తెలంగాణ

నగదురహిత తెలంగాణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ప్రయోగాత్మకంగా సిద్దిపేట సెగ్మెంట్ ఎంపిక సంపూర్ణ ఆర్థిక క్రాంతికి స్వాగతం
ప్రధాని మోదీది సాహసోపేత నిర్ణయమే తెలంగాణ ఆదాయానికి గండి పడింది
కేంద్రం ఆదుకుంటుందన్న నమ్మకం ఉంది ప్రధాని అసలు వ్యూహం తెలిస్తే అంతే..
నన్ను విమర్శించేవారి గుండెలు గుభేల్ చెల్లింపులకు కొత్తగా టిఎస్ వ్యాలెట్ యాప్
ఇక రెండే పన్నులు.. జిఎస్‌టి, బిటిటి కేబినెట్ భేటీ వివరాలు వెల్లడించిన కెసిఆర్

హైదరాబాద్, నవంబర్ 28: పెద్ద నోట్ల రద్దు తరువాత తలెత్తిన పరిణామాలపై శనివారం మంత్రివర్గం ప్రత్యేకంగా సమావేశమైంది. విపత్కర పరిస్థితిని ఎదుర్కోవడానికి మంత్రివర్గ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. నగదురహిత తెలంగాణకు శ్రీకారం చుట్టేందుకు పలు చర్యలు ఆరంభించారు. నాలుగు గంటలపాటు సాగిన మంత్రివర్గ సమావేశం వివరాలను ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు మీడియాకు వివరించారు. నల్లధనం నిర్మూలనకు ప్రధాని మోడీ సాహసోపేత నిర్ణయం తీసుకున్నారని, దాని అమల్లో కొన్ని సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. నల్లధనం కేవలం కరెన్సీరూపంలో మాత్రమే లేదని, నగదు, భూములు, బంగారం, వజ్రాల రూపంలోనూ ఉందని అభిప్రాయపడ్డారు. నల్లధనం ఏ రూపంలోవున్నా నిర్మూలించాలని ప్రధానికి సూచించామన్నారు. నల్లధనం లేని అవినీతి రహిత భారత ఆవిర్భవిస్తే అభినందనీయమేనన్నారు. ఇంత కాలానికి ప్రభుత్వం విప్లవాత్మక నిర్ణయం తీసుకుంది. దీనికి సానుకూలంగా స్పందించాలని పిలుపునిచ్చారు. నగదురహిత కార్యకలాపాల కోసం ప్రభుత్వం తరఫున టిఎస్ వ్యాలెట్‌కు రూపకల్పన చేస్తున్నట్టు సిఎం చెప్పారు. రెండు మూడు రోజుల్లో ఇది పూర్తవుతుందని, ప్రభుత్వ, ప్రైవేటు రంగంలో నగదురహిత ఆర్థిక కార్యకలాపాలకు వ్యాలెట్‌ను ఉపయోగించుకోవచ్చని చెప్పారు. నోట్ల రద్దు వెనుక ఏదో కుంభకోణం ఉందని ఆలోచించడం సరికాదని, ప్రధాని పదవిలో ఉన్నవారికి దేశాన్ని గోల్‌మాల్ చేయాల్సిన అవసరం లేదన్నారు. నల్లధనం ఏ రూపంలోవున్నా పూర్తిగా నిర్మూలిస్తేనే సంపూర్ణ ఆర్థిక కాంత్రికి అర్థం ఉంటుందని ప్రధానికి సూచించినట్టు కెసిఆర్ తెలిపారు.
ఇంతకాలం తెలంగాణ ప్రభుత్వం నల్లధనంతో నడిచిందా? అని బిజెపి అధ్యక్షుడు అర్ధం లేకుండా విమర్శిస్తున్నారని, తెలంగాణ ప్రభుత్వమే కాదు దేశంలోని అన్ని ప్రభుత్వాలూ, మోదీ ప్రభుత్వం సైతం నల్లధనంతోనే నడిచిందని కెసిఆర్ ఘాటుగా స్పందించారు.
దేశంలోని అన్ని రాష్ట్రాలతోపాటు తెలంగాణ ఆదాయం కూడా నోట్ల రద్దుతో తగ్గిపోతుందన్నారు. ఆదాయం కోత ఎంత అనేది డిసెంబర్‌లో తెలుస్తుందని సిఎం చెప్పారు. రాష్ట్రాల ఆదాయం తగ్గినందున కేంద్రం కొంత భరించాలని కోరామని, ప్రధాని మోదీ సానుకూలంగా స్పందించారని కెసిఆర్ చెప్పారు.
తెలంగాణను నగదురహిత ఆర్థిక కార్యకలాపాలకు సన్నద్ధం చేస్తున్నామని, దీనికోసం ఐదుగురు ఐఏఎస్‌లతో కమిటీ వేశామన్నారు. అదేవిధంగా ముగ్గురు అధికారులు ప్రతి రోజూ కేంద్రంతో సంప్రదింపులు జరుపుతుంటారని చెప్పారు. తొలుత సిద్దిపేట నియోజక వర్గంలో ప్రయోగాత్మకంగా నగదురహిత నియోజక వర్గంగా తీర్చిదిద్దనున్నట్టు చెప్పారు. ఐదు వందల రూపాయల వరకు మాత్రమే నగదు వ్యవహారాలు జరిపి, అంతకన్నా ఎక్కువంతా నగదు రహితంగానే సాగేచర్యలు తీసుకుంటామని చెప్పారు.
ప్రధాని నల్లధన నిర్మూలనకు వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారని, అన్ని వ్యూహాలను ముందుగానే చెప్పారన్నారు. తనకు తెలిసినంత వరకు ఇకపై ఎలాంటి పన్నులు ఉండవని, రెండు రకాల పన్నులు మాత్రమే ఉంటాయని చెప్పారు. అన్ని పన్నులు రద్దు చేసి జిఎస్‌టి, బిటిటిని అమలు చేస్తారని చెప్పారు. బ్యాంకుల్లో వ్యవహారాలకు బ్యాంక్ ట్రాన్‌జాక్షన్ టాక్స్ వసూలు చేస్తారని, ఇది నామమాత్రంగా ఉంటుందన్నారు. ఇప్పుడు దేశంలో కేవలం ఒకశాతం మంది మాత్రమే పన్ను చెల్లిస్తున్నారని, అదీ ఉద్యోగులేనన్నారు. దీనికి బదులు బ్యాంకుల్లో నగదురహిత వ్యవహారాలతో నామమాత్రంగా పాయింట్ 25 శాతం పన్ను విధించినా, ఇప్పుడొస్తున్న పన్ను ఆదాయంకన్నా ఐదారు రెట్లు ఎక్కువ పన్ను వసూలవుతుందని కెసిఆర్ చెప్పారు. ఇదేవిధంగా రాష్ట్రానికి కేంద్రం నుంచి ఇప్పుడొస్తున్న దానికంటే ఐదారు రెట్లు ఎక్కువ పన్ను వాటా లభిస్తుందని వివరించారు.
రాజకీయాల్లో నల్లధన ప్రభావాన్ని నిర్మూలించేందుకు చర్యలు తీసుకోవాలని ప్రధానికి సూచించినట్టు కెసిఆర్ తెలిపారు. రాజకీయ పార్టీల ఎన్నికల ప్రచార వ్యయాన్ని కేంద్రమే భరించాలని సూచించారు. రాజకీయ పార్టీల విరాళాలను బహిరంగపర్చాలని, రాజకీయాల్లో సైతం ప్రక్షాళన అవసరమని సూచించినట్టు చెప్పారు. సంపూర్ణ క్రాంతి అవసరమని, ఒకటి రెండు చర్యలు సరిపోవని ప్రధానికి చెబితే, సంపూర్ణ క్రాంతి కోసం ప్రయత్నిస్తున్నట్టు వివరించారని కెసిఆర్ తెలిపారు. నోట్ల రద్దు వ్యవహారాన్ని గుడ్డిగా వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. గుడ్డిగా సమర్ధించాల్సిన అవసరం లేదన్నారు. నోట్ల రద్దు పరిణామాలపై ఐదుగురు సిఎంలతో వేసిన కమిటీకి చంద్రబాబు నాయకత్వం వహించడంపై విలేఖరులు ప్రశ్నించగా, స్వాగతిస్తున్నానని కెసిఆర్ తెలిపారు. అన్నిరంగాల్లో సంపూర్ణంగా నల్లధనాన్ని, వందశాతం అవినీతిని నిర్మూలిస్తేనే ఇది విజయవంతమైన ప్రయోగం అవుతుందని, లేకపోతే విఫల ప్రయోగం అవుతుందన్నారు. విఫలమైతే ప్రజలు తీర్పు చెబుతారని అన్నారు. సంపూర్ణంగా అమలు చేస్తే కేంద్రానికి తెలంగాణ అండగా నిలుస్తుందన్నారు. ఢిల్లీకివెళ్లి ప్రధానిని కలిసి నోట్ల రద్దు పరిణామాలపై, చర్యలపై నివేదిక ఇచ్చానని, హైదరాబాద్ వచ్చినప్పుడు, తిరిగి వెళ్లేప్పుడు విమానాశ్రయంలో ఈ అంశంపై మాట్లాడినట్టు చెప్పారు. అధికారుల ద్వారా నివేదికలు పంపిస్తున్నట్టు చెప్పారు.
రియల్ ఎస్టేట్ రంగానికి భారీ నష్టం కలుగుతందని, కూలీలకు ఉపాధి లభించకుండా పోయే ప్రమాదం ఉందని దీని కోసం హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకాన్ని విస్తృతంగా చేపడుతున్నట్టు చెప్పారు. ఐదువేల కోట్ల నిధులున్నాయని, వాటితో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల పథకం చేపడుతున్నట్టు చెప్పారు. 150 ప్రాంతాల్లో ఐదు రూపాయల భోజన పథకం అమలు చేయనున్నట్టు చెప్పారు. గుజరాత్‌లోని ఒక గ్రామంలో వందశాతం నగదురహిత కార్యకలాపాలు నిర్వహిస్తున్నారని కెసిఆర్ చెప్పారు. అన్ని ప్రభుత్వ విభాగాల్లో నగదు రహిత కార్యకలాపాల కోసం ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు కొంత నగదు చెల్లించాలని యూనియన్ నాయకులు అడిగారని, దీనిపై ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని సిఎం చెప్పారు.
నోట్లు రద్దు చేసి 20 రోజులు అవుతుంది. పాత నిర్ణయాన్ని తిరగ తోడటం వల్ల ప్రయోజనం లేదు. సమస్య నుంచి ఏవిధంగా ముందుకెళ్లాలి అనే ఆలోచించాలన్నారు. భయపడాల్సిన అవసరం లేదని, కొంతకాలం ఆదాయం తగ్గినా, భవిష్యత్‌లో ఆదాయం భారీగా పెరుగుతుందని సిఎం చెప్పారు. చిన్న నోట్లు మరింతగా తెలంగాణకు పంపించాలని కేంద్రాన్ని కోరామన్నారు. అందరికీ బ్యాంకు ఖాతాలు ఉండేలా చూడాలని, ఆధార్ కార్డును అనుసంధానం చేయాలన్నారు.
తొలుత విద్యావంతులు నగదురహిత కార్యకలాపాలకు అలవాటు పడితే, ఆ తరువాత ఇతరులు అలవాటు పడతారని సిఎం అభిప్రాయపడ్డారు. నల్లధనం నిర్మూలన, నోట్ల రద్దుపై ప్రధానికి వ్యూహం ఉందని చెప్పారు. నల్లడబ్బు మార్చుకోవడానికే తాను ప్రధానిని కలిసినట్టు కాంగ్రెస్ నేతలు చేస్తున్న విమర్శలు అర్ధంలేనివన్నారు. ప్రధాని వ్యూహం తెలిస్తే కాంగ్రెస్ నేతలు గుండెలు గుభేల్‌మంటాయని కెసిఆర్ అన్నారు. దేశాన్ని ఎక్కువ కాలం పాలించిన కాంగ్రెస్ నేతలే నల్లధనానికి కారకులని సిఎం కెసిఆర్ విమర్శించారు.