తెలంగాణ

మద్దతు ధరకోసం రోడ్డెక్కిన ఆముదం రైతులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, సెప్టెంబర్ 29: ఆముదానికి మద్దతు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ వందలాది మంది రైతులు మహబూబ్‌నగర్ జిల్లాలో గురువారం రోడ్డెక్కారు. వందలాది మంది రైతులు తాము పండించిన ఆముదం పంటను దేవరకద్ర మార్కెట్ యార్డుకు తీసుకువచ్చారు. అయితే మార్కెట్‌లో మద్దతు ధర లేకపోవడంతో వ్యాపారులు రూ.2500 నుండి రూ.3000 వరకు కొనుగోలు చేయడానికి ముందుకు వచ్చారు. దీంతో రైతులు ఆముదాన్ని విక్రయించేందుకు నిరాకరించారు. వ్యాపారులు, అధికారులు ధర పెంచేది లేదని, ఇష్టం వస్తే అమ్మండి.. లేకుంటే మీ ఆముదాన్ని మీరు తీసుకెళ్లాలంటూ రైతులను బెదిరించారు. దీంతో ఆగ్రహించిన రైతులు ఆముదానికి ప్రభుత్వం ముందుగా మద్దతు ప్రకటించాలని డిమాండ్ చేస్తూ ఒక్కసారిగా మార్కెట్‌లో నుండి బయటకు పరుగులు తీస్తూ హైదరాబాద్ - రాయచూర్ వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించారు. దాదాపు 2 గంటల పాటు రైతులు రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగడంతో రోడ్డుపై వాహనాలు ఎక్కడికక్కడే నిలిచిపోయి ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. పోలీసులు, అధికారులు రైతులకు ఎంత నచ్చజెప్పినా రైతుల మాత్రం మద్దతు ధర ప్రకటించేవరకు కదిలేది లేదని భీష్మించుకుని కూర్చున్నారు. మార్కెట్ యార్డుకు సంబంధించిన అధికారులు విషయాన్ని ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వడంతో ప్రస్తుతం మార్కెట్‌కు వచ్చిన ఆముదాన్ని కొనుగోలు చేయాలని, రైతులకు అధికంగా ధర వచ్చే విధంగా నిర్ణయం తీసుకుని కొనుగోళ్లు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. అయితే అధికారుల హామీ ఎలా ఉన్నా ఆముదానికి మాత్రం క్వింటాలుకు ప్రభుత్వం ధర రూ.5000 నుండి రూ.6000 వరకు ఉండాలని రైతులు మాత్రం డిమాండ్ చేస్తూ ఆందోళన విరమించారు.

చిత్రం.. రోడ్డెక్కి ధర్నా చేస్తున్న ఆముదం రైతులు