తెలంగాణ

బాలారిష్టాల్లోనే ‘కొత్త’ పాలన

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కరీంనగర్, అక్టోబర్ 21: ప్రజల ముంగిటకే పాలన అంటూ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జిల్లాల పునర్విభజన జరిగి 11రోజులు గడిచినా.. కొత్త పాలన బాలారిష్టాలే ఎదుర్కొంటోంది. ఓ వైపు కొత్త కార్యాలయాల్లో కనీస వసతులు కరవు, మరోవైపు కార్యాలయాలకు చేరని దస్త్రాలు, ఫైళ్లు వెరసి పాలనపై ప్రభావం చూపుతూ ఇటు ప్రజలకు, అటు ఉద్యోగస్థులకు తంటాలు తప్పటం లేదు. కొత్త జిల్లాల్లో జిల్లా కలెక్టరేట్‌లు, ఎస్పీ కార్యాలయాలు చకచకా ఏర్పాటు చేసినప్పటికీ పాలనకు సంబంధించిన సరంజామా సమకూర్చడంలో ఆలస్యం జరుగుతోంది. ఫలితంగా అత్యవసర పనులపై కార్యాలయాలకు వస్తున్న ప్రజలకు సరైన సేవలందక ఇబ్బందులు పడుతుంటే, కనీస వసతుల్లేక ఉద్యోగులు ప్రజలకు సేవలందించటంలో ఇక్కట్లు పడుతున్నారు.
కార్యాలయాల్లో ఫర్నిచర్, కంప్యూటర్లు, ఇతర సామాగ్రి అందుబాటులో లేకపోవడం, పాత జిల్లాల నుంచి కొత్త జిల్లాలకు దస్త్రాలు, ఫైళ్లను తరలించకపోవడంతో విధుల నిర్వహణలో ఉద్యోగులకు ఆటంకాలు తప్పటం లేదు. కొత్త జిల్లాల ఏర్పాటుతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా నాలుగు జిల్లాలుగా విడిపోయిన సంగతి తెలిసిందే. కరీంనగర్, సిరిసిల్ల, పెద్దపల్లి, రాజన్న జిల్లాల్లో కొత్తగా కొలువుదీరిన కొత్త బాస్‌లు మాత్రం నిత్యం గ్రామాలు, పట్టణాల్లో ఆకస్మిక తనిఖీలు చేస్తూ అక్కడి పరిస్థితులను అవగాహన తెచ్చుకుంటూనే మరోవైపు అభివృద్ధి, సంక్షేమ పథకాల అమలు తీరుపై అధికారులతో సమీక్షా సమావేశాలు నిర్వహిస్తూ పాలనను గాడిలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. పూర్తిస్థాయిలో పాలన గాడిలో పడాలంటే ఐదారు మాసాలు పట్టవచ్చని అధికారులు పేర్కొంటుండటం గమనార్హం. ఇదిలా ఉంటే.. ఉద్యోగస్థుల బాధలు వర్ణనాతీతం. ఉండేది ఒకచోట.. విధులు నిర్వహించేది మరోచోట కావటంతో శారీరక శ్రమ పెరిగి, ఉద్యోగులు మానసికాందోళనకు గురవుతున్నారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో పనిచేసిన ఉద్యోగులు ఏర్పాటైన కొత్త జిల్లాలకు బదిలీ అయ్యారు. దీంతో కుటుంబం ఒకచోట.. కొలువు మరోచోట ఉండటంతో తీవ్ర ఇబ్బందులనెదుర్కొంటున్నారు. దీనికితోడు విద్యా సంవత్సరం మధ్యలో బదిలీలు జరగడంతో పిల్లల చదువులపై కూడా ఉద్యోగస్థుల్లో ఆందోళన నెలకొంది. జిల్లాల పునర్వీభజనతో కరీంనగర్‌లో స్థిరపడి కరీంనగర్ జిల్లాలో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగస్థులు కొత్తగా ఏర్పడిన సిరిసిల్ల, పెద్దపల్లి, జగిత్యాల జిల్లాలకు బదిలీ కాగా, పిల్లల చదువుల దృష్ట్యా కుటుంబాన్ని తరలించే పరిస్థితి లేక బదిలీ అయిన ఉద్యోగులు కొలువుచోటికి నిత్యం ప్రయాణాలు సాగిస్తున్నారు. మెజారిటీ ఉద్యోగులు ప్రయాణాలు సాగిస్తూ వ్యయ, ప్రయాసల పాలవుతున్నారు. పదోన్నతులు పొంది ఇతర జిల్లాలకు బదిలీ అయిన వారిలో సంతోషం నెలకొనగా, మిగతా ఉద్యోగుల్లో మాత్రం నిరాశ నెలకొంది. మార్చి, ఏప్రిల్ మాసంలో బదిలీ చేస్తే ఈ ఇబ్బందులు తమకు తప్పేవని, మధ్యలో బదిలీ చేయడం వల్ల నానా అవస్థలు పడుతున్నామని ఉద్యోగస్తులు వాపోతున్నారు. మొత్తానికి జిల్లాల పునర్విభజనతో అటు పాలన గాడిలో పడక ప్రజలు, ఇటు నిత్యం రాకపోకలు చేస్తూ ఉద్యోగస్తులు అవస్థలు పడుతున్నారు. ఏదిఏమైనా పరిపాలన గాడిన పడేవరకు ఈ ఇక్కట్లు, ఇబ్బందులు తప్పవు మరి..!