తెలంగాణ

విద్యారంగం వ్యాపారమయం కావొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 21: సరస్వతి నిలయాలుగా ఉండాల్సిన విద్యాసంస్థలు లక్ష్మీనిలయాలుగా మారుతున్నాయని రాష్ట్ర గవర్నర్ ఇఎస్‌ఎల్ నరసింహన్ పేర్కొన్నారు. శుక్రవారం జెఎన్‌టియుహెచ్ ఆరో స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ నరసింహన్ చాన్సలర్ హోదాలో మాట్లాడుతూ విద్యారంగం వ్యాపారమయం కారాదని వ్యాఖ్యానించారు. కేవలం పట్టాలను తయారుచేసే కర్మాగారాల్లా టెక్నాలజీ వర్శిటీలు ఉంటే దానివల్ల సమాజానికి ఎలాంటి లాభం ఉండదన్నారు. యూనివర్శిటీలో నాలుగు లక్షల మంది రిజిస్టర్ అయి ఉన్నారని, వారు కనీసం నెలకు రెండు పరిశోధనా పత్రాలు ప్రచురిస్తే దానివల్ల సమాజానికి లాభం ఉంటుందని అన్నారు. సమాజంలో ఇబ్బందికరంగా తయారైన అనేక సమస్యలను తీసుకుని వాటి పరిష్కారానికి ప్రయత్నించాలని అన్నారు. పారిశుద్ధ్యం, ఆరోగ్యం, కరవు వంటి ఎన్నో సమస్యలున్నాయని, ఎంత డబ్బున్నా ఆరోగ్యం లేకపోతే సున్నా అని వ్యాఖ్యానించారు. సమాజాభివృద్ధికి దోహదపడే అంశాలను తీసుకుని వాటిపై పరిశోధనలు చేసి పరిష్కారాలను సూచించాలని అన్నారు. ఆహారధాన్యాల కొరతను ఎలా ఎదుర్కోవాలో ఆలోచించాలని, కోట్లాది మంది ఆహారలేమితో బాధపడుతున్నారని, వారందరికీ ఆరోగ్యం అందించాలని అన్నారు. ఇంధన భద్రతపై కూడా పరిశోధనలు పెద్ద ఎత్తున చేయాల్సి ఉందని, ప్రత్యామ్నాయ ఇంధనాలపై దృష్టి పెట్టాలని, సౌర విద్యుత్, పవన విద్యుత్‌లను తక్కువ వ్యయంతో తయారుచేయడంపై కూడా పరిశోధనలు జరగాలని అన్నారు. సౌరవిద్యుత్‌కు వాడే సోలార్ ప్యానల్స్‌ను మనం జపాన్ నుండి ఎందుకు దిగుమతి చేసుకోవాలి? మనం ఉత్పత్తి చేసుకోలేమా? అని నిలదీశారు. పూడిక తీత ద్వారా జలాశయాలను కాపాడుకోవాలని, భారీ నీటిపారుదల ప్రాజెక్టులకు వేల కోట్లు వెచ్చించడం ప్రభుత్వాలకు సైతం భారంగా మారిందని, చిన్న చిన్న ప్రాజెక్టుల నిర్మాణంతో సాగునీటిని అందించే ప్రయత్నాలు జరగాల్సి ఉందని అన్నారు. సామాజిక అభివృద్ధికి విజ్ఞాన శాస్త్రాలు ఉపయోగపడాలని, గ్రామాల నుండి పట్టణాలకు పెద్ద ఎత్తున వలస పోకుండా ఆపాల్సి ఉందని చెప్పారు. తెలంగాణలో చెరువుల పునరుద్ధరణకు చేపట్టిన మిషన్ కాకతీయ వంటి ప్రాజెక్టుల గురించి కూడా ఆలోచించాలని అన్నారు. అన్నింటికీ టెక్నాలజీపై ఆధారపడటం మంచిది కాదని, సెల్‌ఫోన్లు వచ్చిన తర్వాత జ్ఞాపక శక్తి తగ్గిపోతోందని చెప్పారు. విలువలు పడిపోకుండా సమాజాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులపై ఉందని అన్నారు. యోగ, ప్రాణాయామాలను అందించిన భారతదేశం నేడు తిరిగి వాటిని ఇతర దేశాల నుండి దిగుమతి చేసుకునే పరిస్థితి రావడం మన దురవస్థ అని పేర్కొన్నారు. యూనివర్శిటీల అనుబంధ గుర్తింపు విద్యాప్రమాణాల ఆధారంగా జరగాలే తప్ప విద్యార్థుల సంఖ్య ఆధారంగా కాదని జెఎన్‌టియు విసికి ఆయన సూచించారు. ఈ సందర్భంగా ఆయన 2014-17 విద్యాసంవత్సరానికి సంబంధించి 31, 2015-16కు సంబంధించి 33 బంగారు పతకాలను విద్యార్థులకు అందజేశారు. అలాగే ధర్మాదాయ బంగారు పతకాలు 46 మంది విద్యార్థులకు అందించారు. యూనివర్శిటీ నుండి 1023 మంది పిహెచ్‌డి పూర్తి చేయగా, 489 మందికి వేదికపై పట్టాలను అందించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఎ వేణుగోపాల్‌రెడ్డి, రెక్టార్ డాక్టర్ ఎన్ వి రమణారావు, రిజిస్ట్రార్ డాక్టర్ ఎన్ యాదయ్య, ఒఎస్‌డి డాక్టర్ జి కె విశ్వనాధ్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా విసి వర్శిటీ నివేదికను అందించారు.

చిత్రం..జెఎన్‌టియు స్నాతకోత్సవంలో మాట్లాడుతూన్న గవర్నర్ నరసింహన్