తెలంగాణ

హైస్కూల్ చదువే ఆధారంగా స్థానికత నిర్ధారణ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 9: రాష్ట్రంలో ఉపాధ్యాయుల ఖాళీల భర్తీ సమయంలో అభ్యర్ధులు హైస్కూల్ చదువు ఆధారంగానే స్థానికతను నిర్ధారిస్తామని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి వెల్లడించారు. గురువారం నాడు శాసనసభ ప్రశ్నోత్తర కార్యక్రమంలో గాదరి కిశోర్ కుమార్, చల్లా వంశీచంద్‌రెడ్డి, ర్యాగ కృష్ణయ్య తదితరులు అడిగిన ప్రశ్నలకు బదులిస్తూ, రాష్ట్రంలో సాంక్షన్ టీచర్ పోస్టులు 1,22,955 కాగా, అందులో 1,09,256 మంది పనిచేస్తున్నారని, ఇంకా 13,699 పోస్టులు ఖాళీగా ఉన్నాయని వాటిలో పదోన్నతులకు 30 శాతం ఖాళీలు పోను, మిగిలిన 8782 పోస్టుల భర్తీకి ప్రభుత్వం నిర్ణయించిందని అన్నారు.
గతంలో టెట్ రాసిన వారికి కూడా ఈసారి పరీక్షలో అనుమతిస్తున్నామని పేర్కొన్నారు. డిఇడి చేసిన వారికి ఎస్‌జిటి, బిఇడి చేసిన వారికి స్కూల్ అసిస్టెంట్ పోస్టులను కేటాయించామని అన్నారు. అభ్యర్ధులు 4వ తరగతి నుండి 10వ తరగతి వరకూ ఎక్కడ చదవితే అదే స్థానికతగా పరిగణిస్తామని ఆయన అన్నారు. ప్రస్తుతం 11,428 మంది విద్యావాలంటీర్లు పనిచేస్తున్నారని, ఈ ఏడాది 544 గురుకులాలను ప్రభుత్వం ప్రారంభించిందని చెప్పారు. వీటిలో 8వేల పోస్టులను ఈ ఏడాది ప్రభుత్వం భర్తీ చేస్తోందని, మరో 8వేల పోస్టులను వచ్చే ఏడాది భర్తీ చేస్తామని పేర్కొన్నారు.
స్కూళ్లలో ఫీజుల నిర్ధారణకు నియమించిన ప్రొఫెసర్ టి తిరుపతిరావు కమిటీ నివేదిక ఈ నెలాఖరుకు అందుతుందని భావిస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి చెప్పారు. ఎస్‌ఎ సంపత్‌కుమార్, టి రామమోహనరెడ్డి తదితరులు అడిగిన ప్రశ్నలకు ఆయన బదులిస్తూ, కమిటీ నియామకానికి సంబంధించి మార్చి 21న జీవో 37ను జారీ చేశామని అన్నారు. ఫీజుల నియంత్రణకు గతంలో కూడా జీవోలు ఇచ్చారని, 1994లో జీవో-1, 2009లో జీవో-91ను, 2010లో జీవో 42ను ఇచ్చారని, యాజమాన్యాలు కోర్టును ఆశ్రయించడంతో జీవో 91ను న్యాయస్థానం కొట్టివేసిందని, దాంతో ఆ జీవోను అమలుచేయలేకపోయామని, జీవో -42పై కూడా స్టే విధించిందని వివరించారు.
వచ్చే ఏడాది జనవరి 3 నుండి 7వ తేదీ వరకూ 105వ ఇండియన్ సైన్స్ కాంగ్రెస్‌ను ఘనంగా నిర్వహిస్తామని కడియం శ్రీహరి చెప్పారు. భారత ప్రధాని నరేంద్రమోదీ సహా నోబెల్ పురస్కార గ్రహీతలు హాజరవుతారని అన్నారు. గురువారం నాడు ఆయన సచివాలయంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షకు ప్రభుత్వ ప్రత్యేక ప్రధానకార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉస్మానియా విసి ప్రొఫెసర్ రామచంద్రం, రిజిస్ట్రార్ గోపాల్‌రెడ్డి, సైన్స్ కాంగ్రెస్ జనరల్ సెక్రటరీ అచ్యుత సామంత, చిల్ట్రన్ సైన్స్ కాంగ్రెస్ కన్వీనర్ డి అశోక్ తదితరులు హాజరయ్యారు. మొత్తం 14 థీమాటిక్ సెషన్లు ఉంటాయని అధికారులు పేర్కొన్నారు. యూనివర్శిటీలో మంచి వాతావరణం నెలకోల్పాలని డిప్యుటీ సిఎం పేర్కొన్నారు. వచ్చే అతిథులకు వసతులు కల్పించాలని కడియం శ్రీహరి అధికారులకు సూచించారు.