తెలంగాణ

సిఎస్ నుంచి సిఎకి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 30: ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేసిన రాజీవ్ శర్మను ప్రభుత్వ ప్రధాన సలహాదారుగా నియమిస్తున్నట్టు సిఎం కెసిఆర్ ప్రకటించారు. సచివాలయంలో జరిగిన రాజీవ్ శర్మ వీడ్కోలు సమావేశ వేదికపైనే సిఎం ఈ విషయాన్ని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర తొలి సిఎస్‌గా శర్మ సేవలకు గుర్తింపు, ప్రభుత్వానికి మున్ముందూ ఆయన సేవలు వినియోగించుకునే ఉద్దేశంతో ప్రభుత్వ సలహాదారుగా నియమిస్తున్నట్టు వివరించారు. ఆఫీషియల్ బ్యూరోక్రాట్‌గా ఇంతకాలం సేవలు అందించిన రాజీవ్ శర్మ, ఇకనుంచి పొలిటికల్ బ్యూరోక్రాట్‌గా కేబినెట్ ర్యాంకు హోదాలో సేవలు అందిస్తారన్నారు.
కొత్త సిఎస్ బాధ్యతలు స్వీకరణ
రాజీవ్ శర్మ పదవీ విరమణ చేయడంతో ఆయన స్థానంలో కొత్త ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ప్రదీప్ చంద్ర బుధవారం సాయంత్రం పదవీ బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు జరిగిన రాజీవ్ శర్మ వీడ్కోలు సమావేశంలో ప్రదీప్‌చంద్రను సమర్ధుడైన అధికారిగా సిఎం కెసిఆర్ కొనియాడారు. తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన నూతన పారిశ్రామిక విధానానికి ప్రపంచవ్యాప్తంగా ప్రశంసలు లభించడానికి ప్రదీప్‌చంద్ర కృషే కారణమన్నారు. ఇలాఉండగా ప్రదీప్ చంద్రను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా నియమిస్తూ సాధారణ పరిపాలనా శాఖ ముఖ్య కార్యదర్శి అదర్‌సిన్హా బుధవారం సాయంత్రం ఉత్తర్వులు జారీ చేశారు. రాజీవ్ శర్మ వీడ్కోలు సమావేశం ముగిసిన తర్వాత ప్రదీప్‌చంద్ర ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించారు.
అంతకుముందు సచివాలయంలో నిర్వహించిన రాజీవ్ శర్మ వీడ్కోలు కార్యక్రమంలో సిఎం కెసిఆర్ మాట్లాడుతూ ‘పదవీ విరమణ చేసిన రాజీవ్ శర్మ కేవలం సక్సెస్ ఫుల్ బాట్స్‌మెన్ మాత్రమే కాదు. ఆయన ఆల్ రౌండ్ ప్లేయర్. రాష్ట్ర విభజన చట్టంలోని ప్రతి అంశంపై పూర్తి అవగాహన వ్యక్తి’ అని కొనియాడారు. తెలంగాణ ఆవిర్భవించిందన్న దుగ్ధతో ఆంధ్ర ప్రభుత్వం అధికారుల విభజనలో, విద్యుత్ సరఫరాలో ఎన్నో ఇబ్బందులు, చిక్కులు సృష్టించిన్నప్పటికీ ఎప్పటికప్పుడు కేంద్రాన్ని సంప్రదిస్తూ, సమస్యలను అధిగమించడానికి ఎనలేని కృషి చేశారని శర్మపై ప్రశంసలు కురిపించారు. రాష్ట్రం ఆవిర్భవించిన రెండున్నరేళ్లలోనే 10 నుంచి 12 అవార్డులు దక్కడానికి శర్మ కృషే కారణమన్నారు. కొత్త రాష్ట్రానికి క్లిష్టమైన సమస్యలు ఉత్పన్నమైనప్పుడు యుక్తితో, ఓపికతో పరిష్కారానికి కృషి చేశారన్నారు. ముఖ్యంగా కొత్త జిల్లాల ఏర్పాటు, సమగ్ర కుటుంబ సర్వే నిర్వహణలో ఆయన కీలక భూమిక పోషించారన్నారు. రాష్ట్ర విభజన కోసం ఏర్పాటైన శ్రీకృష్ణ కమిటీకి సమన్వయకర్తగా పనిచేసిన అనుభవం సిఎస్‌గా సక్సెస్ కావడానికి దోహదపడిందన్నారు. కొత్త రాష్ట్రంగా తెలంగాణ నిలదొక్కుకోవడానికి ఉగ్గుపాలు పోసి బుడిబుడి అడుగుల నుంచి బలమైన పునాధి పడడానికి రాజీవ్ శర్మ చేసిన కృషి ఎప్పటికీ మరువలేమని ప్రశంసించారు.
ఇది అరుదైన గౌరవం: రాజీవ్ శర్మ
సివిల్ సర్వీసెస్ సర్వెంట్‌గా తెలంగాణలో తొలి నియామకమై ఇక్కడే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పదవీ విరమణ చేయడం మరిచిపోలేని అంశమని రాజీవ్ శర్మ అన్నారు. తన వీడ్కోలు సభను మునుపెన్నడూ లేనివిధంగా ఘనంగా నిర్వహించడం అధికారులకు తెలంగాణ ప్రభుత్వం, ముఖ్యమంత్రి కెసిఆర్ ఇచ్చే గౌరవానికి నిదర్శనమన్నారు. కెసిఆర్‌లాంటి దార్శనిక సిఎం వద్ద పని చేయడం అదృష్టంగా భావిస్తున్నానని రాజీవ్ శర్మ కృతజ్ఞతలు తెలిపారు. రాజీవ్ శర్మ సేవలను ఉప ముఖ్యమంత్రులు కడియం శ్రీహరి, మహమూద్ అలీ, నూతన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్ చంద్ర తమ ప్రసంగాల్లో కొనియాడారు.

చిత్రం... సిఎస్‌గా రాజీవ్ శర్మకు వీడ్కోలు పలుకుతూ చీఫ్ అడ్వైజర్‌గా నియామకాన్ని ప్రకటిస్తున్న సిఎం కెసిఆర్. చిత్రంలో కొత్త సిఎస్ ప్రదీప్‌చంద్ర, ఉప ముఖ్యమంత్రులు కడియం, మహమూద్ అలీ