తెలంగాణ

గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో విప్లవం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, మార్చి 13: గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో విప్లవాత్మక మార్పులు తీసుకు వచ్చే బడ్జెట్ అని, ఇది తెలంగాణ ప్రజలకు పండుగ రోజని, గ్రామ ఆర్థిక వ్యవస్థ బాగు పడితే రాష్ట్రం బాగుపడుతుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. సోమవారం అసెంబ్లీలో 2017-18 సంవత్సరపు బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన తరువాత ఆర్థిక మంత్రి అసెంబ్లీ కమిటీ హాలులో విలేఖరుల సమావేశంలో మాట్లాడారు. కరెన్సీ నోట్ల రద్దు వల్ల ఒక నెల రోజుల పాటు ఇబ్బంది కలిగినా ఆ తరువాత పరిస్థితులు సర్దుకున్నాయని మంత్రి చెప్పారు. నోట్ల రద్దు తరువాత స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్లు, వాహనాల పన్నులు తగ్గాయని, అయితే మిగిలిన విభాగాల్లో సమర్ధవంతంగా పని తీరు కనబరచడం ద్వారా ఇబ్బంది కలగలేదని చెప్పారు. వాహనాల రిజిస్ట్రేషన్ ఆదాయం క్రమంగా పెరుగుతోందని, రియల్ ఎస్టేట్ మందగించడం వల్ల స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖలో మాత్రం ఆదాయం తక్కువగానే ఉందని చెప్పారు. నోట్ల రద్దు తరువాత ఈ రంగంపై ప్రభావం ఎక్కువగా పడిందని, ఇప్పటికీ అలానే ఉందని చెప్పారు. అందుకే ఈసారి భూముల అమ్మకాల ద్వారా ఆదాయంపై ఆశ పెట్టుకోలేదని చెప్పారు.
ఐటి, పరిశ్రమల ద్వారా ఆదాయం పెరిగినా అది గ్రామాలపై ప్రభావం చూపదని గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బాగుపడినప్పుడే ఆ ప్రయోజనం రాష్ట్రంలోని అందరికీ ప్రయోజన కరంగా ఉంటుందని చెప్పారు. ఈ అంశాన్ని దృష్టిలో పెట్టుకొని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను మెరుగు పరిచే విధంగా వివిధ కుల వృత్తులకు ప్రాధాన్యత ఇస్తున్నట్టు చెప్పారు. దాదాపు కోటి మందికి ప్రయోజనం కలిగించే విధంగా గ్రామీణ కుల వృత్తులపై దృష్టిసారించినట్టు చెప్పారు. మత్స్య పరిశ్రమ, గొర్రెల పెంపకం, చేనేత రంగాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా గ్రామీణ వ్యవస్థలో మార్పు త్వరలో చూస్తామని అన్నారు. నిర్లక్ష్యానికి గురైన గ్రామీణ పేద ప్రజలు, వృత్తులపై బతికే వారికి తెలంగాణ ప్రభుత్వం గుర్తింపును ఇస్తోందని అన్నారు. తెలంగాణ ప్రజలకు పండుగు రోజు అని బడుగు, బలహీన వర్గాలకు సంతోషకరమైన రోజు అని తెలిపారు.
వృత్తులను గుర్తించి బడ్జెట్‌లో కేటాయింపులు జరిపినట్టు చెప్పారు. 40లక్షల గొర్రెలకు మరో 80లక్షల గొర్రెలు జత కలుస్తున్నాయని, దీని వల్ల గొర్రెల పెంపకందారుల ఆర్థిక పరిస్థితి మెరుగు పడుతుందని అన్నారు.
5శాతానికి మించి ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేరు
అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలే అనేది ఎక్కడా సాధ్యం కాదని ఆర్థిక మంత్రి తెలిపారు. ఐదు శాతం మందికి ప్రభుత్వం ఉద్యోగాలు కల్పిస్తే 95శాతం ఉద్యోగాలు ప్రైవేటు రంగంలోనే ఉంటాయని చెప్పారు. బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు రూ. వంద కోట్లు కేటాయించామని, పరిశ్రమలకు వెయ్యి కోట్లు ఈ రెండు మినహాయిస్తే మిగిలిన కేటాయింపుల్లో ప్రయోజనం పొందేది బడుగు బలహీన వర్గాలు, మైనారిటీలే తప్ప జూబ్లీ హిల్స్‌లోని సంపన్నులు కాదని ఈటల రాజేందర్ తెలిపారు. కల్యాణలక్ష్మి పథకం లో 14వందల మంది మాత్రమే అగ్రవర్ణాలు ప్రయోజనం పొందారని, మిగిలిన వారంతా బడుగు బలహీన వర్గాలేనని చెప్పారు. తెలంగాణ స్వరూపమే ఆ విధంగా ఉందని ఈటల రాజేందర్ తెలిపారు.
రాష్ట్ర ఆర్థిక స్థితికి తగిన విధంగానే అప్పులు ఉన్నాయి తప్ప అధికంగా అప్పులు చేయలేదు, చేయడం సాధ్యం కాదని ఆర్థిక మంత్రి తెలిపారు. రాష్ట్ర రెవెన్యూ రిసీట్స్‌లో 90 శాతం వరకు మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం ష్యూరిటీ ఇవ్వగలుగుతుంది తప్ప ఇష్టం వచ్చినట్టు కార్పొరేషన్ల ద్వారా రుణాలు పొందే అవకాశం లేదని చెప్పారు. ఎఫ్‌ఆర్‌బిఎంకు లోబడే రుణాలు పొందినట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ నిధులు వ్యయం చేయకపోతే మరుసటి సంవత్సరానికి కలుపనున్నట్టు చెప్పారు. అదే విధంగా వినియోగంపై మూడు నెలలకు ఒకసారి శాసన సభకు, శాసన మండలికి నివేదిక ఇవ్వాల్సి ఉంటుందని చెప్పారు. సంక్షేమానికి రూ. 35లక్షల కోట్లు వ్యయం చేస్తున్నట్టు, జనాభాను మించి ఈ వర్గాల అభ్యన్నతికి వ్యయం చేయనున్నట్టు చెప్పారు. ఈ సంవత్సరం 50వేల కొత్త ఉద్యోగాలకు సరిపోయే విధంగా బడ్జెట్‌లో నిధులు కేటాయించినట్టు ఈటల రాజేందర్ తెలిపారు.

రోడ్లు, భవనాలకు
రూ. 5,033 కోట్లు
రెండింతలయిన జాతీయ రహదారులు

హైదరాబాద్, మార్చి 13: రోడ్లు, భవనాల శాఖకు 2017-18 బడ్జెట్‌లో రూ. 5,033.64 కోట్లు కేటాయించారు. తెలంగాణ ప్రభుత్వం రోడ్ల అభివృద్ధికి ప్రత్యేకంగా ఒక ప్రణాళిక రూపొందించింది. ప్రతి గ్రామం నుండి మండల కేంద్రానికి రోడ్లు సౌకర్యం కల్పించడం, మండల కేంద్రం నుండి జిల్లా కేంద్రానికి డబల్ లేన్ రోడ్లు వేయడం, జిల్లా కేంద్రం నుండి రాష్టర్రాజధానికి ఫోర్‌లేన్ రోడ్లు వేయడం ఈ ప్రణాళిక ప్రధాన ఉద్దేశం. పంచాయితీరాజ్ పరిధిలోని 14,689 కిలోమీటర్ల రోడ్లను 2247.28 కోట్లతో బిటిరోడ్లుగా మార్చారు. 4,564 కోట్ల రూపాయలతో 8987 కిలోమీటర్ల రోడ్లను వెడల్పు చేశారు. 891 కోట్లతో 460 బ్రిడ్జిలను నిర్మిస్తున్నారు. ఆర్ అండ్ బి పరిధిలోని 5150 కిలోమీటర్ల బిటి రోడ్లకు 1550 కోట్లతో మరమ్మతులు చేశారు. 2850 కిలోమీటర్ల రోడ్లను 4100 కోట్లతో అనివృద్ధి చేశారు. తెలంగాణలో గతంలో జాతీయ రహదారులు 2,527 కిలోమీటర్లు ఉండగా, గత రెండున్నర ఏళ్లలో 2776 కిలోమీటర్లు జాతీయ రహదారులుగా మారాయి. ఈ సంవత్సరం మరికొన్ని రోడ్లను జాతీయ రోడ్లుగా మార్చేందుకు కేంద్రంతో చర్చలు జరుగుతున్నాయి.
పంచాయతీరాజ్‌కు రూ.14,723 కోట్లు

హైదరాబాద్, మార్చి 13: పంచాయతీరాజ్ శాఖకు తెలంగాణ ప్రభుత్వం బడ్జెట్‌లో రూ. 14,723.42 కోట్లు కేటాయించింది. స్థానిక సంస్థలను బలోపేతం చేయడానికి ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ఈసందర్భంగా ఆర్థికమంత్రి ఈటల రాజేందర్ చెప్పారు. రాష్ట్రంలో పంచాయితీలు ద్వారా పన్నుల వసూలు మెరుగయ్యాయని, దీనివల్ల గ్రామ పంచాయతీలు గ్రామాల్లో మెరుగైన సేవలు అందించగలుగుతున్నాయని అన్నారు. సర్పంచ్‌లు, ఎంపిటిసిలు, ఎంపిపిలు, జడ్పీటిసిలకు గౌరవ వేతనాన్ని గణనీయంగా పెంచామని, పంచాయితీ రాజ్ శాఖ ద్వారా రాష్ట్రంలోని మొరం, మట్టి రోడ్లను బిటి రోడ్లుగా మారుస్తున్నామని, బిటి రోడ్లకు మరమ్మతులు చేస్తున్నామని అన్నారు. పంచాయితీ రాజ్ శాఖకు ఈ బడ్జెట్‌లో 14,723.42 కోట్లు కేటాయించామని అన్నారు. బడ్జెట్‌లో మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్‌కు 5599 కోట్లు కేటాయించారు. జిహెచ్‌ఎంసికి వెయ్యి కోట్లు, గ్రేటర్ వరంగల్‌కు 300 కోట్లు, మిగతా మున్సిపల్ కార్పొరేషన్లకు 400 కోట్లు, మూసీనది తీర ప్రాంత అభివృద్ధికి 350 కోట్లు కేటాయించారు.

వైద్యం, ఆరోగ్యానికి రూ. 5,976 కోట్లు

సర్కారు దవాఖానాలు పటిష్టం
హైదరాబాద్‌లో మరో మూడు
మల్టీ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు

హైదరాబాద్, మార్చి 13: తెలంగాణ ప్రభుత్వం వైద్య, ఆరోగ్య రంగానికి 2017-18 బడ్జెట్‌లో 5,976.17 కోట్ల రూపాయలు కేటాయించింది. ప్రజారోగ్య వ్యవస్థను చక్కదిద్దేందుకు సమగ్ర చర్యలు చేపట్టామని ప్రభుత్వం ప్రకటించింది. బడ్జెట్‌ను ఆర్థిక మంత్రి ఈటల సోమవారం శాసనసభకు సమర్పిస్తూ, సర్కారు దవాఖానాలపై ప్రజల విశ్వాసం పెరిగేందుకు వీలుగా వీటిని మెరుగుపరుస్తున్నామన్నారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు మొదలుకుని సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు అన్ని దవాఖానాలకు నిధులను నేరుగా ఇస్తున్నామన్నారు. దవాఖానాల్లో మందుల కొనుగోలుకు నిధులను రెట్టింపుచేశామన్నారు. దవాఖానాల్లో పాతబెడ్లను మార్చివేసి కొత్తబెడ్లను వేస్తున్నామన్నారు. రాష్ట్ర రాజధానిహైదరాబాద్‌లో మూడు మల్టిసూపర్ స్పెషాలిటీ దవాఖానాలను ఏర్పాటు చేస్తున్నామని, అలాగే కరీంనగర్‌లో ఒక మల్టిసూపర్ స్పెషాలిటీ దవాఖానాను ఏర్పాటు చేస్తున్నామన్నారు. రాష్ట్రంలో 108 వాహనాల సేవలను విస్తరించేందుకు వీలు గా మరో145 వాహనాలను కొనుగోలు చేయాలని ప్రభు త్వం నిర్ణయించింది. దవాఖానాల్లో మరణించే పేదల మృతదేహాలను వారి ఇళ్లకు తరలించేందుకు గత ఏడాది 50 వాహనాలను సమకూర్చగా, ఈఏడు మరో 50 వాహనాలను సమకూరుస్తున్నామన్నారు. గిరిజన ప్రాంతాల్లో వైద్యసేవలకోసం 39 వాహనాలను ఏర్పాటు చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఒక ఎయిమ్స్ దవాఖానను మంజూరు చేసేందుకు సిద్ధమైంది. ప్రజలంతా సర్కారు దవాఖానాలకే వచ్చేందుకు వీలుగా దవాఖానాల్లో వౌలిక సదుపాయాలు కల్పిస్తూ, మెరుగైన చికి త్స అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టామని ప్రభుత్వం ప్రకటించింది.