తెలంగాణ

ధార్మిక పరిషత్ ఏర్పాటు ఏమైంది?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 12: తెలంగాణ రాష్ట్రం ఏర్పడి మూడేళ్లు గడిచినా ‘్ధర్మిక పరిషత్’ను ప్రభుత్వం ఏర్పాటు చేయలేకపోయింది. దేవాదాయ, ధర్మాదాయ శాఖ యావత్తూ ‘దైవాధీనం’లో నడుస్తోంది. ఎండోమెంట్స్ మంత్రిగా ఇంద్రకరణ్‌రెడ్డి సమర్థతగా పనిచేస్తున్నప్పటికీ, ఈ శాఖలో తగినంత మంది సిబ్బంది లేక ఆయన ఇబ్బందికరంగానే పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఎండోమెంట్స్ శాఖకు సంబంధించిన కీలకపోస్టులన్నీ ఖాళీగానే ఉన్నాయి. ఎండోమెంట్స్ శాఖకు తలమానికంగా ఉండాల్సిన ‘్ధర్మిక పరిషత్’ను ప్రభుత్వం ఏర్పాటు చేయలేదు. ఈ శాఖకు పూర్తికాలంలో ఉండాల్సిన కమిషనర్, పూర్తికాలంగా ఉండాల్సిన కార్యదర్శి (రెవెన్యూ-ఎండోమెంట్స్) లేరు. ఆర్థిక శాఖ కార్యదర్శి ఎన్. శివశంకర్ ఎండోమెంట్స్ కార్యదర్శిగానూ, కమిషనర్‌గానూ అదనపు బాధ్యతలు నిర్వహిస్తూ, మూడు బాధ్యతల్లో పనిచేస్తున్నారు. దాంతో ఆయన అనేక ఒత్తిళ్ల మధ్య పనిచేయాల్సి వస్తోంది. పరిపాలనాపరంగా ఏర్పడే సమస్యలను పరిష్కరించడంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిసింది.
కెసిఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత ధార్మిక పరిషత్ ఏర్పాటుపై చర్చలు కూడా జరిగాయి. ఈ అంశంపై కెసిఆర్‌తో దేవాదాయ మంత్రి ఇంద్రకరణ్‌రెడ్డి, ప్రభుత్వ సలహాదారు కెవి రమణాచారి, సంబంధిత అధికారులు చర్చలు జరిపారు. ధార్మిక పరిషత్ ఏర్పాటుకు సంబంధించి ముసాయిదా కమిటీని దేవాదాయ శాఖ రూపొందించి ప్రభుత్వానికి పంపించిందని ఏడాది క్రితమే అధికార వర్గాలు పేర్కొన్నాయి. అయినా ఇప్పటివరకు ధార్మిక పరిషత్ ఏర్పాటు కాలేదు. ఎండోమెంట్స్ చట్టం ప్రకారం ధార్మిక పరిషత్ తప్పని సరిగా ఏర్పాటు చేయాలి. వివిధ రంగాల్లో నిష్టాతులను ఈ కమిటీలో సభ్యులుగా, ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించాలని రూల్స్‌లో పేర్కొన్నారు.
రోశయ్య ముఖ్యమంత్రిగా ఉండగా 2009 డిసెంబర్‌లో మొదటి పర్యాయం ధార్మిక పరిషత్ ఏర్పాటైంది. ఆ తర్వాత కిరణ్‌కుమార్‌రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా 2014 ఫిబ్రవరిలో రెండో పర్యాయం ధార్మిక పరిషత్‌ను ఏర్పాటు చేశారు. కిరణ్‌కుమార్‌రెడ్డి నేతృత్వంలో ఏర్పాటైన ధార్మిక పరిషత్ తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత ఆటోమెటిక్‌గా రద్దయింది. కెసిఆర్ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత అనేక కార్పోరేషన్లను, అకాడమీలను ఏర్పాటు చేస్తుండటంతో పాటు పాలక మండళ్లు లేని వాటికి పాలక మండళ్లను ఏర్పాటు చేస్తూ వస్తున్నారు. అయితే దేవాదాయ శాఖ పరిధిలో ఉండాల్సిన ధార్మిక పరిషత్‌ను మాత్రం ఏర్పాటు చేయలేదు. ఎపి ఎండోమెంట్స్ చట్టాన్ని తెలంగాణ ప్రభుత్వం యథాతథంగా అమలు చేస్తోంది. 2014 జూన్ 1 వ తేదీ వరకు అమల్లో ఉన్న ఆంధ్రప్రదేశ్ ఛారిటబుల్ అండ్ హిందూ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ ఎండోమెంట్స్ ధార్మిక పరిషత్ రూల్స్,2009 ను తెలంగాణ ప్రభుత్వం అడాప్ట్ చేసుకున్నట్టు 2014 డిసెంబర్ 24 న ఒక జీఓ (జీఓ నెంబర్ 53) వెలువడింది. అంటే ఈ రూల్స్ ప్రకారం ధార్మిక పరిషత్‌ను ప్రభుత్వం ఏర్పాటు చేయాలి.
దేవాదాయ మంత్రి చైర్మన్‌గా ఉండే ఈ పరిషత్‌లో 20 మందిని సభ్యులుగా, మరో ఏడుగురిని ప్రత్యేక ఆహ్వానితులుగా నియమించే అధికారం ప్రభుత్వానికి ఉంది. ధార్మిక పరిషత్ ఏర్పాటు చేస్తే ప్రభుత్వ ఖజానాపైగానీ, దేవాదాయ శాఖపైగానీ ఆర్థికంగా ఎలాంటి భారం ఉండదు. వివిధ రంగాల ప్రముఖులు సభ్యులుగా ఉండటం వల్ల దేవాదాయ శాఖను భక్తులకు ఉపయోగపడేవిధంగా నడిపే అవకాశాలున్నాయి. ఒక సారి ధార్మిక పరిషత్ ఏర్పాటైతే మూడేళ్ల వరకు దాని కాలపరిమితి ఉంటుంది.
ఏదైనా బలమైన కారణంతో ధార్మిక పరిషత్ ఏర్పాటు కాకపోతే నలుగురు అధికారులతో ఎగ్జిక్యూటివ్ కమిటీ పనిచేయాల్సి ఉంటుంది. ఈ కమిటీలో పనిచేయాల్సిన కమిషనర్, కార్యదర్శి/ముఖ్యకార్యదర్శి పోస్టులు ఖాళీగా ఉండటంతో చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. టిటిడి ఇఓ స్థానంలో తెలంగాణలోని ఒక దేవాలయం ఇఓను ధార్మిక పరిషత్ ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్‌గా నియమించాల్సి ఉంటుంది. ఆ విధంగా కూడా ప్రభుత్వం నియమించలేదు. ప్రస్తుతం అధికారంలో ఉన్న కెసిఆర్ ఈ అంశంపై తగిన శ్రద్ద తీసుకోవాలని తెలంగాణలోని భక్తలోకం కోరుతోంది.