తెలంగాణ

వరంగల్ ఫలితాన్ని అంగీకరిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సూర్యాపేట, నవంబర్ 25: వరంగల్ పా ర్లమెంట్ ఉప ఎన్నికల ఫలితాన్ని ప్రజలు ఇచ్చిన తీర్పుగా భావించి అంగీకరిస్తున్నామని, సాధారణంగా ఉప ఎన్నికల్లో అధికార పార్టీకే విజయ అవకాశాలు ఎక్కువగా ఉంటాయని బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు అన్నారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో జరిగే గోదావరి హారతి కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెళ్తూ మార్గమధ్యంలోని సూర్యాపేటలో బుధవారం ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. ఉప ఎన్నికల్లో విజయం సాధించిన టిఆర్‌ఎస్ పార్టీకి ఈ సందర్భంగా ఆయన శుభాకాంక్షలు తెలిపారు. ఉప ఎన్నికల్లో తమ పార్టీ ఓడినంతమాత్రాన బిజెపికి ఆదరణ తగ్గినట్లుగా భావించరాదన్నారు. కేంద్రంలో నరేంద్రమోదీ ప్రభుత్వం ప్రజాసంక్షేమమే ధ్యేయంగా పనిచేస్తోందని, కానీ ఓర్వలేక ప్రతిపక్షాలు దేశంలో అలజడులు సృష్టించేందుకు యత్నిస్తున్నాయని విమర్శించారు. బాలీవుడ్ నటుడు అమీర్‌ఖాన్ వ్యాఖ్యలు దురదృష్టకరమన్నారు. ప్రధాని నరేంద్రమోదీ అమీర్‌ఖాన్‌ను బ్రాండ్ అంబాసిడర్‌గా నియమించారని, అమీర్‌ఖాన్ నటించిన ఒక చిత్రంలో అభ్యంతకర సన్నివేశాలను తొలగించారన్న అక్కసుతో ఆయన వివాదాస్పద వ్యాఖ్యలు చేశారన్నారు. బిజెపి ఆధ్వర్యంలో గత నాలుగేళ్లుగా కరీంనగర్ జిల్లా ధర్మపురిలో గోదావరి హారతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహిస్తున్నామన్నారు. గోదావరినది జలాలను తెలు గు రాష్ట్రాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలన్నారు. గోదావరి హారతి కార్యక్రమాన్ని ధర్మపురిలో నిర్వహించామని తొలిసారి కార్యక్రమానికి కేంద్ర జల వనరుల మంత్రి ఉమాభారతి హాజరైనట్లు తెలిపారు. ఈ ఏడాది ఖమ్మం జిల్లా భద్రాచల పుణ్యక్షేత్రంలో ఈ కార్యక్రమాన్ని గణపతి సచ్చిదానందస్వామి చేతుల మీదుగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ విలేఖరుల సమావేశంలో బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు సంకినేని వెంకటేశ్వరరావు, నాయకులు రంగరాజు రుక్మారావు, ఉప్పల సంపత్‌కుమార్, కొండే టి ఏడుకొండలు, కొణతం సత్యనారాయణరెడ్డి, అయోధ్య, పాండురంగాచారి, జీడి భిక్షం, గజ్జెల వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.

దండకారణ్యం బంద్ హింసాత్మకం

31 వాహనాలను తగలబెట్టిన మావోయస్టులు
ఇన్‌ఫార్మర్ నెపంతో ఒకరి హత్య
దంతెవాడలో ఐదుగురు అరెస్టు

భద్రాచలం, నవంబర్ 25: ఆపరేషన్ గ్రీన్‌హంట్ నిలిపివేయాలని, మావోయిస్టుల వేట పేరుతోచేపట్టిన వైమానిక దాడులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం ఛత్తీస్‌గఢ్ దండకారణ్యంలో మావోయిస్టులు నిర్వహించిన బంద్ హింసాత్మకంగా సాగింది. దక్షిణ బస్తర్ ప్రాం తంలోని భానుప్రతాప్‌పూర్ మైన్స్‌లో సుమారు 31 వాహనాలకు, మిషన్లకు మావోయిస్టులు నిప్పు పెట్టారు. బొలేరో వాహనాల్లో భారీ సంఖ్యలో వచ్చిన సాయుధ మావోయిస్టులు వీటికి నిప్పు పెట్టి బ్యానర్లు, కరపత్రాలు వదిలివెళ్లారు. 13 హైవాలు, రెండు లోడర్లు, ఆరు ఎక్స్‌కేవేటర్లు, ఒక డోజర్, రెండు డీజీలు, రెండు డ్రిల్లింగ్ మిషన్లు, ఒక స్కార్పియో, రెండు బొలేరోలు, ఒక మెటాడోర్, ఒక అంబులెన్స్, ఒక కంటైనర్, రెండు పవర్‌స్క్రీన్లతో సహా 31 వాహనాలు, రెండు మిషన్లు దహనమైన వాటిలో ఉన్నాయి. దీనివల్ల కోట్లాది రూపాయల నష్టం వాటిల్లిందని మైన్స్ అధికారులు పేర్కొంటున్నారు. కాగా అర్ధరాత్రి సుకుమా జిల్లా దర్బా ఘాట్‌లో పోలీసులు, మావోయిస్టులకు మధ్య భీకరమైన పోరు జరిగింది. బంద్‌ను నిర్వీర్యం చేసేందుకు సుకుమా పోలీసులు కూంబింగ్ నిర్వహిస్తుండగా మావోలు తారసపడ్డారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య కాల్పులు జరిగాయి. ఈ నేపథ్యంలో ఆ రహదారిలో అర్థరాత్రి వేళ వాహనాలు భారీ సంఖ్యలో బారులుతీరి నిలిచిపోయాయి. సుమారు 200 మంది ప్రయాణికులు అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని తుపాకీ పేలుడు శబ్దాల మధ్య బిక్కుబిక్కుమంటూ గడిపారు. దంతెవాడ జిల్లా కొకనార్ పోలీసుస్టేషన్ పరిధిలో ఐదు కిలోల మందుపాతరను వెలికితీశారు. బీజాపూర్ జిల్లాలోని బాసగూడ పోలీసుస్టేషన్ పరిధిలో చోటేసకనపల్లి గ్రామం అటవీప్రాంతంలో పోలీసులను లక్ష్యంగా చేసుకుని మావోయిస్టులు మందుపాతర పేల్చారు. ఈ ఘటనలో గుల్షన్‌కుజూర్(కోబ్రా), భీమ్ (జిల్లా పోలీసు)లకు తీవ్ర గాయలయ్యాయి. ఇదే జిల్లాలోని భూపాలపట్నంకు ఐదు కిలోమీటర్ల దూరంలోని ఉల్లూరు అనే గ్రామంలో పాఠశాల భవన నిర్మాణానికి ఉపయోగించే మూడు మిక్చర్లను మావోయిస్టులు దగ్ధం చేశారు. దంతెవాడ జిల్లాలో డప్పాల్ - డిడం మధ్య రైల్వేలైన్లను మావోయిస్టులు తొలగించారు. గ్యాంగ్‌మెన్ నుంచి టూల్ కిట్లను ఎత్తుకెళ్లారు. ఎన్‌హెచ్-30పై ఎర్రబోరు- కుంట మధ్యలోని అసీల్‌గూడ అటవీప్రాంతంలో రోడ్లను తవ్వి చెట్లను అడ్డంగా నరికి పడేశారు. అక్కడ బ్యానర్లు, పోస్టర్లు వదిలివెళ్లారు. మరోవైపు పంకజ్‌పూర్ జిల్లాలోని మూరూమ్‌గావ్ పోలీసుస్టేషన్ పరిధిలో మహారాష్టక్రు చెందిన వినయ్‌మిస్ర్తి అనే యువకుడిని ఇన్‌ఫార్మర్ అనే నెపంతో మావోలు హత్య చేశారు. ఇతను గడ్చిరోలి జిల్లా దనోర్‌తహసిల్‌కు చెందిన వ్యక్తి. పోలీసులకు మావోయిస్టు దళాల సమాచారం అందజేస్తున్నాడని మంగళవారం సాయంత్రం ఇతన్ని ఎత్తుకెళ్లారు. దంతెవాడ జిల్లాలోని కటేకల్యాణ్ పోలీసులు ఐదుగురు మావోయిస్టులను అరెస్టు చేశారు. వీరు ఇటీవల బస్సు దహనం చేసిన ఘటనలో, పోలీసు బలగాలపై కాల్పులు జరిపిన సంఘటనలో నిందితులుగా దంతెవాడ ఎస్పీ కశ్యప్ వివరించారు. నారాయణ్‌పూర్, పంకజ్‌పూర్, భానుప్రతాప్‌పూర్, జగ్దల్‌పూరు, సుకుమా, కాంకేర్, బీజాపూర్, దంతెవాడ జిల్లాల్లో మావోయిస్టుల బంద్ ప్రభావం కనిపించింది. అక్కడక్కడ దుకాణాలు మూతపడ్డాయి.