తెలంగాణ

మంత్రాలకు మంత్రి పదవి?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

వరంగల్, జూలై 17: మంత్రాలకు చింతకాయలు రాలుతాయో...లేదో తెలియదు కానీ, మంత్రాలకు మంత్రిపదవి వస్తుందని నమ్మి అధికార పార్టీకి చెందిన ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు పూజల పేరిట మాయగాళ్లకు 57 లక్షల భారీమొత్తం డబ్బు ముట్టచెప్పిన సంఘటనలో నిందితుల నుంచి ఆ మొత్తాన్ని పోలీసులు రికవరీ చేస్తున్నారు. ఏడాదికాలంగా మంత్రగాళ్లకు డబ్బులు ముట్టచెబుతూ వస్తున్న ఆ ఎమ్మెల్యే కుటుంబం ఇటీవల కాలంలో వారి చెప్పింది అంతా మోసమని గమనించి పోలీసులకు ఫిర్యాదు చేసారు. నాలుగురోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేయగా మాయగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని వారినుంచి కొంతమొత్తం రికవరీ చేసినట్లు సమాచారం.
పోలీసుల సమాచారం ప్రకారం వరంగల్ రూరల్ జిల్లా పరిధిలోని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబ సభ్యులు వ్యక్తిగత సమస్యలు ఎదుర్కొన్న సందర్భంలో వరంగల్ నగరానికి చెందిన కోయదొరల పేరిట లక్ష్మణరాజు, వంశీరాజు అనే ఇద్దరు వ్యక్తులు తాము పూజలు చేస్తే సమస్యలు తొలగిపోతాయని నమ్మించారు. దాంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు డబ్బులు ముట్టచెప్పారు. పూజల సంగతేమిటోగానీ కొన్ని రోజుల తరువాత ఎమ్మెల్యే కుటుంబ సభ్యుల సమస్య తొలగిపోవటంతో కోయదొరలపై గురి కుదరటం, కోయదొరలు తరచుగా ఎమ్మెల్యే ఇంటికి వస్తూ వెళ్లటం మొదలయింది. ఎమ్మెల్యే ధర్మారెడ్డికి మంత్రియోగం ఉందని, అందుకు అవసరమైన పూజలు జరిపితే మంత్రి కావటం ఖాయమని నమ్మబలకటంతో మంత్రి అవుతారనే ఆశతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు ఒకరికి తెలియకుండా ఒకరు ఆ కోయదొరలకు భారీ మొత్తంలో డబ్బులు అప్పచెబుతూ వచ్చారు. దానికి తగినట్లు కోయదొరలు వివిధ పుణ్యక్షేత్రాల నుంచి ల్యాండ్ ఫోన్ల ద్వారా ఫోన్లు చేస్తూ అవసరమైన పూజలు జరిపించినట్లు, అన్నదానం చేసినట్లు, ఇతర కార్యక్రమాలు నిర్వహించినట్లు నమ్మబలుకుతూ వచ్చారు.
ఏడాది కాలంగా ఈ వ్యవహారం కొనసాగుతుండగా, భారీ మొత్తంలో డబ్బు ఖర్చు అవుతున్నా ఫలితం లేకపోవటంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులలో అనుమానం మొదలయింది. ఇటీవల కోయదొరల ప్రస్తావన వచ్చిన సందర్భంలో మంత్రిపదవి కోసం ఒకరికి తెలియకుండా ఒకరు సుమారు 57 లక్షల రూపాయలు కోయదొరలకు సమర్పించుకున్నట్లు తేలింది. దాంతో ఎమ్మెల్యే కుటుంబ సభ్యులు గుండెలు బాదుకోవాల్సి వచ్చింది. జరిగిన మోసంపై ఏమి చేయాలనే జరిగిన తర్జనభర్జన అనంతరం నాలుగు రోజుల కిందట ఎమ్మెల్యే సమీప బంధువు పేరిట వరంగల్ నగరంలోని సుబేదారి పోలీసులకు జరిగిన మోసంపై ఫిర్యాదు చేసారు. ఫిర్యాదు విషయం బయటపడకుండా అటు ఎమ్మెల్యే, ఇటు పోలీసులు జాగ్రత్తలు తీసుకున్నా ఆ నోట.. ఈనోట పడి విషయం లీక్ అయింది. మాయగాళ్లకు ధర్మారెడ్డి కూడా డబ్బు ఇచ్చినట్లు ప్రచారం జరుగుతోంది.
ఎమ్మెల్యే సమీప బంధువు ఫిర్యాదు మేరకు కేసు విచారణ జరుపుతున్నట్లు సుబేదారి పోలీసులు విలేఖరులకు తెలిపారు. కాగా ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను మంత్రాల పేరిట మోసం చేసిన ఇద్దరు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకుని ఇంటరాగేట్ చేస్తున్నట్లు, ఇప్పటికే వారి నుంచి కొంత మొత్తం రికవరీ చేసినట్లు సమాచారం.
నా కుటుంబ సభ్యులు
డబ్బులిచ్చిన మాట వాస్తవమే
కోయదొరలు తన వద్దకు ఒకటి, రెండు పర్యాయాలు వస్తే పట్టించుకోలేదని, తన కుటుంబ సభ్యులకు మాయమాటలు చెప్పి పెద్దమొత్తంలో డబ్బు తీసుకున్నారని ఎమ్మెల్యే ధర్మారెడ్డి వెల్లడించారు.

చిత్రం.. ఎమ్మెల్యే ధర్మారెడ్డి