తెలంగాణ

8మంది కిరోసిన్ డీలర్లపై కేసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 4: ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు చెల్లించకుండా తప్పించుకు తిరుగుతున్న 8 మంది హోల్‌సేల్ కిరోసిన్ డీలర్లపై కేసులు నమోదు చేయాలని పౌరసరఫరాల శాఖ కమిషనర్ సివి ఆనంద్ అధికారులను ఆదేశించారు. బకాయిలు చెల్లించకుండా అధికారులను తప్పుదారి పట్టించడమే కాకుండా వారిపై దురుసుగా ప్రవర్తించిన అఫ్సాన్, లిమ్‌రా ఏజెన్సీలు, హైదరాబాద్ సర్వీస్ స్టేషన్, విశాల్ ఎంటర్‌ప్రైజెస్, భద్రయ్య అండ్ సన్స్, శ్రీ అనంతుల ట్రేడర్స్, రాజయ్య అండ్ సన్స్, లక్ష్మయ్య అండ్ సన్స్, బినా ట్రేడర్స్, తార్నాక ఏజెన్సీ నిర్వాహకులపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. తప్పుడు సమాచారంతో కొంతమంది డీలర్లు న్యాయస్ధానాల్లో పిటీషన్లు దాఖలు చేయడం పట్ల కమిషనర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నేపధ్యంలో కొందరు డీలర్లకు ఆయన శనివారం కౌన్సిలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా కమిషనర్ ఆనంద్ మాట్లాడుతూ 2013 నుంచి కిరోసిన్ డీలర్ల నుంచి రావాల్సిన బకాయిలపై రికన్సలేషన్ నిర్వహించగా హైదరాబాద్, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో 66 మంది హోల్‌సేల్ కిరోసిన్ డీలర్ల నుంచి పౌరసరఫరాల శాఖకు రూ.10.12 కోట్ల బకాయిలు రావాల్సి ఉందని తెలిపారు.
దీనిలో హైదరాబాద్‌లో 43 మంది నుంచి రూ.7.35 కోట్లు, రంగారెడ్డి జిల్లాలో రూ.2.77 కోట్లు రావాల్సి ఉందని వెల్లడించారు. పలుసార్లు డీలర్లతో సంప్రదింపులు జరిపి, నోటీసులు ఇచ్చినా ఒక్క హైదరాబాద్‌లో రూ.58 లక్షలు మాత్రమే వసూలు అయ్యాయని అన్నారు. డీలర్ల సమస్యలు ప్రభుత్వం దృష్టికి తెస్తే అన్నీ పరిష్కరించినప్పుడు ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలు ఎందుకు చెల్లించరని ప్రశ్నించారు. బకాయిలు చెల్లించకుండా తప్పుడు సమాచారంతో కోర్టుకు వెళ్లడం ఎంతవరకు న్యాయమని అన్నారు. తాను కోర్టు కేసులకు భయపడే ప్రసక్తి లేదని, ప్రభుత్వానికి రావాల్సిన సొమ్మంతా కట్టి తీరాల్సిందేనని ఆనంద్ ఆగ్రహం వ్యక్తం చేశారు. బకాయిలు చెల్లించకపోవడానికి కారణం ఒకటి చెప్పాలని, కొందరు ఈ సమావేశానికి రాలేదని, రాకుండా రాష్ట్రం దాటి ఎక్కడిపోతారని అన్నారు. ఎక్కడికి పోయినా పట్టుకుంటామని హెచ్చరించారు.
డీలర్ల విజ్ఞప్తి మేరకు 5 లక్షల లోపు బకాయి పడిన వారు ప్రతి నెల సమానంగా రెండు విడతలుగా నవంబర్, డిసెంబర్‌లో, రూ.10 లక్షల లోపు ఉన్న వారు ప్రతి నెల సమానంగా నవంబర్ నుంచి వచ్చే ఫిబ్రవరి వరకు, రూ.20 లక్షల లోపు బకాయి ఉన్న వారు ప్రతి నెల సమానంగా ఎనిమిది విడతలుగా నవంబర్ నుంచి జూన్ 2018 వరకు, రూ.20 లక్షలకు పైగా ఉన్న వారు 12 నెలల్లో సమానంగా అక్టోబర్ 2018 నాటికి చెల్లించడానికి వెసులుబాటు కల్పిస్తున్నట్లు తెలిపారు. పాత బకాయిలను చెల్లిస్తూనే కిరోసిన్ ఫండ్ కింద ప్రభుత్వానికి చెల్లించాల్సిన బకాయిలను ప్రతి నెల 10లోగా చెల్లించాలని కమిషనర్ ఆదేశించారు.