తెలంగాణ

అసెంబ్లీలో రగడ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 4: అసెంబ్లీ వాయిదా తర్వాత అనూహ్యంగా కాంగ్రెస్, తెలుగు దేశం ఎమ్మెల్యేలు సభలో నిరసన ధర్నాకు దిగారు. సుమారు ఐదు గంటల తర్వాత స్పీకర్ ఆదేశంతో మార్షల్స్ (పోలీసులు) వారిని బలవంతంగా పార్టీ ఆఫీసులకు తరలించారు. బుధవారం అసెంబ్లీలో ఫీజు రీయింబర్స్‌మెంట్ అంశంపై జరిగిన చర్చకు సిఎం కె చంద్రశేఖర్ రావు సుదీర్ఘ సమాధానమిచ్చారు. తర్వాత సిఎం సమాధానంపై వివరణ అడిగేందుకు ప్రతిపక్షాలు సిద్ధమవుతుండగానే, స్పీకర్ స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ పద్మా దేవేందర్ రెడ్డి సభను గురువారానికి వాయిదా వేశారు. దీంతో విపక్షాల సభ్యులు అవాక్కయ్యారు. సిఎం కెసిఆర్ సమాధానం తర్వాత తమకు వివరణ అడిగేందుకు అవకాశం ఇవ్వలేదని విపక్షాల సభ్యులు విమర్శలకు దిగారు. ఇలాఉండగా సభ వాయిదా తర్వాత కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) నాయకుడు కె జానారెడ్డి, ఎమ్మెల్యేలు ఎన్ ఉత్తమ్‌కుమార్ రెడ్డి, డికె అరుణ, వంశీచంద్‌రెడ్డి, టి రాంమోహన్‌రెడ్డి, టి జీవన్‌రెడ్డి, టిడిపి పక్షం నాయకుడు ఎ రేవంత్ రెడ్డి, ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య స్పీకర్ పోడియం వద్ద బైఠాయించి నిరసన తెలిపారు. ఛాంబర్‌లో ఉన్న స్పీకర్ ఎస్ మధుసూదనాచారి వారిని తనవద్దకు పిలిపించుకునే ప్రయత్నం చేశారు. అసెంబ్లీ కార్యదర్శి డాక్టర్ ఎస్ రాజా సదారామ్ రెండు పర్యాయాలు వారి వద్దకెళ్లి స్పీకర్ రమ్మంటున్న విషయాన్ని చెప్పారు. అయినా సభ్యులు ససేమిరా అనడంతో, స్పీకర్ మధుసూదనాచారి నివాసానికి వెళ్ళారు. మధ్యాహ్నం 2.25 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకూ కాంగ్రెస్, తెదేపా ఎమ్మెల్యేలు సభలోనే ఉండిపోయారు. ఒక దశలో జానారెడ్డికి బిపి తగ్గడంతో, మిగతా ఎమ్మెల్యేలు ఆందోళన చెందారు. కాగా అసెంబ్లీలో ఉండే డాక్టర్లు వచ్చి పరీక్షించి ఇబ్బంది లేదని చెప్పారు.
విద్యార్థి విభాగాల ధర్నాలు
సభలో కాంగ్రెస్, తెదేపా ఎమ్మెల్యేలు నిరసనగా బైఠాయించడం, పోలీసుల హడావుడి, లోపల ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఆవరణ నుంచి సభలోకి వెళ్ళేందుకు ఉన్న ప్రధాన గేట్లను పోలీసులు మూసివేయడంతో ఉత్కంఠ తలెత్తింది. ఎమ్మెల్యేలకు మద్దతుగా కాంగ్రెస్ అనుబంధ విభాగాలైన ఎన్‌ఎస్‌యుఐ, యువజన కాంగ్రెస్ నాయకులు అసెంబ్లీ వెలుపల ప్రధాన గేట్ల వద్ద ధర్నా నిర్వహించారు. దీంతో పోలీసులు వారిని అరెస్టు చేశారు.
బలవంతంగా ఎమ్మెల్యేల తరలింపు
సాయంత్రం 6.30కు స్పీకర్ మధుసూదనాచారి ఆదేశంతో మార్షల్స్ (పోలీసులు) వ్యూహాత్మకంగా సభ్యులను బలవంతంగా బయటకు తరలించారు. ఎమ్మెల్యేలను తరలించేందుకు పోలీసులు సిద్ధంకావడంతో, మీడియా మొత్తం ప్రధాన గేట్ల వద్దకు చేరుకుంది. సభలో బైఠాయించిన కాంగ్రెస్, తెదేపా ఎమ్మెల్యేలను బలవంతంగా ఎత్తుకుని వచ్చి కాంగ్రెస్ ఎమ్మెల్యేలను ఒక వాహనంలో, తెదేపా ఎమ్మెల్యేలను మరో వాహనంలో ఎక్కించారు. మీడియా కంట పడకుండా అసెంబ్లీకి వెనుక భాగంలోని పబ్లిక్ గార్డెన్, ఇందిరా ప్రియదర్శిని ఆడిటోరియం పక్కనుంచి నాంపల్లి బస్టాప్ గేటు ద్వారా బయటకు తీసుకెళ్లిపోయారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను గాంధీ భవన్‌లో, తెదేపా ఎమ్మెల్యేలను బంజారాహిల్స్‌లోని పార్టీ కార్యాలయం (ఎన్టీఆర్ భవన్) వద్ద వదిలి వెళ్ళారు.
ప్రభుత్వంపై సభా హక్కుల
ఉల్లంఘన నోటీసు ఇస్తాం
గాంధీభవన్‌లో ఉత్తమ్‌కుమార్ రెడ్డి, జానారెడ్డి సమక్షంలో పార్టీ ఎమ్మెల్యేలు సమావేశమై మంతనాలు జరిపారు. ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరాటం కొనసాగించాలని నిర్ణయించారు. సమావేశం అనంతరం ఉత్తమ్‌కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపక్షాల గొంతు నొక్కుతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వంపై సభా హక్కుల ఉల్లంఘన నోటీసు ఇవ్వనున్నట్టు చెప్పారు.
విపక్షాలతో కలిసి పోరాటం
తెదేపా కార్యాలయం ప్రధాన గేటు వద్ద పోలీసులు వదిలి వెళ్ళిన తర్వాత రేవంత్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ అన్ని విపక్షాలతో కలిసి ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై పోరాడుతామన్నారు. నిరసన తెలిపితే బలవంతంగా మార్షల్స్‌తో బయటకు గెంటేశారని దుయ్యబట్టారు.
నేడు విద్యా సంస్ధల బంద్‌కు ఎన్‌ఎస్‌యుఐ పిలుపు
ఇలాఉండగా సిఎం కెసిఆర్ అసెంబ్లీలో ఇచ్చిన సమాధానం సంతృప్తికరంగా లేనందున అన్ని విద్యా సంస్థల బంద్‌కు ఎన్‌ఎస్‌యుఐ అధ్యక్షుడు వెంకట్ పిలుపునిచ్చారు. విద్యార్థులు తరగతులు బహిష్కరించి ప్రభుత్వానికి నిరసన తెలపాలని కోరారు.

చిత్రం... అసెంబ్లీ వాయదా అనంతరం ఫీజు రీయంబర్స్‌మెంట్‌పై సభలో భైఠాయంచిన ప్రతిపక్షాల సభ్యులు