తెలంగాణ

భూసేకరణతోనే కాలం వృథా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూన్ 11: నల్లగొండ జిల్లాలోని ఫ్లోరైడ్, కరవు పీడిత మునుగోడు, దేవరకొండ నియోజకవర్గాలకు సాగుతాగునీటితో పాటు జంటనగరాలకు తాగునీరు అందించే లక్ష్యంతో చేపట్టిన డిండి ప్రాజెక్టుకు సిఎం కెసిఆర్ శంకుస్థాపన చేసి సోమవారంతో రెండేళ్లు పూర్తికానుంది. రెండేళ్లలో ప్రాజెక్టు పనులు పూర్తి చేసి ఈ ప్రాంత ప్రజల ఫ్లోరైడ్, కరవు కష్టాలను పారదోలుతామంటూ 2015 జూన్ 12న మర్రిగూడ మండలంలో శివన్నగూడెం వద్ధ డిండి ఎత్తిపోతలకు కెసిఆర్ శంకుస్థాపన చేశారు. అయితే శంకుస్థాపన చేసి రెండేళ్లయినా ప్రాజెక్టు పనులు పూర్తికాకపోగా నేటికీ పూర్తిగా భూసేకరణగాని, అన్నిదశల టెండర్లనుగాని పూర్తిచేసుకోలేకపోయింది. ముందుగా 3100 కోట్లతో శివన్నగూడెం, సింగరాజుపల్లి, కిష్టరాయినపల్లి, గొట్టిముక్కల, చింతపల్లి రిజర్వాయర్లు, అప్రోచ్ కెనాల్ నిర్మాణ పనులకు టెండర్లు పిలిచారు.
గత డిసెంబర్ 18న శివన్నగూడెం రిజర్వాయర్ నిర్మాణ పనులు ప్రారంభించారు. ఆయా రిజర్వాయర్ల నిర్మాణ పనులకు, భూసేకరణ సర్వే పనులకు ముంపు బాధిత రైతులు అడుగడుగునా అడ్డు తగులుతున్నారు. 123 జీవోతో భూసేకరణ చేపట్టగా ఈ జీవో రద్దు కావడంతో 2013 కింద భూసేకరణ చేయాలంటూ నిర్వాసితులు పేచీ పెడుతున్నారు. ఇప్పటిదాకా 10 వేల ఎకరాల భూసేకరణకు 5400 ఎకరాల భూసేకరణ చేసి 160కోట్లు నిర్వాసితులకు చెల్లించారు.
భూసేకరణ చిక్కులు..డిజైన్ల మార్పులతో జాప్యం!
3.41 లక్షల ఎకరాలకు సాగునీరందించే లక్ష్యం తో 6,200 కోట్ల వ్యయంతో చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి పథకంలో భాగంగా శ్రీశైలం జలాశయం నుండి ఎత్తిపోసే నీటిని నార్లాపూర్ రిజర్వాయర్ నుండి రోజుకు 0.5 టిఎంసిల నీటిని 60 రోజుల పాటు తరలించాలని తొలుత నిర్ణయించారు. తదుపరి కెసిఆర్ డిండి ప్రాజెక్టుకు రీడిజైన్ చేసి రిజర్వాయర్ల సంఖ్య, నిల్వ సామర్ధ్యంలపై పలు మార్పులు చేర్పులు చేశారు. రోజుకు 1 టిఎంసి చొప్పున 60 టిఎంసిలు ఏదులా రిజర్వాయర్ నుండి తీసుకోవాలని ఇందులో నల్లగొండ జిల్లాకు 30 టిఎంసిలు, జంటనగరాల తాగునీటి అవసరాలకు 20 టిఎంసిలు, రంగారెడ్డి జిల్లాకు 10 టిఎంసిల నీటిని అందించాలని నిర్ణయించారు. ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా శివన్నగూడెంలో 10.95 టిఎంసిల రిజర్వాయర్, కిష్టరాయనిపల్లిలో 6.16 టిఎంసిలు, గొట్టిముక్కలలో 1.77 టిఎంసిలు, సింగరాజుపల్లిలో 0.81 టిఎంసిలు, చింతపల్లిలో 1.1 టిఎంసి రిజర్వాయర్లు నిర్మించాల్సివుంది. మరో రిజర్వాయర్‌ను రాచకొండ గుట్లలో 20 టిఎంసిల సామర్ధ్యంతో, రంగారెడ్డి జిల్లాలో 10 టిఎంసిల సామర్ధ్యంతో రిజర్వాయర్‌ను నిర్మించాలని ప్రతిపాదించారు. ప్రస్తుత శివన్నగూడెం, కిష్టరాయనిపల్లి రిజర్వాయర్ల నిర్మాణ పనులను పోలీస్ బందోబస్తు మధ్య చేపట్టి ముందుగా కరకట్ట నిర్మాణ పనులు కొనసాగిస్తున్నారు.

చిత్రం.. డిండి ఎత్తిపోతల పథకంలో భాగంగా నిర్మిస్తున్న శివన్నగూడెం
రిజర్వాయర్ కరకట్ట నిర్మాణ పనులు