తెలంగాణ

అసెంబ్లీ ముట్టడికి యత్నం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 7: నిరుద్యోగుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ భారతీయ జనతా పార్టీ యువ మోర్చా అసెంబ్లీ ముట్టడికి పిలుపునిచ్చింది. ఈ మేరకు బీజేవైఎం కార్యకర్తలు మంగళవారం ఉదయం అసెంబ్లీ ముట్టడికి యత్నించారు. ప్రభుత్వ శాఖల్లోని వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగ నియామకాల్లో తాత్సారం తగదంటూ నినదించారు. సీఎం డౌన్..డౌన్..అంటూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ నేపథ్యంలో అసెంబ్లీ పరిసరాల్లో ఉద్రిక్తత చోటుచేసుకోగా భారీగా పోలీసులు మోహరించారు. పలువురు బీజేవైఎం కార్యకర్తలను అరెస్టు చేసి గోషామహల్ ఠాణాకు తరలించారు. అసెంబ్లీ ముట్టడి కార్యక్రమానికి జిల్లాల నుంచి తరలివస్తున్న కార్యకర్తలను అక్కడిక్కడే అరెస్టు చేశారు. బిజెపి నాయకుల హైదరాబాద్ రాకను అడ్డుకున్నారు.
నగరంలోని బషీర్‌బాగ్ చౌరస్తా వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. నిరుద్యోగుల సమస్యలపై అసెంబ్లీ ముట్టడికి వస్తున్న కార్యకర్తల అక్రమ అరెస్టులను నిరసిస్తూ బిజెపి ఎమ్మెల్యేలు రోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. బీజేవైఎం నాయకులను అరెస్టు చేయడం అప్రజాస్వామిక చర్య అంటూ నాయకులు నినదించారు. అరెస్టు చేసిన వారిని తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అక్కడి నుంచి అసెంబ్లీ ముట్టడికి బిజెపి ఎమ్మెల్యేలు జి కిషన్‌రెడ్డి, కె లక్ష్మణ్, బీజేపీ జాతీయ నేత మురళీధర్‌రావు బయలుదేరారు. సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకుని బీజేపీ నాయకులు, కార్యకర్తలను అరెస్టు చేశారు. దీంతో బీజేపీ, బీజేవైఎం నాయకులు, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. దీంతో పోలీసులు పలువురు నాయకులన అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె లక్ష్మణ్, ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి మాట్లాడుతూ, తెరాస ప్రభుత్వం నిరుద్యోగులతో చెలగాటమాడుతుందని, రాష్ట్రంలో వేలాది పోస్టులు ఖాళీగా ఉన్నాయని, వాటిని వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు.

చిత్రం..కార్యకర్తల అరెస్టులను నిరసిస్తూ బషీర్‌బాగ్‌లో బైఠాయంచిన బీజేపీ నేత కిషన్‌రెడ్డి, కార్యకర్తలు