తెలంగాణ

వీడని శిరీష ఆత్మహత్య మిస్టరీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూన్ 26: బ్యూటీషియన్ శిరీష ఆత్మహత్య కేసులో మిస్టరీ కొనసాగుతూనే ఉంది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ఎ-1 శ్రవణ్, ఎ-2 రాజీవ్‌లను పోలీసులు విచారణ కోసం కస్టడీకి కోర్టు అనుమతించింది. అర్ధరాత్రి వేళ ఇద్దరు యువకులతో దూర ప్రాంతమైన కుకునూరుపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్ళిన ధైర్యం గల శిరీష తనకు ఎదురైన సవాళ్ళను ఎదురొడ్డి నిలువకపోవడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. రాజీవ్, శ్రవణ్ బయట ఉన్నప్పుడే డోర్ పెట్టేసుకుని చున్నీతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించిన సంగతి తెలిసిందే. వారిద్దరూ బయట ఉన్నారన్న గ్యారంటీ ఏమిటీ?, ఆమెను హత్య చేసిన తర్వాతే డోర్ బద్దలు కొట్టి లోపలికి వెళ్ళినట్లు చిత్రీకరించారన్న అనుమానాలూ లేకపోలేదు.
ఆ రోజు రాత్రి శ్రావణ్, రాజీవ్‌తో కలిసి శిరీష కారులో కుకునూరుపల్లి పోలీసు స్టేషన్‌కు వెళ్ళడం, అక్కడ ఏమి జరిగిందనే కోణంలో పోలీసులు ‘ఆరా’ తీస్తున్నారు. బలమైన కారణాలు లేకుండా ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారు? అనేది ప్రధాన ప్రశ్న. శిరీష తెల్లవారు జామున ఆత్మహత్య చేసుకోగా, ఆ మర్నాడు సుమారు 11.30 గంటలకు కుకునూరుపల్లి ఎస్‌ఐ ప్రభాకర్ రెడ్డి ఆత్మహత్య చేసుకున్న సంగతి తెలిసిందే. అసలు శిరీషకు ఏమి చెప్పి వారిరువురు ఎస్సై ప్రభాకర్ రెడ్డి వద్దకు తీసుకెళ్ళారు?, శిరీషను తీసుకెళ్ళడానికి ముందే ఎస్సైకి వారిరువురూ ఆమె గురించి ఏమని చెప్పారు?, ఎస్సై క్వార్టర్‌కు చేరుకున్నాక నలుగురూ మద్యం సేవిస్తున్నప్పుడు ఏదో ఒక వంకతో వారు రెండు సార్లు ఎందుకు బయటకు వెళ్ళారు?. సిగిరెట్ తాగేందుకు ఒకసారి, మూత్రానికి మరోసారి రాజీవ్, శ్రవణ్ బయటకు వెళ్ళినట్లు ప్రాథమిక విచారణ అనంతరం నగర పోలీసు కమిషనర్ పి. మహేందర్ రెడ్డి విలేఖరుల సమావేశంలో వెల్లడించారు. కొత్త ప్రాంతానికి, పైగా ఓ కొత్త వ్యక్తి (పోలీసు అధికారి) వద్ద నలుగురూ మద్యం సేవిస్తున్న సమయంలో ఓ మహిళను అలా ఒంటరిగా వదిలిపెట్టి వెళ్ళేందుకు సహజంగా ఎవరూ ఇష్టపడరు. అయినా వారిరువురూ రెండు సార్లు ఎందుకు వెళ్ళినట్లు?, ఇది ముందుగా వేసుకున్న ‘ప్లాన్’ కాదా?, వారు బయటకు వెళ్ళిన తర్వాత ఎస్‌ఐ ప్రవర్తనతో ఎంతో చలించిపోయిన శిరీష తిరిగి ఇంటికి అంటే రాజీవ్ ఫొటోగ్రఫీ కార్యాలయానికి వచ్చేసిన తర్వాత ఆత్మహత్య చేసుకున్నదా? అదే నిజమైతే, అంత పిరికి చర్యకు పాల్పడే మనస్తత్వమే ఉంటే రాత్రి వేళ ఇంట్లో భర్తను, పనే్నండేళ్ళ కుమార్తెను వదిలి పరాయి వ్యక్తులతో వెళుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పైగా ఆమె తలపై బలమైన గాయాలు ఉన్నాయని పోలీసులే చెప్పారు.
కేసు నుంచి తప్పించుకునేందుకు రాజీవ్, శ్రావణ్ కట్టుకథ అల్లారా?, చెప్పినవన్నీ నిజాలేనా?, ఇంకా రహస్యాలు ఏమైనా ఉన్నాయా? అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది.

సిఎం సన్నిహితుడు దానయ్య మృతి
* కెసిఆర్ సంతాపం

హైదరాబాద్, జూన్ 26: సిద్దిపేట మార్కెట్ కమిటి మాజీ చైర్మన్ ఈస దానయ్య గుండె పోటుతో సోమవారం మృతి చెందడం పట్ల ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావు ఒక ప్రకటనలో తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. గతంలో కెసిఆర్ సిద్దిపేట ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు దళిత నాయకుడైన దానయ్యను మార్కెట్ కమిటీ చైర్మన్‌గా నియమించారు. అప్పటి నుంచి దానయ్య కెసిఆర్‌కు అత్యంత సన్నిహితునిగా మారారు. తెలంగాణ రాష్ట్ర సాథన ఉద్యమంలో, టిఆర్‌ఎస్‌లో క్రియశీలకంగా పని చేశారని పేర్కొన్నారు. ఢిల్లీలో ఉన్న ముఖ్యమంత్రి తనకు దానయ్యతో ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.

దేశంలో నేషనల్ టీచర్ ప్లాట్‌ఫారం
సెప్టెంబర్ 5న ప్రారంభం టీచర్ల ఫోన్లకు నేరుగా బోధనాంశాలు*
నూతన బోధన పద్ధతులపై నైపుణ్యం *స్థానిక భాషల్లోనూ నోట్సులు

హైదరాబాద్, జూన్ 26: దేశంలో ఉపాధ్యాయులు, అధ్యాపకుల కష్టాలు తీరనున్నాయి. బోధనాంశాలకు సంబంధించి నూతన మెలకువలు, నోట్సులు, ఆధునిక పద్ధతుల్లో బోధన తీరులు వివరిస్తూ నేరుగా వారి సెల్‌ఫోన్‌కే ఎప్పటి పాఠం అప్పుడు చేరుకునేలా వీలుకల్పించే కొత్త వేదికను కేంద్ర ప్రభుత్వం రూపొందించింది. దీనిని నేషనల్ టీచర్ ప్లాట్ ఫారంగా ప్రస్తుతానికి వ్యవహరిస్తున్నారు. దీనిని సెప్టెంబర్ 5వ తేదీన కేంద్ర మానవ వనరుల మంత్రి ప్రకాష్ జవదేకర్ ప్రారంభించానున్నారు. జ్ఞాన - విజ్ఞాన వేదికను ఎపిఎక్స్ పేరిట టెక్నాలజీ ప్లాట్‌ఫారంను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహిస్తున్న తీరును గమనించిన యుజిసి ప్రత్యేక బృందం ఈ తరహా వేదికను జాతీయ స్థాయిలో ఏర్పాటు చేయడం వల్ల మంచి ప్రయోజనం ఉంటుందని భావించింది. ఈ ఆలోచన నుండే నేషనల్ టీచర్ ప్లాట్‌ఫారం ఏర్పాటైంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ టెక్నాలజీ ప్లాట్‌ఫారం ద్వారా 120 సబ్జెక్టులపై నిపుణుల పాఠ్యాంశాలను అందిస్తోంది. కొత్త ప్లాట్‌ఫారం విద్యార్థులకు సైతం అందుబాటులోకి తెస్తారు. ప్రతి విద్యార్థికీ ఒక యూజర్ పేరు, పాస్ వర్డు అందిస్తారు. ప్రతి విద్యార్థి ఆ వివరాలతో టెక్నాలజీ హబ్‌లోకి లాగిన్ అయి తమకు కావాల్సిన పాఠ్యాంశాన్ని నేర్చుకునే వీలుంటుంది. అందుకు సంబంధించిన వీడియోలు కూడా ఉంటాయి. వీడియో ద్వారా అభ్యాసం చేస్తూ, చివరికి నిర్వహించే ఆన్ లైన్ పరిజ్ఞాన పరీక్షకు కూడా హాజరుకావచ్చు. దానిని టెక్నాలజీ ద్వారానే సమీక్షించి ప్రతి అభ్యర్థి నేర్చుకున్నదానికి, వారికి అర్థమైన విషయాలు, విశే్లషణ, జ్ఞాన పునరావలోకనంపై కూడా స్పష్టమైన నివేదిక వస్తుంది. తదనుగుణంగా తదుపరి పాఠ్యాంశానికి లేదా పాఠ్యవిభాగానికి వారు ఉన్ముక్తులు కావల్సి ఉంటుంది. ఈ మొత్తం సమాచారం అందరికీ అందుబాటులో ఉచితంగా లభ్యమవుతుంది. కొన్ని పాఠ్యాంశాలను ఆధునిక పద్ధతుల్లో నూతన ఒరవడిని పాటిస్తూ చెప్పాలంటే కొంత మంది టీచర్లు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వారంతా తాజా టెక్నాలజీ హబ్‌తో బోధన సమస్యలను తేలికగా అధిగమించగలుగుతారు.

సినీ ప్రేక్షకులకు జిఎస్‌టి దెబ్బ

హైదరాబాద్, జూన్ 26: సినిమా ప్రేక్షకులపై జిఎస్‌టి దెబ్బ పడనుంది. టికెట్ల ధరలు పది రూపాయల నుంచి ఇరవై రూపాయల వరకు పెరగనున్నాయి. జిఎస్‌టి అమలులోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సినిమా టికెట్ల ధరలు పెరుగుతాయి. ఈ మేరకు సినిమా హాళ్లకు సమాచారం అందింది. గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్‌తో పాటు ఇతర కార్పొరేషన్ల పరిధిలో ఎసి, ఎయిర్ కూల్డ్ థియోటర్లలో సినిమా టికెట్ ధర అత్యధికంగా 120 రూపాయలు, తక్కువ ధర 40 రూపాయలు ఉంటుంది. నాన్ ఎసి థియోటర్లలో హయ్యల్ క్లాస్ టికెట్ ధర 60, లోయర్ క్లాస్ 20 రూపాయలు ఉంటుంది. మున్సిపాలిటీల్లో హయ్యర్ క్లాస్ 80 రూపాయలు, లోయర్ క్లాస్ 30 రూపాయలు, నాన్ ఎసిలో హయ్యర్ క్లాస్ 60, లోయర్ క్లాస్ టికెట్ 20 రూపాయలు. నగర పంచాయితీలు, గ్రామ పంచాయితీల పరిధిలో ఎసి థియోటర్లలో హయ్యర్ క్లాస్ 70 రూపాయలు లోయర్ క్లాస్ టికెట్ 20 రూపాయలు, నాన్ ఏసిలో హయ్యర్ క్లాస్ 50 రూపాయలు, లోయర్ క్లాస్ 15 రూపాయల ధర నిర్ణయించారు. మల్టీ ప్లెక్స్ థియోటర్లలో కనీసం 20 శాతం సీట్లు లోయర్ క్లాస్ ఉండాలని నిబంధన విధించారు. టికెట్లపై తప్పని సరిగా ఆన్‌లైన్ చార్జీలు, జిఎస్‌టిని ముద్రించాలని నిబంధన విధించారు. ఒక్కో టికెట్ ధర పది రూపాయల నుంచి 20 రూపాయల వరకు పెరిగింది.

ధర్నా చౌక్ పరిరక్షణ కోరుతూ 25న ఢిల్లీలో ధర్నా

హైదరాబాద్, జూన్ 26: ఇందిరా పార్కు వద్ద ఉన్న ధర్నా చౌక్‌ను పరిక్షించేందుకు ధర్నా పరిరక్షణ సమితి జులై 25న ఢిల్లీలోని జంతర్‌మంతర్ వద్ద ధర్నా చేయాలని నిర్ణయించింది. సోమవారం నాడిక్కడ సిపిఐ రాష్ట్ర కార్యాలయం మఖ్థూం భవన్‌లో జరిగిన ధర్నా చౌక్ పరిరక్షణ కమిటీ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు కమిటీ కన్వీనర్ సిపిఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి, కో కన్వీనర్ పి.ఎల్.విశే్వశ్వరరావు తెలిపారు. దీంతో పాటు జులై మొదటి వారంలో కమిటీ ప్రతినిధి బృందం సిఎంను కలవాలని నిర్ణయించినట్లు వారు వెల్లడించారు. గత మూడు నెలల నుంచి ధర్నా చౌక్‌ను పరిరక్షించాలని శాంతియుతంగా, ప్రజాస్వామికంగా ఉద్యమాలు చేస్తుంటే సిఎం కెసిఆర్ నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. ధర్నా చౌక్ పరిరక్షణకు తీవ్రమైన ఉద్యమాలు చేయాలని సమావేశం నిర్ణయించింది. అన్ని వర్గాల ప్రజలు ఈ ఉద్యమంలో భాగస్వాములు కావాలని సమావేశం విజ్ఞప్తి చేసింది.