తెలంగాణ

స్వైన్‌ఫ్లూ నివారణలో రాష్ట్రం భేష్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, నవంబర్ 12: స్వైన్‌ఫ్లూ నివారణలో తెలంగాణ దేశంలోనే ప్రథమ స్థానం సాధించింది. ప్రభుత్వం తీసుకుంటున్న ముందు జాగ్రత్త చర్యలు, వేగంగా పరీక్షలు నిర్వహించి, వ్యాధి నిర్దారణ చేయడం, దవాఖానాల్లో స్వైన్‌ఫ్లూ కోసం ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి సరైన చికిత్స అందించడం తదితర కారణాల వల్ల స్వైన్‌ఫ్లూ వల్ల జరుగుతున్న మరణాల సంఖ్య బాగా తగ్గింది. ఈ సంవత్సరం జనవరి నుండి అక్టోబర్ వరకు స్వైన్‌ఫ్లూ సోకిన వంద మందిలో మహారాష్టల్రో 10 నుండి 11 మంది వరకు చనిపోతున్నట్టు అధికారిక సమాచారం అందింది. అలాగే గుజరాత్‌లో 5 నుండి 6 గురు మరణిస్తున్నారు. తెలంగాణలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. తెలంగాణలో నూరు మందికి ఈ వ్యాధి సోకితే ఒకరు మరణిస్తున్నారు.
2014 లో 860 మందికి పరీక్షలు నిర్వహించగా 75 మందికి వ్యాధి సోకినట్టు రికార్డయింది. వీరిలో 10 మంది మరణించారు. 2015 లో 12,600 మందికి పరీక్షలు నిర్వహించగా, 2956 మందికి వ్యాధిసోకినట్టు నిర్దారణ అయింది. వీరిలో 101 మంది చనిపోయారు. 2016 లో 4422 మందికి పరీక్షలు నిర్వహించగా,166 మందికి వ్యాధిసోకినట్టు నిర్దారణ కాగా 12 మంది మరణించారు. 2017 జనవరి నుండి అక్టోబర్ వరకు 14,365 మందికి పరీక్షలు నిర్వహించగా, 2112 మందికి వ్యాధిసోకినట్టు నిర్దారణ కాగా, 19 మంది మరణించారని రికార్డులు తెలియచేస్తున్నాయి.
స్వైన్‌ఫ్లూతో పాటు అన్ని రకాల వ్యాధులకు అవసరమైన చికిత్సను అందిస్తున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య మంత్రి డాక్టర్ సి. లక్ష్మారెడ్డి తెలిపారు. ఆదివారం ఆయన ఆంధ్రభూమి ప్రతినిధితో మాట్లాడుతూ, ప్రభుత్వ దవాఖానాల్లో మెరుగైన చికిత్స అందిస్తున్నామన్నారు. గాంధీ దవాఖానాలో స్వైన్‌ఫ్లూ సెంటర్‌ను ఏర్పాటు చేశామని, ఇక్కడ ప్రత్యేక వార్డులు ఏర్పాటు చేసి, వివిధ ప్రాంతాలనుండి రోగులను తరలించి చికిత్స అందిస్తున్నామని వివరించారు. గతంలో సర్కారు దవాఖానాలకు వచ్చేందుకు ప్రజలు భయపడేవారని, ఇప్పుడు సర్కారు దవాఖానాల్లోనే చికిత్స కావాలంటూ వస్తున్నారన్నారు. 2009 లో స్వైన్‌ఫ్లూను హైదరాబాద్‌లో కనుగొన్న తర్వాత ఎప్పటికప్పుడు చికిత్సకు మెరుగైన ఏర్పాట్లు జరిగాయని గుర్తు చేశారు. అన్నిస్థాయిలలోని దవాఖానాల్లో సిబ్బందికి ప్రత్యేక శిక్షణ ఇచ్చామని, దాంతో సకాలంలో స్వైన్‌ఫ్లూతో పాటు ఇతర వ్యాధులకు చికిత్స అందించగలుగుతున్నామని లక్ష్మారెడ్డి వివరించారు.