారెడ్డి, సెప్టెంబర్ 28: వ్యవసాయ ఆధారిత ప్రాంతమైన తెలంగాణాలోని రైతులు వ్యక్తిగతంగా పంటలను సాగు, దిగుబడులు చేస్తున్నారని, కానీ సామూహికంగా కొనసాగిస్తే ఫలితం సత్వరమే వస్తుందని సిఎం కెసిఆర్ మెదక్ జిల్లా జగదేవ్‌పూర్ మండలం ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాల రైతులకు పాడి, పంటలపై ప్రత్యేక పాఠాలు బోధించారు. బుధవారం మధ్యాహ్నం ఎర్రవల్లి గ్రామంలో నిర్మించిన కమ్యూనిటిహాల్‌లో సభను నిర్వహించి ప్రధానంగా వ్యవసాయంపై హితోపదేశం చేసారు. పంటలు చేతికి వచ్చే సమయంలో ప్రకృతి వైపరీత్యాలు సంభవిస్తుంటాయని, అలాంటి సమయంలో పంటలకు నష్టం వాటిల్లి రైతులు నష్టాన్ని చవిచూస్తారని అన్నారు.
తాను సిద్ధిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చిన్నకోడూరు మండలం సలంద్రి గ్రామానికి వెళ్లానని ఆ సమయంలో గ్రామంలో ఎవరూ లేకపోగా ఒక గుడి వద్ద మల్లవ్వ కనిపించిందని గుర్తు చేసుకున్నారు. కొద్దిసేపటికి కొందరు రైతులు వచ్చారని, ఏం చేస్తున్నారని ప్రశ్నిస్తే వరి కోతకు వచ్చిందని చెప్పారన్నారు. అలాంటి సమయంలో రాళ్ల వర్షం కురిసే ప్రమాదం పొంచివుందని తాను గుర్తించి, కాసేపు వౌనంగా ఆలోచించానని అన్నారు. రేపు ఉదయం తాను వస్తానని వరికోతను ఒకేసారి చేపడితే రాళ్ల వర్షం ప్రమాదాన్ని అధిగమించవచ్చని వివరిస్తే వారు పాటిస్తామని ముందుకు వచ్చారని అన్నారు. యువకులను, రైతులను, మహిళలను బృందాలుగా ఏర్పాటు చేసి ఒక్కో బృందానికి ఒక పనిని అప్పగించి ఐదు రోజుల లక్ష్యాన్ని ఆరవ రోజు మధ్యాహ్నానికి పూర్తి చేసామన్నారు. తాను కూడా ఒక మునుము పట్టి వరికోత కోసి విజయం సాధిస్తే అదే స్ఫూర్తితో 14 గ్రామాల్లో రైతులు చైతన్యమయ్యారని అన్నారు. తాజాగా ఎర్రవల్లి, నర్సన్నపేట గ్రామాలకు చెందిన మొక్క జొన్న రైతులు కూడా సామూహికంగా కోత కోసే విధానాన్ని అవలంబించాలని సూచిస్తూ వారితో హామీ తీసుకున్నారు. నూతన విధానాన్ని అవలంబించడానికి తనను పిలిస్తే వచ్చి మొక్కజొన్న కోత కోస్తానన్నారు. దీనివల్ల వారం రోజుల్లో రెండవ విడతగా మొక్కజొన్న సాగు చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. రెండు గ్రామాల్లో 2800 ఎకరాల సాగు భూమి ఉందని, మొత్తం డ్రిప్ విధానంతో సాగు చేసే కార్యక్రమానికి త్వరలోనే శ్రీకారం చుడుతున్నామని, డబుల్ బెడ్ రూం ఇళ్లలోకి ప్రవేశించే సమయానికి ప్రతి ఇంటికి రెండు పాడి గేదెలను సమకూరుస్తున్నామని వెల్లడించారు. రైతులు వారికి ఇష్టం వచ్చిన సంత (అంగడి)లోకి వెళ్లి గేదెలను ఎంపిక చేసుకుని యాబై, వంద రూపాయలు బయానా రూపంలో ఇచ్చి వస్తే మిగతా తతంగాన్ని అధికార యంత్రాంగం చూసుకుంటుందన్నారు. ఇందుకుగాను ఎవరి వ్యవసాయ పొలంలో వారే గేదెలకు పునరావాసం కల్పించేందుకు కొట్టాలు నిర్మించుకోవాలన్నారు. గేదెలకు అవసరమైన పశుగ్రాసాన్ని వారి వారి వ్యవసాయ పొలాల్లో కొంత భాగంలో డ్రిప్ విధానం ద్వారా పశుగ్రాసాన్ని సాగు చేయాలని, అవసరమైన విత్తనాన్ని సమకూరుస్తామని వివరించారు. ప్రతి కుటుంబానికి పది చొప్పున ఊరు కోళ్లను అందిస్తామని సిఎం కెసిఆర్ పేర్కొనడంతో సభలో ఒక్కసారిగా నవ్వులు విరబూసాయి. ఈ విధానం కుటుంబ ఆర్థిక పరిపుష్టికి దోహదపడుతుందని అవగాహన కల్పించారు. ఎదుటి వారిని గౌరవిస్తూ, అపశబ్దాలు వాడకుండా ఉండాలని హితవుపలికారు. గడచిన ఎనిమిది మాసాలుగా గ్రామస్తుల్లో మంచి మార్పు వచ్చిందని సంతృప్తిని వ్యక్తం చేసారు. చైతన్యవంతంగా ఉంటేనే గ్రామాలు అభివృద్ధి చెందుతాయని, గ్రామాభివృద్ధి కమిటీలు నిర్దిష్టమైన కట్టుబాట్లు విధించాలని, వాటిని అతిక్రమించే వారిపై నిర్దాక్షిణ్యంగా జరిమానాలు విధించాలని సూచించారు.