తెలంగాణ

ఈ వెలుగులకే ఈ ప్రస్థానం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 8: దేశంలో ఏ రాష్ట్రం చేయని సాహసం తెలంగాణ చేస్తోందని, రైతులకు 24 గంటలపాటు నాణ్యమైన ఉచిత విద్యుత్ సరఫరాతో సరికొత్త రికార్డు నెలకొల్పుతోందని సీఎం కె చంద్రశేఖరరావు ప్రకటించారు. విద్యుత్ రంగానికి సంబంధించి అన్నివిధాలా కొత్త సంస్కరణలు తీసుకొస్తున్నట్టు ప్రకటించారు. కొత్త సబ్‌స్టేషన్ల ఏర్పాటు, కొత్త లైన్ల నిర్మాణం, అదనపు ఉత్పాదక కేంద్రాలు నెలకొల్పుతున్నామని ప్రకటించారు. రాష్ట్రంలో విద్యుత్ వినియోగం 26శాతం మేర పెరిగిందని సిఎం వివరించారు. బుధవారం శాసనసభలో విద్యుత్‌పై సీఎం కేసీఆర్ ఒక ప్రకటన చేస్తూ, దశాబ్దాలుగా కరెంట్ కష్టాలు అనుభవించిన రైతాంగానికి ఇది తీపి కబురు అన్నారు. చరిత్రలో మొదటిసారి రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు గత రాత్రి నుంచి ప్రయోగాత్మకంగా 24 గంటలపాటు విద్యుత్ సరఫరా చేస్తున్నామన్నారు. ఐదారు రోజులపాటు దీన్ని అధ్యయనం చేసి, వచ్చే రబీ నుంచి శాశ్వత ప్రాతిపదికన నిరంతర విద్యుత్ సరఫరాకు తుది ఏర్పాట్లు చేస్తామన్నారు. తెలంగాణలో 25శాతం విద్యుత్ వ్యవసాయ పంపుసెట్లకే వినియోగిస్తున్నారన్నారు.
ఇటీవల రాష్ట్రంలో 9500 మెగావాట్ల గరిష్ట డిమాండ్ ఏర్పడినా, ఎక్కడా రెప్పపాటు కోత విధించకుండా రికార్డుస్థాయిలో 198 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా చేయడం జరిగిందన్నారు. వచ్చే రబీ సీజన్‌లో వ్యవసాయానికి 24 గంటల కరెంట్ ఇవ్వడంవల్ల ఏర్పడే 11000 మెగావాట్ల డిమాండ్ మేరకు సరఫరా చేయడానికి విద్యుత్ సంస్థలు సర్వసన్నద్ధంగా ఉన్నాయని ప్రకటించారు. తెలంగాణ ఏర్పడిననాటికి రాష్ట్రంలో స్థాపిత విద్యుదుత్పత్తి సామర్థ్యం 6574 మెగావాట్లు ఉందని, గడచిన మూడున్నరేళ్లలో అదనంగా మరో 7981 మెగావాట్ల విద్యుత్‌ను సమకూర్చుకోగలిగామని అన్నారు. సింగరేణి ప్లాంట్ ద్వారా 1200 మెగావాట్లు, కెటిపిపి ద్వారా 600 మెగావాట్లు, జూరాల ద్వారా 240 మెగావాట్లు, పులిచింతల ద్వారా 90 మెగావాట్లు, చత్తీస్‌గఢ్ ద్వారా 1000 మెగావాట్లు, ఇతర మార్గాల్లో మరో 2వేల మెగావాట్లు అదనంగా సమకూర్చుకున్నామని అన్నారు. నేడు స్థాపిత విద్యుదుత్పత్తి సామర్ధ్యం 14,555 మెగావాట్లకు చేరిందని, మరో 13,752 మెగావాట్లు విద్యుదుత్పత్తి కోసం కొత్త ప్లాంట్ల నిర్మాణం జరుగుతోందని వివరించారు. వ్యవసాయానికి 8500 మెగావాట్లు అవసరం అవుతుందని, అలాగే పరిశ్రమల డిమాండ్‌ను కూడా దృష్టిలో ఉంచుకున్నామని చెప్పారు. యాదాద్రి అల్ట్రా మెగా పవర్ ప్లాంట్ నిర్మాణం పూర్తయితే 4 వేల మెగావాట్లు, కొత్తగూడెం పవర్‌ప్లాంట్ ద్వారా 1880 మెగావాట్లు, ఎన్‌టిపిసి ద్వారా 1600 మెగావాట్లు సమకూరుతుందని అన్నారు. మొత్తం మీద 28వేల మెగావాట్ల విద్యుదుత్పత్తి సామర్థ్యంతో విద్యుత్ మిగులు రాష్ట్రంగా తెలంగాణ మారుతుందని వివరించారు. మొత్తం వ్యవహారాలను పర్యవేక్షించే బాధ్యతను బిహెచ్‌ఇఎల్‌కు అప్పగించామని, పంపిణీ వ్యవస్థ బలోపేతానికి 12,136 కోట్లు వెచ్చిస్తున్నామని ప్రకటించారు. రాబోయే నాలుగేళ్లలో పంపిణీ, సరఫరా వ్యవస్థల బలోపేతానికి మరో 42వేల కోట్ల పెట్టుబడితో కొత్తగా 400 కెవి సబ్ స్టేషన్లు 18, 220 కెవి సబ్‌స్టేషన్లు 34, 132 కెవి సబ్‌స్టేషన్లు 90, 33/11 కెవి సబ్‌స్టేషన్లు 937 నిర్మించడానికి ప్రణాళిక రూపొందించినట్టు ప్రకటించారు. గతంలో 400 కెవి లైన్లు 1682 కిలోమీటర్లు ఉండగా, కొత్తగా 1012 కిలోమీటర్లు ఏర్పాటు చేశామన్నారు. 220 కెవి లైన్లు 5559 కిలోమీటర్లు ఉండగా, కొత్తగా 1340 కిలోమీటర్లు వేశామని, 132 కెవి లైన్లు 9136 కిమీ ఉండగా కొత్తగా 1184 కిమీ వేశామని తెలిపారు. డిస్ట్రిబ్యూషన్ లైన్లు కూడా బాగా పెంచామని తెలిపారు. పెరుగుతున్న డిమాండ్‌కు అనుగుణంగా సరఫరా వ్యవస్థను తీర్చిదిద్దడానికి హైటెన్షన్ సరఫరా సామర్థ్యాన్ని 12653 మెగావాట్ల నుండి 20,660 మెగావాట్లకు పెంచామన్నారు. ఉత్తర, దక్షిణ గ్రిడ్‌ల మధ్య కొత్త విద్యుత్ లైన్ల నిర్మాణం, వార్దా -మహేశ్వరం వయా డిచ్‌పల్లి మధ్య డబుల్ సర్క్యూట్ లైన్ల నిర్మాణం పూరె్తైందని, దీనివల్ల 2వేల మెగావాట్ల విద్యుత్ పొందడానికి వీలవుతుందని వివరించారు. హైదరాబాద్‌కు నిరంతర విద్యుత్‌కు జిహెచ్‌ఎంసి చుట్టూ 142 కిలోమీటర్లు మేర 400 కెవి రింగ్ సిస్టం ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. డిస్కామ్‌లపై ఆర్ధిక భారం తొలగించడానికి తెలంగాణ రాష్ట్రం ఉదయ్ పథకంలో చేరిందని, డిస్కామ్‌ల రుణభారాన్ని ప్రభుత్వం భరిస్తోందని తెలిపారు. ప్రభుత్వం పేదలకు విద్యుత్ సబ్సిడీలు అందించడానికి 4777 కోట్ల రూపాయిలను కేటాయించిందని వెల్లడించారు. విద్యుత్ సంస్థలలో పనిచేసే 22,550 మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను కాంట్రాక్టు వ్యవస్థ నుండి తప్పించి నేరుగా 13357 ఉద్యోగులను భర్తీ చేస్తోందని వెల్లడించారు.