తెలంగాణ

నాగార్జున సాగర్ ఆయకట్టుకు నీటి విడుదలలో జాప్యం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, డిసెంబర్ 3: నాగార్జున సాగర్ ఎడమకాలువకు డిసెంబర్ 1నుండి నీటి విడుదల చేస్తామంటు తెలంగాణ ప్రభుత్వం ముందుగా నిర్ణయించుకున్న షెడ్యూల్ మేరకు కృష్ణా నది యాజమాన్య బోర్డు నుండి అనుమతి లభించకపోవడంతో నీటి విడుదలపై ప్రతిష్టంభన నెలకొంది. సాగర్ ఎడమకాలువకు ఈ నెల 1నుండి ఏడు దఫాలుగా నీటి విడుదల చేస్తామంటు ఎన్‌ఎస్పీ అధికారులు ప్రకటించడంతో ఈ మేరకు రైతులు ఆరుతడి పంటలకు సాగుకు కొందరు, వరి నారుమడుల కోసం మరికొందరు రైతులు పనులు చేపట్టారు. వ్యవసాయశాఖ సైతం రైతులకు విత్తన పంపిణీ చేపట్టింది. తీరా గత బుధవారం జరిగిన బోర్డు సమావేశంలో ఇరురాష్ట్రాల మధ్య నీటి కేటాయింపుల పంచాయతీ తేలకపోవడం, శుక్రవారం మరోసారి జరిగిన బోర్డు సమావేశానికి ఏపి ఇరిగేషన్ అధికారులు డుమ్మా కొట్టడంతో మళ్లీ వాయిదా పడింది. బోర్డు తిరిగి సమావేశమైతేగాని శ్రీశైలం, సాగర్‌ల నుండి నీటి విడుదలపై స్పష్టత వచ్చే పరిస్థితి లేకుండా పోయింది. దీంతో సాగర్ ఎడమకాలువ కింద నల్లగొండ జిల్లా పరిధిలోని 3.81 లక్షల ఎకరాల రైతులు ఆందోళన చెందుతున్నారు. యాసంగి నీటి విడుదల షెడ్యూల్ వెనక్కి వెళ్లిపోతుండటంతో వేసవిలో నీటి లభ్యత ఎంతమేరకు సాధ్యమవుతుందన్నదానిపై రైతుల్లో సందేహాలు రేగుతున్నాయి. అయితే తెలంగాణ ప్రభుత్వం మాత్రం తాము సాగర్ ఎడమకాలువ రైతులకు ఇప్పటికే యాసంగి పంటలకు నీటి విడుదలపై ప్రకటన చేసి ఉన్నందునా ప్రస్తుతానికైతే రెండు రాష్ట్రాలకు కేటాయింపుల కోసం అందుబాటులో ఉన్న 130టిఎంసిల నుండి 63టిఎంసిలను మాత్రం తక్షణ విడుదలకు అనుమతించాలని బోర్డును డిమాండ్ చేస్తుంది. తాము కోరుతున్న మిగతా 40టిఎంసిల కేటాయింపుపై రెండు రాష్ట్రాల మధ్య బోర్డు సమావేశంలో తేల్చుకుందామంటు తెలంగాణ ప్రతిపాదిస్తోంది.
నీటి పంచాయతీ తెగేనా?
కృష్ణా జలాలు ప్రస్తుతం శ్రీశైలం, నాగార్జున సాగర్‌లలో కలిపి 130 టిఎంసిలు మాత్రమే అందుబాటులో ఉండగా రెండు తెలుగు రాష్ట్రాలు మాత్రం బోర్డు ముందు 230 టిఎంసిలు కావాలంటు పట్టుబట్టాయి. తెలంగాణ ప్రభుత్వం యాసంగి పంటల సాగుకు 100 టిఎంసిలు, జంటనగరాల తాగునీటి అవసరాలకు 3టిఎంసిలు కోరింది. ఏపి ప్రభుత్వం 110 టిఎంసిలు కోరింది. దీంతో రెండు రాష్ట్రాలకు నీటి కేటాయింపులకు పీటముడి వంటి పంచాయతీ నెలకొంది. ఇప్పటికే బచావత్ ట్రిబ్యునల్ మేరకు ఉమ్మడి రాష్ట్రంలో కృష్ణానది పరివాహకంలో తెలంగాణకు చిన్ననీటి వనరుల కింద 89.15 టిఎంసిలు కేటాయింపు ఉందని ఈ దఫా వర్షాలు సమృద్ధిగా పడి మొత్తం నీటిని తెలంగాణ వాడుకున్నట్లుగా ఏపి వాదిస్తోంది. అయితే తాము 29టిఎంసిలు మాత్రమే వాడుకున్నామని, ఏపినే అక్రమంగా పొతిరెడ్డిపాడు నుండి శ్రీశైలం ద్వారా 61 టిఎంసిలు తరలించుకుపోయిందని, పట్టిసీమ ద్వారా కృష్ణా బెసిన్‌కు 52టిఎంసిలు గోదావరి జలాలు తరలించుకుందని దీనిపై వాట తేల్చాల్సివుందని తెలంగాణ వాదిస్తుంది. దీంతో బోర్డు ముందు రెండు తెలుగురాష్ట్రాల మధ్య నెలకొన్న నీటి కేటాయింపుల పంచాయతీ తేలితేనే నీటి విడుదలకు మార్గం సుగమంకానుంది.

చిత్రం..సాగర్ ఎడమ కాలువ