తెలంగాణ

ప్రాంతీయ పార్టీలే దెబ్బతీశాయి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఏప్రిల్ 9: 3ప్రాంతీయ పార్టీలే మా ఎదుగుదలకు అడ్డుపడ్డాయి..2 అని బిజెపి రాష్ట్ర శాఖ నూతన రథసారధిగా నియమితులైన డాక్టర్ కె. లక్ష్మణ్ తెలిపారు. అయినా మనోధైర్యంతో ముందుకు సాగి ప్రస్తుతం ఉన్న ఐదు స్థానాల నుంచి 50 స్థానాల్లో విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. బిజెపి రాష్ట్ర అధ్యక్షునిగా నియమితులైన కె. లక్ష్మణ్ శనివారం ఆంధ్రభూమి ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూ ముఖ్యాంశాలు...
1982లో తెలుగుదేశం పార్టీని ఎన్టీఆర్ స్థాపించి ఉండకపోతే రాష్ట్రంలో కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బిజెపినే ఉండేదని స్పష్టం చేశారు. ఆ తర్వాత 2002లో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు తెలంగాణ రాష్ట్ర సమితిని స్థాపించడం వల్ల బిజెపికి మరో దెబ్బ తగిలిందని ఆయన తెలిపారు. ప్రాంతీయ పార్టీలు స్థానిక అంశాల ప్రాతిపదికగా ప్రజల్లో భావోద్వేగాలు రెచ్చగొట్టడం వల్ల లబ్ధి పొందాయని, ఫలితంగా బిజెపి కోలుకోవడం కష్టంగా మారిందన్నారు. ప్రాంతీయ పార్టీల ఏర్పాటును తాను తప్పుపట్టడం లేదని, జరిగిన వాస్తవాన్ని చెబుతున్నానని స్పష్టం చేశారు. ఇలాంటి ప్రతికూల పరిస్థితుల్లో పార్టీ కార్యకర్తలు మొక్కవోని ధైర్యంతో ముందుకు సాగుతున్నారని తెలిపారు. ప్రస్తుతం ఐదుగురు ఎమ్మెల్యేలే ఉండవచ్చు, 2019 ఎన్నికల నాటికి 50 నుంచి 60 స్థానాలకు పార్టీ ఎదుగుతుందన్న ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. 2019 ఎన్నికలే లక్ష్యంగా పనిచేస్తామని అన్నారు. ఆ దిశగా పార్టీని బలోపేతం చేసేలా ముందుకు నడిపిస్తామని తెలిపారు. పార్టీ జాతీయ నాయకత్వం తనపై ఎంతో నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిందనీ, అందుకు అనుగుణంగా పార్టీని బలోపేతం చేసి, ఫలితాన్ని చూపిస్తానని ధీమా వ్యక్తం చేశారు. గ్రామస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసేందుకు కార్యాచరణ రూపొందిస్తామన్నారు. ఇందుకోసం పార్టీ సీనియర్ల అభిప్రాయాలు తీసుకుంటానన్నారు. గ్రామాల్లో మొక్కుబడిగా పర్యటించి వెంటనే తిరుగుముఖం పట్టకుండా ఒకటి, రెండు రోజులు అక్కడే ఉండి, వారి కష్టసుఖాలను తెలుసుకుని వాటిలో భాగస్వామ్యమై, ప్రజలకు చేరువ కావాల్సి ఉందన్నారు. ఇది ఒక రోజో, ఒక ఏడాదో చేసి ముగించకుండా, నిరంతరం కొనసాగిస్తామని ఆయన తెలిపారు. ఈ పర్యటనల్లో కేంద్ర ప్రభుత్వం చేపట్టిన, చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరిస్తూ, రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లో ఎండగడతామని లక్ష్మణ్ చెప్పారు. టిఆర్‌ఎస్ ఎన్నికల హామీలను అమలుచేయకపోతే ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని ఆయన హెచ్చరించారు.
ఏ ఎన్నికలు వచ్చినా ఆ ఐదుగురే పోటీ చేస్తుండడం పట్ల పార్టీలో నెలకొన్న అసంతృప్తిపై ప్రశ్నించగా, భవిష్యత్తులో ద్వితీయ శ్రేణి నాయకులకు తప్పకుండా అవకాశాలు కల్పిస్తామని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే రాజాసింగ్, మాజీ మంత్రి నాగం జనార్దన్‌రెడ్డిని, ఇంకా ఎవరైనా పార్టీకి దూరంగా, అసంతృప్తిగా ఉన్నట్లయితే వారందరినీ కలుపుకుని పోతానని ఆయన తెలిపారు.
త్వరలో పార్టీ జాతీయ నాయకత్వాన్ని కలిసి ఆ తర్వాత అధ్యక్ష బాధ్యతలు స్వీకరిస్తానని ఆయన చెప్పారు. బిజెపి నియమావళి ప్రకారం ఒక వ్యక్తి రెండు పదవుల్లో ఉండరాదు కాబట్టి, ప్రస్తుతం తాను విధులు నిర్వహిస్తున్న శాసనసభాపక్షం పదవిని పార్టీ ఎమ్మెల్యేలలో ఎవరికైనా అప్పగిస్తామని ఆయన తెలిపారు. ఈ విషయమై పార్టీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని లక్ష్మణ్ చెప్పారు.