తెలంగాణ

నిధులిచ్చినా ‘మాఫీ’ చేయరా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, డిసెంబర్ 2: పంట రుణాల మాఫీ వాయిదాను బ్యాంకులకు విడుదల చేసినా రైతుల ఖాతాల్లో ఎందుకు జమ చేయలేదని బ్యాంకర్లపై రవాణాశాఖ మంత్రి పి మహేందర్‌రెడ్డి మండిపడ్డారు. మహిళలు, రైతులకు 7 శాతం వడ్డీతో రుణాలు ఇవ్వాలని నిబంధనలున్నా 11 శాతం ఎలా వసూలు చేశారని బ్యాంకర్లను మంత్రి నిలదీశారు. ప్రభుత్వ ఆదేశాలను, నిబంధనలను అమలు చేయని బ్యాంకర్లకు తాఖీదులు జారీ చేయాల్సిందిగా కలెక్టర్లను మంత్రి ఆదేశించారు. సచివాలయంలో శుక్రవారం రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లతో రబీ సీజన్‌కు పంట రుణాలు, పంట రుణ మాఫీ, పొదుపు సంఘాలకు రుణాలపై మంత్రి చర్చించారు. పంట రుణ మాఫీ నాలుగవ వాయిదాను ప్రభుత్వం విడుదల చేసినా కొన్ని బ్యాంకులు రైతుల ఖాతాల్లో జమ చేయకుండా వారి నుంచి వసూలు చేయడమేమిటని మంత్రి ప్రశ్నించారు. వ్యవసాయ రుణాలు, పొదుపు సంఘాలకు 7 శాతం వడ్డీని వసూలు చేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ బ్యాంకర్లు 11 శాతం వడ్డీ వసూలు చేసినట్టు మేడ్చెల్ కలెక్టర్ ఎంవి రెడ్డి మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. నిబంధనలకు విరుద్దంగా వడ్డీ వసూలు చేసిన స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, ఆంధ్రా బ్యాంక్, దేనా బ్యాంక్, యాక్సెస్ బ్యాంక్, కెనరా బ్యాంక్, విజయ బ్యాంక్, కార్పొరేషన్ బ్యాంక్‌ల అధికారులకు నోటీసులు జారీ చేసి, అధికంగా వసూలు చేసిన మొత్తాన్ని తిరిగి వారి ఖాతాల్లో జమ చేయాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ శాస్ర్తిని ఆదేశించారు. ఒకవైపు అతివృష్టి, అనావృష్టి పరిస్థితులతో రైతులు, మహిళలు ఇబ్బందులు పడుతుంటే బ్యాంకర్లు అధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా ప్రభుత్వం విడుదల చేసిన రుణ మాఫీ వాయిదాను కూడా ఖాతాలలో జమ చేయకపోవడం ఏమిటనీ మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రంగారెడ్డి, వికారాబాద్, మేడ్చెల్ మూడు జిల్లాల్లో కలిపి 988 బ్యాంక్ శాఖలు ఉండగా రబీ సాగుకు కేవలం 16 శాతం రుణాలు ఇవ్వడం ఏమిటనీ మంత్రి మండిపడ్డారు. ‘ఇదేం పద్ధతి చర్యలు తీసుకుంటేనే సరిగ్గా పని చేస్తారా? బ్యాంకర్లు ఇష్టానసారంగా వ్యవహరిస్తుంటే చర్యలు ఎందుకు తీసుకోవడం లేదు’ అని కలెక్టర్లపై మంత్రి అసంతృప్తి వ్యక్తం చేశారు. పెద్దనోట్ల రద్దుతో గ్రామీణ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, ప్రజల ఇబ్బందులు తొలగించడానికి చర్యలు తీసుకోవాలని బ్యాంకర్లను ఆదేశించారు. ఉపాధి హామీ కూలీలకు చెల్లింపులలో ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకోవాలని కలెక్టర్లను ఆదేశించారు. ఉద్యోగులకు నగదు రూపేణ చెల్లించే రూ.10 వేల చెల్లింపు సక్రమంగా జరిగేలాగా చర్యలు తీసుకోవాలని లీడ్ బ్యాంక్ మేనేజర్ శాస్ర్తిని మంత్రి ఆదేశించారు. ఈ సమావేశంలో రంగారెడ్డి కలెక్టర్ రఘునందన్‌రావు, మేడ్చెల్ కలెక్టర్ ఎంవి రెడ్డి, వికారాబాద్ కలెక్టర్ దివ్యతో పాటు వివిధ బ్యాంకుల ప్రతినిధులు పాల్గొన్నారు.

చిత్రం..సచివాలయంలో శుక్రవారం రంగారెడ్డి, మేడ్చల్, వికారాబాద్ జిల్లాల కలెక్టర్లు, బ్యాంకర్లతో
సమీక్షా సమావేశం నిర్వహిస్తున్న మంత్రి మహేందర్‌రెడ్డి