తెలంగాణ

బకాయిల భారంతో ట్రాన్స్‌కో విలవిల

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆదిలాబాద్, నవంబర్ 23: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పేరుకుపోతున్న విద్యుత్ బకాయిలు ట్రాన్స్‌కోకు గుదిబండగా మారాయి. వివిధ కేటగిరిల కింద విద్యుత్ చార్జీలను వసూలు చేసేందుకు ట్రాన్స్‌కో సిబ్బంది పల్లెలు, పట్టణాల్లో ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేసినా వినియోగదారుల నుండి స్పందన కరువైంది. రద్దయిన నోట్లను బిల్లుల రూపంలో చెల్లించేందుకు వినియోగదారులకు అవకాశం కల్పించినా ఫలితం కనిపించలేదు. పెద్దనోట్ల చలామణి తగ్గిపోవడంతో తమ బకాయిలు వసూలు అవుతాయని ఆశపడ్డ ట్రాన్స్‌కో అధికారులకు నిరాశే ఎదురైంది. ఈనెల 24 వరకు విద్యుత్ బకాయిల చెల్లింపునకు రద్దయిన నోట్లను అనుమతించగా, మీసేవ, ఈసేవ కేంద్రాల్లోను ప్రత్యేకంగా సిబ్బందిని వసూళ్లకోసం ఏర్పాటు చేశారు. అయితే తొలి వారం రోజుల్లోనే రోజుకు సగటున కోటి రూపాయల చొప్పున ఉమ్మడి జిల్లాల్లో వారం రోజుల్లోనే 7 కోట్లు వసూలయ్యాయి. కాగా, ఈ నెల 24 చివరి గడువు వరకు పాతనోట్ల మార్పిడితో సుమారు రూ.25 నుండి 30 కోట్ల వరకు బకాయిలు వసూళ్లు అవుతాయని ఆశించగా స్పందన కానరాకపోవడం ట్రాన్స్‌కో అధికారులకు తలనొప్పిగా మారింది. ఆదిలాబాద్, నిర్మల్, కొమ్రంభీం, మంచిర్యాల జిల్లాల్లో వివిధ కేటగిరీల కింద విద్యుత్ డిమాండ్ పెరిగిపోతున్నా బకాయిల భారం ట్రాన్స్‌కోకు మింగుడు పడని సమస్యగా మారింది. ఉత్తర తెలంగాణ డిస్కం కార్పొరేషన్ పరిధిలో విద్యుత్ బకాయిలు మొత్తం 240 కోట్లకు చేరినట్లు ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా ట్రాన్స్‌కో ఎస్‌ఈ జయవంత్‌రావు చౌహాన్ తెలిపారు. వ్యవసాయ విద్యుత్ సర్వీసు చార్జీలు తడిసిమోపెడవుతున్నా బకాయిలు చెల్లించకపోవడంతో అదనుచూసి విద్యుత్ సరఫరాను నిలిపివేయాల్సి వస్తుందన్నారు. ట్రాన్స్‌ఫార్మర్ల మరమ్మతులకు కూడా బిల్లు చార్జీలు వసూలు కావడం లేదని ఆయన పేర్కొన్నారు.
ఇదిలా ఉంటే ప్రభుత్వ సంస్థలు, గ్రామపంచాయతీలు, మున్సిపాలిటీల విద్యుత్ దీపాల బకాయిలు పెరిగిపోతుండగా, ఆ సంస్థలకు నోటీసులు జారీ చేశారు. కాగా భైంసా మున్సిపాలిటీ నుండి రూ.5 కోట్ల బకాయిలు వసూలు కావాల్సి ఉందని, ఇందుకోసం స్పెషల్ డ్రైవ్ పేరిట వసూలు చేస్తామని అన్నారు. ఇదిలా ఉంటే ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో 240 కోట్ల విద్యుత్ బకాయిలు పేరుకుపోగా వీటిలో విద్యుత్‌దీపాలు, ప్రభుత్వ కార్యాలయాల నుండి రావాల్సిన బకాయిలు 110 కోట్లు ఉండడం తమకు పెద్ద సమస్యగా మారిందని, గృహ వినియోగదారుల నుండి 130 కోట్లు విద్యుత్ బకాయిలు వసూలు కావాల్సి ఉందని ‘ఆంధ్రభూమి’కి వివరించారు. పెద్ద నోట్ల రద్దు ప్రభావంగా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు ఈనెల 24 వరకు గడువు విధించగా కేవలం రూ.8 కోట్ల బకాయిలు మాత్రమే వసూలైనట్లు అధికారులు పేర్కొంటున్నారు. ఆదిలాబాద్ ఉమ్మడి నాలుగు జిల్లాల్లో మొత్తం 7 లక్షల 52 వేల విద్యుత్ కనెక్షన్లు ఉండగా వీటిలో లక్షా 8 వేలు వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు ఉన్నట్లు తెలిపారు. ఏదేమైనా ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలో విద్యుత్ కోతలు లేకుండా నాణ్యమైన సరఫరాకు చర్యలు తీసుకుంటున్నప్పటికీ గుదిబండగా మారిన విద్యుత్ బకాయిలు మాత్రం వసూలు కాకపోవడం ట్రాన్స్‌కో అధికారులకు పెద్ద సమస్యగా మారింది. పెద్ద ఎత్తున పేరుకుపోయిన బకాయిల కోసం క్షేత్రస్థాయి ట్రాన్స్‌కో అధికారులకు లక్ష్యాలను నిర్దేశించి, స్పెషల్ డ్రైవ్‌పేరిట వసూళ్లకు శ్రీకారం చుట్టాలని, ఇందుకు వినియోగదారులు స్పందించకపోతే విద్యుత్ కనెక్షన్లను తొలగించేందుకు ట్రాన్స్‌కో అధికారులు రంగం సిద్ధం చేశారు.