తెలంగాణ

ఫిబ్రవరి మూడో వారంలో అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జనవరి 30: రాష్ట్ర కౌన్సిల్, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఫిబ్రవరి మూడో వారంలో ప్రారంభంకానున్నాయి. కేంద్ర ప్రభుత్వం తరహాలో రాష్టబ్రడ్జెట్‌ను సైతం ముందుగానే ఉభయ సభల్లో ప్రతిపాదించి ఆమోదించుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఫిబ్రవరి 1న కేంద్ర బడ్జెట్‌లో కేటాయింపులకు అనుగుణంగా రాష్ట్ర బడ్జెట్‌ను రూపొందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఫిబ్రవరి మూడోవారం (18వ తేది) నుంచి బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయ్యే అవకాశం ఉందని సమాచారం. అదే నెల చివరలో 28వ తేదీన బడ్జెట్‌ను ప్రవేశ పెట్టి, ప్రతిపాదన పద్దులపై మార్చి మొదటి వారంలో చర్చించాలని ప్రభుత్వం సూత్రప్రాయంగా నిర్ణయించినట్టు సమాచారం. ఆ తర్వాత రెండవ వారంలో బడ్జెట్‌ను ఆమోదించాక శాసనసభ, శాసనమండలి నిరవధికంగా వాయిదా పడుతుందని ఈవర్గాల సమాచారం. బడ్జెట్ రూపకల్పనపై కేంద్ర ప్రభుత్వం చేసిన మార్గదర్శకాల మేరకు ఈ సారి బడ్జెట్‌లో రెవిన్యూ, కాపిటిల్ రెండు పద్దులు మాత్రమే ఉంటాయని ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఇప్పటికే అధికారులకు బడ్జెట్ రూపకల్పనపై దిశ నిర్దేశం చేశారు. ఆనవాయితీ ప్రకారం ప్రణాళికా, ప్రణాళికేతర పద్దులకు స్వస్తిపలికి వీటి స్థానంలో రెవిన్యూ, కాపిటల్‌గా రెండు పద్దులు మాత్రమే ఉంటాయి. ఉద్యోగుల జీతభత్యాలు, పెన్షన్లు, కార్యాలయాల నిర్వహణ, ప్రభుత్వ రుణాలపై వాయిదాలు, వడ్డీని రెవిన్యూ పద్దు కింద చూపెడుతారు. సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అయ్యే ప్రతిపాదన వ్యయాన్ని కాపిటల్ పద్దు కింద చేర్చనున్నారు. బడ్జెట్ సమావేశాలను తప్పనిసరిగా 18 రోజుల పాటు నిర్వహించాలనే నిబంధన ఉంది.
ఈ మేరకు ఫిబ్రవరి మూడవ వారంలో బడ్జెట్ సమావేశాలను ప్రారంభించి నెలాఖరున ఆమోదించుకున్నాక, మార్చి మొదటి, రెండవ వారాల్లో పది రోజుల పాటు సమావేశాలను నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం. ఈసారి బడ్జెట్‌లో కూడా సంక్షేమ రంగాలకు ప్రాధాన్యత ఇచ్చే విధంగా ప్రతిపాదనలపై అధికారులు కసరత్తు చేస్తున్నారు. వైద్య, విద్యారంగాలకు అధిక ప్రాధాన్యత ఇవ్వడంతో పాటు ప్రస్తుత బడ్జెట్‌లో వైద్యరంగానికి కేటాయించిన వ్యయాన్ని 30 శాతం పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. ప్రస్తుత బడ్జెట్‌లో వైద్యరంగానికి రూ.5,800 కోట్లు కేటాయించగా 30శాతం పెరుగుదలతో ఇది రూ.7000 కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. అలాగే విద్యారంగానికి ప్రస్తుత బడ్జెట్‌లో దాదాపు రూ.10వేల కోట్లు ఉండగా దీనిని కూడా 30 శాతం పెంచడం వల్ల ఇది రూ.14వేల కోట్లకు చేరుకునే అవకాశం ఉందని అంచన వేస్తున్నారు. బడ్జెట్‌లో ఈసారి కొత్తగా ఏర్పాటు చేసిన జిల్లాల్లో సమీకృత కార్యాలయాల నిర్మాణానికి రూ. 1500 నుంచి 2000 కోట్లు కేటాయించే అవకాశం ఉందని అంచన వేస్తున్నారు. ప్రస్తుతం అమలు చేస్తున్న ఆసరా పెన్షన్లకు అదనంగా సుమారు రెండు లక్షల మంది ఒంటరి మహిళలకు నెలకు వెయ్యి రూపాయాల చొప్పున పెన్షన్లు చెల్లించడానికి బడ్జెట్‌లో రూ. 240 కోట్లు, కెజి టు పిజి పథకంలో భాగంగా కొత్తగా ఏర్పాటు చేయబోయే 200 గురుకుల విద్యాలయాలకు నిధులు కేటాయించనున్నారు. రాజీవ్ గృహకల్ప పథకం కింద లబ్ధిదారులు బ్యాంకులకు బకాయిపడిన రూ.3800 కోట్లు చెల్లించడానికి కూడా బడ్జెట్‌లో కేటాయిస్తారు. పంట రుణ మాఫీ నాలుగో విడత (చివరి వాయిదా) చెల్లించడానికి రూ. 4000 కోట్లు, ముఖ్యమంత్రి ప్రత్యేక నిధికి రూ.5000 కోట్లు ప్రధానంగా బడ్జెట్ ప్రతిపాదనలో ఉంటాయని అధికార వర్గాల సమాచారం.