తెలంగాణ

సాగు జలాలపై ఆందోళన వద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిజామాబాద్, నవంబర్ 9: రబీలో వ్యవసాయ రంగానికి సరిపడా సాగు నీటిని అందించేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామని, సాగు జలాల విషయంలో రైతులు ఎలాంటి ఆందోళనకు గురి కావాల్సిన అవసరం లేదని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి భరోసా కల్పించారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద ఒక్క గుంట భూమి సైతం ఎండిపోనివ్వకుండా, ప్రతి ఎకరాకు సాగునీరందిస్తామని అన్నారు. గతేడాది రబీలో 2.10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో సాగు చేసిన పంటలకు సకాలంలో నీటిని అందించి కాపాడుకోగలిగామని, అదే తరహాలో ఈసారి కూడా ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ రైతాంగానికి సాగునీటి కొరత ఉత్పన్నం కాకుండా చూస్తామని ధీమా వెలిబుచ్చారు. రబీ అవసరాలకు సరిపడా నిజాంసాగర్‌లో నీటి నిల్వలు ఉన్నాయని, రైతులు అనవసర ఆందోళనలకు గురవడం తగదని మంత్రి పోచారం పేర్కొన్నారు. కోటగిరి, రుద్రూర్ మండల కేంద్రాల్లో గురువారం పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్న సందర్భంగా మంత్రి పోచారం రైతులను ఉద్దేశించి పై వ్యాఖ్యలు చేస్తూ, వారిలో భరోసాను నింపే ప్రయత్నం చేశారు. సింగూరు నుండి 15 టీఎంసీల నీటిని విడుదల చేస్తున్నప్పటికీ, ఆ నీటిని ఎస్సారెస్పీలోకి మళ్లించి కాకతీయ కాల్వ ద్వారా కరీంనగర్ జిల్లాలోని లోయర్ మానేరు డ్యాంకు తరలిస్తుండడం పట్ల నిజామాబాద్ ఉమ్మడి జిల్లా రైతాంగంలో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. నిజాంసాగర్ ఆయకట్టుతో పాటు గుత్ప, అలీసాగర్ ఎత్తిపోతల పథకాలపై ఆధారపడ్డ రైతులు, ఎస్సారెస్పీ నీటిని నమ్ముకుని పంటలు సాగు చేసేందుకు సమాయత్తమైన అన్నదాతలంతా ఎల్‌ఎండీకి నీటి సరఫరాపై అభ్యంతరాలు వెలిబుచ్చుతున్నారు. సింగూరు జలాలు నిజామాబాద్ ఉమ్మడి జిల్లా ప్రయోజనాల కోసమే వినియోగించాల్సి ఉండగా, ప్రభుత్వం మునుపెన్నడూ లేనివిధంగా ఎస్సారెస్పీలోకి మళ్లించి ఎల్‌ఎండీకి తరలిస్తుండడం ఆందోళనకు కారణమవుతోంది. ఎస్సారెస్పీలోకి సింగూరు జలాలు ఇంకనూ చేరుకోనప్పటికీ, శ్రీరాంసాగర్ కాకతీయ కాలువ ద్వారా 6 వేల క్యూసెక్కుల చొప్పున నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. నిజానికి ఈ ఏడాది తీవ్ర వర్షాభావ పరిస్థితుల కారణంగా ఎస్సారెస్పీలోకి 69 టీఎంసీల వరకే వరద జలాలు వచ్చి చేరాయి. అయినప్పటికీ ఈ సీజన్‌లో ఇప్పటివరకు లోయర్ మానేరు డ్యాంకు 13 టీఎంసీల వరకు ఎస్సారెస్పీలోని నిలువ నీటిని విడుదల చేశారు. తాజాగా సింగూరు నీటిని కూడా ఎస్సారెస్పీలోకి మళ్లిస్తూ, అక్కడి నుండి ఎల్‌ఎండీకి విడుదల చేస్తుండడం వివాదాస్పదమవుతోంది. ఈ విషయమై రైతులతో కలిసి ప్రతిపక్షాలు గత రెండు రోజుల నుండి నిజాంసాగర్ ఆయకట్టు పరిధిలోని అన్ని ప్రాంతాల్లోనూ పెద్దఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తూ నిరసనలు చాటుతున్నారు. నిజాంసాగర్ ఆయకట్టు కింద 2.10 లక్షల ఎకరాల విస్తీర్ణంలో పంటలు సాగు చేసేందుకు అవకాశం ఉండగా, వాటిని కాపాడాలంటే కనీసం 22 టీఎంసీల నీటి నిల్వలు అవసరం అవుతాయి. అంటే నిజాంసాగర్‌లో పూర్తి స్థాయి నీటిమట్టమైన 17.8 టీఎంసీలను వినియోగించుకున్నప్పటికీ, అదనంగా మరో నాలుగున్నర టీఎంసీల వరకు చివరి తడుల రూపంలో నీటిని అందించాల్సి వస్తుంది. అలాంటి సమయంలో ఎగువన ఉన్న సింగూరు నుండి నీటిని మళ్లించుకుని పంటలను కాపాడేలా ప్రణాళికలు రూపొందించుకోకుండా, సింగూరు జలాలను ఎల్‌ఎండికి తరలిస్తున్నారని ప్రతిపక్షాలు ఆక్షేపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో గురువారం కోటగిరి, రుద్రూర్ మండలాల్లో పర్యటించిన మంత్రి పోచారం ఈ విషయమై స్పందిస్తూ, రైతులు సాగు నీటి విషయంలో ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదని, గతేడాది తరహాలోనే ప్రస్తుత రబీలోనూ చివరి ఆయకట్టు వరకు నీటిని అందిస్తామని భరోసా కల్పించారు.

కోటగిరి మండల కేంద్రంలో గురువారం అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తున్న మంత్రి పోచారం