తెలంగాణ

కృష్ణమ్మపై వరుణుడి శీతకన్ను!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నల్లగొండ, జూలై 31: వర్షాభావ పరిస్థితులతో కృష్ణానదికి వరదలు కరువై జూరాల, శ్రీశైలం, నాగార్జున సాగర్ ప్రాజెక్టులు వెలవెలబోతున్నాయ. దీంతో తాగునీటి కోసం సాగర్ జలాశయంపై ఆధారపడిన హైదరాబాద్, నల్లగొండ ప్రజలకు గడ్డుకాలం సమీపించింది. నాగార్జున సాగర్ జలాశయంలో నీటిమట్టం ముందెన్నడూ లేని రీతిలో 500.70 అడుగులకు పడిపోవడంతో నీటి కరవు రోజురోజుకు జటిలమవుతోంది. కనిష్టంగా 502 అడుగుల మట్టాన్ని సైతం నిర్వహించేలా వారం పది రోజుల్లో శ్రీశైలం నుండి నీటి విడుదల జరుగకపోతే హైదరాబాద్ తాగునీటి అవసరాలకు సరిపడా నీరందించలేమని ఇరిగేషన్, మెట్రోవాటర్ వర్క్స్ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం పది ఎమర్జన్సీ మోటార్లలో ఆరు మాత్రమే నడుస్తుండగా, పుట్టంగండి సిస్టర్న్ రెండు ప్రధాన మోటార్లలో ఒక్కటి మాత్రమే నడిపిస్తున్నారు. ఏకెబిఆర్ రిజర్వాయర్ నుండి హైదరాబాద్‌కు 525 క్యూసెక్కులు అందిస్తున్నారు. అలాగే దేవరకొండ నియోజకవర్గం తాగునీటి అవసరాలకు 40 క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.
సాగుతున్న డ్రెడ్జింగ్..
పుట్టంగండి సిస్టర్న్ రెండు మోటార్లు నడిపించి హైదరాబాద్, నల్లగొండలకు తాగునీటి సమస్య తలెత్తకుండా చూడాలన్న లక్ష్యంతో మూడున్నర కోట్లతో చేపట్టిన ఎమర్జన్సీ మోటార్ల అప్రోచ్ కెనాల్ పొడిగింపు (డ్రెడ్జింగ్) పనులు వారం రోజులుగా కొనసాగుతున్నాయి. సాగర్ నీటిలో ఈ పనులు చేస్తున్నందున ముందుగా ఒకవైపు కాలువ తవ్వకం పూర్తి చేసి రెండోవైపు పనులు ప్రారంభించారు. కాలువ పనులు మూడు వారాల్లోగా పూర్తవుతాయని అప్పటిలోగా సాగర్ జలాశయానికి శ్రీశైలం నుండి నీటి విడుదల సాగకపోతే మరో వారం రోజుల తర్వాత హైదరాబాద్ నీటి సరఫరాలో కోత తప్పదని ఇరిగేషన్, మెట్రో వాటర్ వర్క్స్ అధికారులు స్పష్టం చేస్తున్నారు.
అప్రోచ్ కెనాల్ డ్రెడ్జింగ్ పనులు పూర్తయి ఎమర్జన్సీ మోటార్లకు తగినంత నీరందించేందుకు మూడు, నాలుగు వారాలు పడుతుందని, ఈలోగా శ్రీశైలం నుండి నీటి విడుదలపై ప్రభుత్వం దృష్టి సారించాలని వారు కోరుతున్నారు. ప్రస్తుతం ఏకెబిఆర్ రిజర్వాయర్‌లో 245 అడుగుల పూర్తి మట్టానికి గాను 237.05 అడుగులుగా ఉండగా రోజుకు 525 క్యూసెక్కులు ఖాళీ అవుతోంది. అలాగే నల్లగొండ జిల్లాలోని అయిటిపాముల, ఎడవెల్లి, ఉదయ సముద్రం తాగునీటి రిజర్వాయర్లు సైతం అడుగంటాయి. వాటి పరిధిలోని గ్రామాల్లో ఇప్పటికే తాగునీటి ఎద్దడి ఆరంభమైంది. ఈ నేపథ్యంలో రానున్న వారం పది రోజుల్లో శ్రీశైలం నుండి కనీసం రెండు మూడు టిఎంసిల నీటినైనా విడుదల చేయించేందుకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలని ఇరిగేషన్, మెట్రోవాటర్ వర్క్స్ అధికారులు కోరుతున్నారు.

చిత్రం.. నాగార్జున సాగర్ జలాశయం నీటి మట్టం పడిపోవడంతో ఏఎమ్మార్పీ మోటార్లకు నీరందించేందుకు చేపట్టిన డ్రెడ్జింగ్ పనుల కొనసాగింపు దృశ్యం